ఆ రోజు.. ఐదు నదులకు పోటీగా పంజాబ్‌లో నెత్తురు పారింది!

14 Aug, 2022 15:54 IST|Sakshi

నేడు ‘విభజన భయానక జ్ఞాపకాల దినం’... 2021 ఆగస్టు 14న భారత ప్రధాని మోదీ ఈ ‘డే’ని ప్రకటించారు. విషాదాలను మరిచిపోకూడదని, అవి పునరావృతం కాకుండా చూసుకోడమే ఈ విభజన భయానక జ్ఞాపకాల దినం (పార్టిషన్‌ హారర్స్‌ రిమంబరెన్స్‌ డే) ఉద్దేశం అని ఆయన వివరించారు. తేనెపట్టును తలపిస్తూ రైళ్లను ముసురుకున్న మానవ సమూహాలు, కిలోమీటర్ల మేర ఎడ్లబళ్లు, మంచం సవారీ మీద వృద్దులు, భుజాల మీద పిల్లలు, బరువైన కావళ్లు, ఓ ఎత్తయిన ప్రదేశంలో తల పట్టుకుని కూర్చొన్న బాలుడు, కలకత్తా వీధులలో దిక్కులేకుండా పడి ఉన్న శవాల గుట్టలు.. ఇవీ విభజన జ్ఞాపకాలు. ఇవన్నీ అప్పటి ఫొటోలలో చూసి ఉంటాం.

ఇంతకు మించిన విభజన ఘోరాలు కూడా ఉన్నాయి. అవి పుస్తకాలలో అక్షరబద్ధం అయ్యాయి. మతావేశాలలో చెలరేగిన ఆ కల్లోలంలో కోటి నుంచి రెండు కోట్ల మంది నిరాశ్రయులయ్యారు. మృతులు పది లక్షల మంది అని అంచనా. అపహరణకు గురైనవారు, అత్యాచారాలకు బలైనవారు.. బాలికలు, యువతుల 75 నుంచి లక్ష వరకు ఉంటారు. తమస్‌ (భీష్మ సహానీ), ఎ ట్రెయిన్‌ టు పాకిస్థాన్‌ (కుష్వంత్‌ సింగ్‌), ది అదర్‌ సైడ్‌ ఆఫ్‌ సైలెన్స్‌ (ఊర్వశీ బుటాలియా), ఎ టైమ్‌ ఆఫ్‌ మ్యాడ్‌ నెస్, మిడ్‌నైట్‌ చిల్డ్రన్‌ (సల్మాన్‌ రష్దీ), పార్టిషన్‌ (బార్న్‌వైట్, స్పున్నర్‌), ఫ్రీడమ్‌ ఎట్‌ మిడ్‌నైట్‌ (ల్యారీ కోలిన్, డొమినక్‌ లాపిరె), మిడ్‌నైట్‌ ఫ్యూరీస్‌ (నిసీద్‌ హజారీ) వంటి నవలలు, చరిత్ర పుస్తకాలలో; అమృతా ప్రీతమ్, ఇస్మత్‌ చుగ్తాయ్, గుల్జార్, సాదత్‌ హసన్‌ మంటో వంటి వారి వందలాది కథలలో విభజన విషాదం స్పష్టంగా కనిపిస్తుంది.

హిందువులు, ముస్లింలు ఒకరిని ఒకరు చంపుకున్నారు. సిక్కులు, ముస్లింలు ఒకరిని ఒకరు చంపుకున్నారు. ముస్లింలీగ్‌ నేత జిన్నా 1946లో ఇచ్చిన ‘ప్రత్యక్ష చర్య’ పిలుపుతో ఉపఖండం కనీవినీ ఎరుగని రీతిలో హత్యాకాండను చూసింది. ఆ సంవత్సరం బెంగాల్‌ రక్తసిక్తమైంది. 1947లో ఐదు నదులకు పోటీగా పంజాబ్‌లో నెత్తురు పారింది. 1947 ఆగస్ట్‌ 15న స్వాతంత్య్రం ఇస్తున్నట్టు బ్రిటిష్‌ ప్రభుత్వం ప్రకటించినా, సరిహద్దుల నిర్ణయం ఆగస్టు 17కు గాని జరగలేదు. ఆ నలభై, యాభై గంటలలో జరిగిన ఘోరాలు భారత స్వాతంత్య్ర పోరాట స్ఫూర్తి మీద అనేక ప్రశ్నలను సంధిస్తాయి. రెండో ప్రపంచ యుద్ధంలో నాజీలు చేసిన ఘోరాల కంటే ఆ సమయంలో ఇక్కడ జరిగిన ఘోరాలు దారుణమైనవని ఆ యుద్ధంలో పని చేసి వచ్చిన బ్రిటిష్‌ సైనికులూ పత్రికా విలేకరులూ చెప్పడం విశేషం. అంతటి విషాదాన్ని ఎందుకు గుర్తు చేసుకోవాలంటే, అలాంటిది మరొకటి జరగకుండా జాగ్రత్త పడేందుకు. జాగృతం అయ్యేందుకు.

మరిన్ని వార్తలు