జైహింద్‌ స్పెషల్‌: ఉద్వేగాలను దట్టించి.. కథల్ని ముట్టించారు

9 Jul, 2022 14:15 IST|Sakshi

తొలినాళ్ల తెలుగు కథకుల చేతుల్లో స్వాతంత్య్రకాంక్షతో కథానిక నడిచింది.  స్వాతంత్య్రోద్యమంలోని అంతర్భాగాలైన సంఘసంస్కరణ, మద్యపాన నిషేధం, అస్పృశ్యతా నివారణ, హరిజనుల దేవాలయ ప్రవేశం, విదేశీ వస్త్ర బహిష్కరణ వంటి అంశాలు ఆ కథలలో చోటుచేసుకున్నాయి. ఈ ఇతివృత్తాలతో దాదాపు ఓ యాబై కథలు వచ్చాయి. శ్రీపాద సుబ్రహ్యమణ్య శాస్త్రి, రాయసం వెంకటశివుడు, వజ్జ బాబూరావు, బందా కనక లింగేశ్వరరావు, కరుణకుమార, కనుపర్తి వరలక్ష్మమ్మ, అడివి బాపిరాజు, అందే నారాయణస్వామి, చలం.. ఇలా మరికొద్ది మంది కథకులున్నారు. 

అంతర్లీన సందేశాలు
సంస్కరణవాదానికి చెందిన కథానిక బందా కనకలింగేశ్వరరావు రాసిన ‘గ్రుక్కెడునీళ్లు’ (1932). వెట్టి మాల వెంకటప్ప బ్రాహ్మణ స్త్రీ మహాలక్ష్మమ్మ  చుట్టూ తిరిగిన కథ అది. శ్రీపాద సుబ్రహ్మణ్యశాస్త్రి ‘ఇలాంటి తవ్వాయి వస్తే’ (1934) కథలో హిందూ మాదిగలకు ఆ వూరి చెరువులో నీరు తెచ్చుకునే అవకాశం లేకపోవడంతో వారు ముస్లిం మతం స్వీకరించి ఆ హక్కును పొందటం ప్రధాన అంశం. ఉప్పు సత్యాగ్రహ సందర్భంలో రాయసం వెంకటశివుడు రాసిన మంచి కథ ‘నీలవేణి’ (1934). మత్స్యకారుల కులానికి చెందిన నిరక్ష్యరాస్యురాలైన నీలమ్మ ఉద్యమ సందర్భంలో పోలీసులాఠీ దెబ్బలకు గురైన స్వాతంత్య్రోద్యమ కార్యకర్త ప్రసాదరావు చౌదరికి తన సపర్యల ద్వారా చేరువై అతనిని భర్తగా పొందుతుంది. ఈ కథానిక అంతర్భాగం మద్యపాన నిషేధం.

సంస్కరణలకు ప్రేరణ
కుక్కలనైనా చేరనిస్తాం కాని హరిజనులను దేవాలయంలోకి ప్రవేశించనీయబోమనే అమానుషాన్ని ప్రశ్నిస్తూ బ్రాహ్మణ భావజాలంపై దండెత్తిన కథ ‘పరివర్తనం’ (1940). కథారచయిత అందే నారాయణస్వామి హరిజనులకు దేవాలయం ప్రవేశంతో పాటు అస్పృశ్యతా నివారణ, కులాల మధ్య సామరస్యత అనే అంశాల నేపథ్యంలో ఈ కథను రాశారు. స్వాతంత్య్రోద్యమ నేపథ్యంలో హరిజనుల దేవాలయ ప్రవేశం, యజమాని–పాలేరు కుటుంబాల మధ్య సాన్నిహిత్యాన్ని సంస్కరణ దృష్టితో ‘నరసన్న పాపాయి’ కథలో రచించారు అడవి బాపిరాజు. ఆయనే రాసిన మరో కథ ‘బొమ్మలరాణి’.. మీనాక్షి, కామేశ్వరరావుల కులాంతర వివాహం ద్వారా సంస్కరణాభిలాషను వ్యక్తం చేస్తుంది. 
మరోకథలో.. ‘‘రుక్మిణీ! ఆ పూలదండ సీమనూలుతో గట్టినదేమో నేను ముట్టను’ అంటాడు గోపాలరావు. ఆ యోధపత్ని ఇలా చెబుతుంది : ‘సీమనూలు చేతి నుండి తొలగి అయిదు మాసములు యిరువది దినములు’ అని. ఆ మాటల ద్వారా విదేశీ వస్త్ర బహిష్కరణ ఉద్యమం ఐదు నెలల ఇరవై రోజులుగా సాగుతున్నట్లు చెబుతారు కథలో కనుపర్తి వరలక్ష్మమ్మ. వీరిదే మరొకటి స్వాతంత్య్రోద్యమ కథానిక ‘కుటీరలక్ష్మి’ (1931).
‘మల్లుపంచ’ కథానికలో వజ్జ బాబూరావు విదేశీ వస్తు వ్యామోహం, వస్త్రధారణపై వ్యంగ్య ధోరణిలో విమర్శించారు. (విదేశీ వస్త్ర బహిష్కరణ సందర్భంగా వాటిని దహనం చేసే సమయంలో కట్టుకోవటానికి గుడ్డ్డలేని పేదలు వాటిని తమకు దానం చేయమని కోరడమనే కోణాన్ని కొడవటిగంటి కుటుంబరావు తన ‘చదువు’ నవలలో చిత్రించారు). ఆంధ్ర విద్యార్థి పక్షపత్రికలో 15 డిసెంబర్‌ 1947న ప్రచురితమైన కె.వి. సుబ్బయ్య కథానిక ‘ఆత్మశాంతి’ అత్యంత నాటకీయతతో కూడుకున్నది.

రహస్యోద్యమ సన్నివేశం
‘1942 ఆగస్టు విప్లవదినాలు’ ఉగ్రవాద కార్యకర్తల గురించిన కథానిక. రహస్యోద్యమ కార్యకర్త మాధవ పోలీసుల దాడి నుండి తప్పించుకొని తన సహ కార్యకర్తతో కలిసి ఒక పూరి కుటీరానికి చేరుతారు. ఆ పూరి పాకలో నివసించే జట్కావాలా.. మాధవకు అడ్డు నిలబడి పోలీసుల బారి నుండి కాపాడి తీవ్రంగా గాయపడతాడు. అంతకు మునుపే అదే జట్కాబండిలో మాధవ ప్రయాణించినప్పుడు అతను తన కొడుకే అని జట్కావాలా గుర్తిసాడు. ఆ సందర్భంలో జట్కావాలా.. మాధవతో తన తండ్రిని నేనే అని చెప్పుకుంటాడు. ‘‘నా పుత్రుడు అకుంఠితమయిన దేశభక్తుడు, మాతృ సేవకుడని తెలిసికొనగలిగాను. నా కుమారుని ప్రాణాలకు నా ప్రాణాలను ధారబోసి కాపాడుకొనగిలిగితిని. నేను కేవలము నా కుమారునికే మేలు జేసినట్లు గాదు. మాతృభూమికే సేవజేసినట్లు..’’ అన్న ఆత్మశాంతితో కన్నుమూస్తాడు. 
సాహిత్యంలో సంచలనాలు సృష్టించిన చలం 1924లో సహాయ నిరాకరణోద్యమ కాలంలో రాసిన కథ ‘సుశీల’. సుశీల నారాయణప్ప భార్య. పోలీసు అధికారి సులేమాన్‌తో సన్నిహితంగా వుంటుంది. ఈ ముక్కోణపు వ్యవహారంలో ఎంతో మధనపడి సుశీల చివరకు నారాయణప్ప మనిషే అవుతుంది.  (1947లో రాసిన ‘1960’ కథానికలో గాంధీజీ సామాజిక ఆర్థిక సిద్ధాంతాలు అమలులోకి వస్తే దేశం ఎంత నిర్జీవంగా వుంటుందో వ్యంగ్య ధోరణిలో చెప్పాడు చలం.)
– పెనుగొండ లక్ష్మీనారాయణ ‘అరసం’ జాతీయ కార్యదర్శి 


హరిజనోద్ధరణ పర్యటనలో భాగంగా 1933లో మద్రాసు చేరుకున్న మహాత్మాగాంధీ. కుల వ్యవస్థకు, కుల వివక్షకు వ్యతిరేకంగా ఆయన 
ఆ సమయంలో ఎన్నో రచనలు చేశారు. అనేక ప్రసంగాలు ఇచ్చారు. (ప్రతీకాత్మక చిత్రం)

మరిన్ని వార్తలు