మహోజ్వల భారతి: వ్యక్తులు, ఘటనలు, సందర్భాలు, స్థలాలు, సమయాలు

1 Jun, 2022 20:27 IST|Sakshi
నెహ్రూ, నర్గిస్‌

ప్రీ–ప్రీడమ్, పోస్ట్‌ ఫ్రీడమ్‌

సంస్కృతి–సంప్రదాయం
టాగోర్‌ సోదరుడు సత్యేంద్రనాథ్‌ బ్రిటిష్‌ ఇండియాలో తొలి ఐఏఎస్‌. ఉద్యోగరీత్యా ఆయన బ్రిటన్‌ వెళుతున్నప్పుడు ఆయన భార్య జ్ఞానదానందినీ దేవి భర్త వెంట ఆరు గజాల చీరకట్టు లోనే వెళ్లారు. బ్రిటన్‌లో అంతా ఆమెను చిత్రంగా చూశారు! చీరకట్టు మన భారతీయ మహిళలకు కొత్త కాకపోయినా, ఆరు గజాల చీరకట్టును ‘ఇన్వెంట్‌’ చేసింది మాత్రం జ్యానదానందినీ దేవేనని అంటారు. సత్యేంద్రనాథ్‌ 1842 జూన్‌ 1న జన్మించారు. జ్ఞానదానందినీదేవి, రవీంద్రనాథ్‌ టాగోర్‌ వదిన.

స్ఫూర్తి గాంధీజీ
భారత 6వ రాష్ట్రపతి నీలం సంజీవరెడ్డి రాజకీయ జీవితం అనేక ఒడిదుడుకులతో కూడుకున్నది. అనేక విజయాలు, కొన్ని అపజయాలతో పాటు, కొన్ని త్యాగాలూ ఆయన జీవితంలో ఉన్నాయి. 1929 లోనే మహాత్మా గాంధీ స్ఫూర్తితో చదువును పక్కనపెట్టి రాజకీయాల్లో చేరి స్వాతంత్య్ర పోరాటం వైపు దృష్టి సారించారు. 1937లో ఆంధ్ర ప్రాంతీయ కాంగ్రెసు కమిటీకి కార్యదర్శిగా ఎన్నికై దాదాపు పదేళ్లపాటు ఆ పదవిలో కొనసాగారు. క్విట్‌ ఇండియా ఉద్యమంలో పాల్గొని డిటెన్యూగా జైలుకు వెళ్లారు నేడు నీలం వర్ధంతి. 1913 మే 19న ఇల్లూరులో జన్మించిన సంజీవరెడ్డి 1996 జూన్‌ 1న బెంగళూరులో కన్ను మూశారు.

నెహ్రూను కదిలించిన  ‘మదర్‌ ఇండియా’ 
ఇండియాకు స్వాతంత్య్రం వచ్చిన పదేళ్లకు 1957లో ‘మదర్‌ ఇండియా’ చిత్రం విడుదలైంది. మహబూబ్‌ ఖాన్‌ దర్శకత్వం వహించిన ఈ బాలీవుడ్‌ చిత్రంలో నర్గిస్‌ దత్, సునీల్‌ దత్, రాజేంద్ర కుమార్, రాజ్‌ కుమార్‌ నటించారు. ఈ సినిమా 1958 లో ఆస్కార్‌ అవార్డుకు ఉత్తమ విదేశీ భాషా చిత్రం కేటగిరీలో నామినేట్‌ అయింది. మహబూబ్‌ ఖాన్‌ స్వాతంత్య్రానికి పూర్వం 1940లో ఔరత్‌ (స్త్రీ) అనే చిత్రం నిర్మించారు.

దాని ఆధారంగానే ‘మదర్‌ ఇండియా’ నిర్మించారు. భారతదేశపు గ్రామ పరిసరాలను ప్రతిబింబించే ఈ చిత్రంలో భారతీయ సగటు స్త్రీ తన కుటుంబంకోసం, తన పిల్లలకోసం పడే పాట్లను హృద్యంగా చిత్రీకరించారు. మదర్‌ ఇండియా ప్రధాన కథానాయికగా నర్గిస్‌ మహామహుల ప్రశంసలు అందుకున్నారు. జవహర్‌లాల్‌ నెహ్రూ, బాబూ రాజేంద్ర ప్రసాద్, ఇందిరా గాంధీ ఈ చిత్రం ప్రివ్యూ సందర్భంగా నర్గిస్‌ నటనను కొనియాడారు. నెహ్రూ అయితే ఎమోషనల్‌ అయ్యారని చిత్ర బృందం అప్పటి మీడియాకు వెల్లడించింది. నర్గిస్‌ తన కెరీర్‌ ను పసితనంలోనే ప్రారంభించారు.

బాలనటిగా 1935 లో ‘తలాషె హక్‌’ చిత్రంలో తన ఆరవయేట నటించారు. ఆ చిత్రంలో ఈమె పేరు బేబీ నర్గిస్‌. ఇదే పేరు తరువాత స్థిరపడిపోయింది. ఆ తరువాత నర్గిస్‌ ఎన్నో సినిమాలలో నటించారు. తన 14వ యేట మెహబూబ్‌ ఖాన్‌ సినిమా తక్దీర్‌ (1943) లో ఆమె కనిపించారు. బర్సాత్‌ (1949), అందాజ్‌ (1949), ఆవారా(1951), దీదార్‌(1951), శ్రీ420(1955), చోరీ చోరీ (1956) చిత్రాలు నర్గిస్‌కు మంచి పేరు తెచ్చాయి. నేడు నర్గిస్‌ జయంతి. 1929 జూన్‌ 1న కలకత్తాలో జన్మించారు.

మరిన్ని వార్తలు