స్వతంత్ర భారతి 1978/2022

2 Jul, 2022 12:50 IST|Sakshi

శిశువులకు టీకాలు
‘రోగ నిరోధక టీకాల విస్తరణ’ అనే ఈ టీకాల కార్యక్రమాన్ని ప్రభుత్వం 1978 లో  ప్రారంభించక ముందు, ప్రతి ఏటా జన్మించిన ప్రతి 10 మంది శిశువులలో ఒకరు ఏడాది లోపలే మరణించేవారు. ప్రధానంగా డిఫ్తీరియా, ధనుర్వాతం, కోరింత దగ్గు వంటివి వారి మరణాలకు కారణం అయ్యాయి. 1990 కల్లా భారతదేశం చాలా రాష్ట్రాలలో అందరికీ టీకాలు.. శిశువులలో కనీసం 80 శాతం మందికి టీకాలు వేసి ఉండటం.. అనే లక్ష్యాన్ని సాధించడం ద్వారా దాదాపు 2 కోట్ల మంది శిశువులను మృత్యువు బారి నుండి ప్రభుత్వం కాపాడగలిగింది. భారతదేశ జనాభా వృద్ధి రేటును కూడా ఈ కార్యక్రమం మందగింపజేసింది. తమ సంతానంలో చాలామంది బతకడం వల్ల తల్లిదండ్రులు, ముఖ్యంగా గ్రామీణులు మరింత మందిని కనాల్సిన అవసరం ఉందని భావించకపోవడమే అందుకు కారణం. 

మరికొన్ని పరిణామాలు
మొరార్జీ దేశాయ్‌ ప్రభుత్వం పెద్ద కరెన్సీ నోట్లను (వెయ్యి, ఐదు వేలు, పది వేలు) రద్దు చేసింది. 1978 జనవరి 16న ఈ నోట్ల రద్దు జరిగింది. నల్లధనాన్ని అరికట్టడం కోసమే ఈ మూడు రకాల నోట్లను రద్దు చేయడం జరిగిందని ప్రధాని మొరార్జీ దేశాయ్‌ ప్రకటించారు. ఆ పార్టీ నుంచి ఆవిర్భవించిన బీజేపీ ఆధ్వర్యంలోని మోదీజీ ప్రభుత్వం కూడా 2016లో పెద్ద నోట్లను రద్దు చేయడం తెలిసిందే. 

బోయింగ్‌ 747 ప్యాసింజర్‌ జెట్‌ అయిన ఎయిర్‌ ఇండియా ఫ్లయిట్‌ 855 బాంబే నుంచి టేకాఫ్‌ అయిన కొద్దిసేపటికే అరేబియా సముద్రంలో కూలిపోయింది. 213 మంది ప్రయాణికులు దర్మరణం చెందారు. 
 

మరిన్ని వార్తలు