సైన్స్‌ ఫిక్షన్‌ ఫ్రీడమ్‌ యాక్షన్‌

19 Jul, 2022 13:22 IST|Sakshi

సీతారామచంద్రరావు రాసిన ఏకైక తెలుగు సైన్స్‌ ఫిక్షను కథ ‘అదృశ్య వ్యక్తి’! కథ శీర్షిక చూడగానే చాలా మందికి హెచ్‌.జి.వెల్స్‌ ‘ది ఇన్‌ విజిబుల్‌ మ్యాన్‌’ గుర్తుకు వస్తుంది. అయితే హెచ్‌.జి. వెల్స్‌ లో లేనిది,  సీతారామచంద్రరావు కథలో ఉన్నది భారత స్వాతంత్య్ర పోరాటం!   తెలుగు సైన్స్‌ ఫిక్షన్‌కు కూడా స్వాతంత్య్రోద్యమ స్ఫూర్తి కారణమయ్యిందా?  ఇలాంటి ప్రశ్న ఎదురైతే, ఆశ్చర్యపడేవారు ఎందరో ఉన్నారు! కానీ నిజం, ఈ చరిత్ర తెలుసుకుంటే! సైన్స్‌ మూలసూత్రాలను ఆకళింపు చేసుకుని, ఆ పునాదులపై కల్పనలను పేనుకుని సాహిత్య సృజన చేస్తే అదే ‘సైన్స్‌ ఫిక్షను’ అవుతుంది. ప్రపంచ వ్యాప్తంగా 1926ను సైన్స్‌ ఫిక్షను అనే ప్రక్రియను నిర్వచించి, దానికి ప్రాధాన్యత ఇచ్చిన సంవత్సరంగా పరిగణిస్తారు. ఆ తర్వాతి సంవత్సరంలోనే తెలుగు సైన్స్‌ ఫిక్షను కథ వెలుగు చూడటం మనకు గర్వకారణం.

‘పరమాణువులో మేజువాణి’
అప్పటికి స్వాతంత్య్ర జ్వాలలు వ్యాపించడం మొదలై పుష్కరమైంది. రౌలత్‌ చట్టాన్ని వ్యతిరేకించడం, జలియన్‌ వాలాబాగ్‌ దురంతం, విదేశీ వస్త్ర బహిష్కరణ, సహాయ నిరాకరణ వంటి కార్యక్రమాలతో మన దేశం అట్టుడికిపోతోంది. అలాంటి 1927, 1928 సంవత్సరాలలో రూపం పోసుకున్న సైన్స్‌ ఫిక్షను సందర్భం.. ఖచ్చితంగా ఆ నేపథ్యాన్ని తిరస్కరించే అవకాశమే లేదు!

తెలుగు తొలి సైన్స్‌ ఫిక్షన్‌ కథ ‘పరమాణువులో మేజువాణి’ హైదరాబాదుకు చెందిన సిరిగూరి జయరావు 1927 డిసెంబరు ‘సుజాత’ పత్రికలో రాశారు. రెండో కథ ‘అదృశ్యవ్యక్తి’ని ఒద్దిరాజు సీతారామచంద్రరావు అదే పత్రికలో 1928 అక్టోబరు సంచికలో రాశారు. కేవలం పదినెలల వ్యవధిలో ఈ రెండు కథలు హైదరాబాదు నుంచి వెలుగు చూడటం గర్వకారణం. మొదటి కథను రాసిన కథకుడి నేపథ్యం ఉద్యమ పోరాటం కాగా, రెండో కథ ఉద్యమ పోరాటంతో ముగుస్తుంది. 

గాంధీజీ ప్రస్తావన
‘‘... భోగము వాండ్రకు వృత్తి మాన్పించి, మేజువాణీలను మారు మూలలకు ద్రోసివైచి యప్పుడే పాతిక సంవత్సరములు దాటినవి. అక్కడక్కడ నలుసులు మిగిలినా మహాత్ముని మొన్న మొన్నటి చీవాట్ల ముందర నదృశ్యములాయెనని చెప్పవచ్చును..’’ అని తొలి పేరాలోనే గాంధీజీ ప్రస్తావన ‘పరమాణువులో మేజువాని’ కథలో కనబడుతుంది. అలాగే రచయితకుండే సంఘసంస్కరణ దృష్టి కూడా ద్యోతకమవుతుంది. ప్రవరుడు హిమాలయాలకు వెళ్లినట్టు, ఇక్కడ కథకుడు పరమాణువులోనికి వెళ్లిరావడం వస్తువు. అయితే,ఈ కథకుడి జీవితం మరింత ఆసక్తికరం, స్ఫూర్తిదాయకం! 

హైదరాబాదులో బి.ఎస్సీ చదివిన సిరిగూరి జయరావు పరిశోధన చేయాలని సర్‌ సి.వి.రామన్‌ వద్ద కలకత్తాలో చేరారు. అక్కడ ఉండగానే 1927లో ఐ.సి.ఎస్‌ (ఇప్పటి ఐ.ఏ.ఎస్‌.) పరీక్ష ఉత్తీర్ణుౖలై మధ్యప్రదేశ్‌ ప్రాంతంలో కలెక్టరుగా చేరారు. సంఘసంస్కరణ, స్వాతంత్య్రోద్యమం ప్రాముఖ్యత తెలిసిన జయరావు తన ఉద్యోగానికి రాజీనామా చేయాలని తలంచారు. అలాంటి నేపథ్యంతో అప్పటికే కలెక్టర్‌ ఉద్యోగానికి రాజీనామా చేసిన ఎన్‌.హెచ్‌.వి. కామత్‌ను కలిసి, చర్చించి నిర్ణయం తీసుకోవాలని జయరావు తలంచారు. కామత్‌ను కలవాలని కారులో ప్రయాణం చేస్తూ ప్రమాదంలో 33 సంవత్సరాల వయస్సున్న జయరావు కన్ను మూయడం కడు విషాదం! జయరావు జీవిత విశేషాలు ఎంతో స్ఫూర్తిని రగుల్చుతాయి. 

అదృశ్య వ్యక్తి 
తెలంగాణ గ్రామసీమల్లో సైన్స్‌ పరికరాలు తొలుత పరిచయం చేసిన వారు ఒద్దిరాజు సోదరులు. ఒద్దిరాజు రాఘవ రంగారావు, సీతారామచంద్రరావు సోదరులు ఉర్దూ, పార్శీ, సంస్కృతం, ఇంగ్లీషు భాషలను అదనంగా నేర్చుకుని సంగీతం, చరిత్ర, విజ్ఞానం, వైద్యం వంటి విషయాలను అధ్యయనం చేశారు. పిండిమర, టార్చిలైటు, ఇంకుపెన్ను, నీరు తోడే యంత్రం వంటి ఎన్నో వాటిని ఈ ప్రాంతానికి పరిచయం చేసింది వీరే. తమ్ముడు సీతారామచంద్రరావు రాచకొండ, కోహినూరు, ఇనుగుర్తి వంటి చరిత్ర విషయాల గురించి అధ్యయనం చేశారు. ఎన్నో రచనలతో పాటు రవీంద్రనాథ్‌ ఠాగూర్‌ ‘నౌకా భంగం’ నవలను కూడా అనువదించారు. 

సీతారామచంద్రరావు రాసిన ఏకైక తెలుగు సైన్స్‌ ఫిక్షను కథ ‘అదృశ్య వ్యక్తి’! కథ శీర్షిక చూడగానే చాలా మందికి హెచ్‌.జి.వెల్స్‌ ‘ది ఇన్‌ విజిబుల్‌ మ్యాన్‌’ గుర్తుకు వస్తుంది. అయితే హెచ్‌.జి. వెల్స్‌ లో లేనిది,  సీతారామచంద్రరావు కథలో ఉన్నది భారత స్వాతంత్య్ర పోరాటం! ప్రయోగశాలలో దృశ్యం, అదృశ్యం అనే దృగ్విషయంపై పరిశోధించే యువ శాస్త్రవేత్త నళినీకాంతుని కథ ఇది. ప్రయోగంలో జరిగిన పొరపాటు వల్ల కథానాయకుడు అదృశ్యమౌతాడు.   

‘నా యిచ్ఛ కొలది వచ్చితిని’
ఈ కథ చివరలో బ్రిటిషు సార్జెంటు కథానాయకుడితో ఇలా అంటారు, ‘‘... నీ నిర్మాణం, నీ బలము తుచ్ఛమైపోయినవి. ఏలయన నిన్ను మేము పట్టుకొంటిమి. మమ్ము పట్టుకొనువాడెవరు కాన్పించడే!’’. దీనికి జవాబుగా ‘‘అబద్ధం. సర్వదా అబద్ధము. నేను నా యిచ్ఛ కొలది వచ్చితిని’’ అని అంటాడు కథానాయకుడు నళినీకాంతుడు. అంతేకాదు ఈ వాక్యము ముగిసేలోపు సార్జెంటు ముఖం పై బలమైన దెబ్బ తగులుతుంది. పడిపోయిన సార్జెంటు లేచి పిస్తోలు తీసి రెండుసార్లు కాల్చగా కేవలం గోడకు దెబ్బ తగిలిందని కథ ముగుస్తుంది. తెలుగు సైన్స్‌ ఫిక్షన్‌ కథలు అధ్యయనం చేస్తున్నప్పుడు తొలుతే ఈ స్ఫూర్తికరమైన విషయాలు తారసపడిన ఎంతో ఉత్సాహం కల్పిస్తాయి! 
– డా. నాగసూరి వేణుగోపాల్‌ ప్రసిద్ధ పాపులర్‌ సైన్స్‌ రచయిత 

(చదవం‍డి: నేను మహిళను నేను విప్లవాన్ని...చిట్టగాంగ్‌లోని పహార్తలి యూరోపియన్‌ క్లబ్‌... ప్రీతిలతా వడ్డేదార్‌)

మరిన్ని వార్తలు