స్వతంత్ర భారతి: 1979/2022

3 Jul, 2022 11:49 IST|Sakshi
చరణ్‌సింగ్‌తో ప్రమాణ స్వీకారం చేయిస్తున్న భారత రాష్ట్రపతి నీలం సంజీవరెడ్డి

ప్రధానిగా చరణ్‌సింగ్‌
జనతాపార్టీ సంకీర్ణ భాగస్వామి అయిన భారతీయ లోక్‌దళ్‌ పార్టీ తరఫున చరణ్‌ సింగ్‌ భారత ప్రధానిగా పదవీ స్వీకారం చేశారు. 1979 జూలై 28 నుండి 1980 జనవరి 14 వరకు చరణ్‌ సింగ్‌ భారతదేశ 5 వ ప్రధానమంత్రిగా ఉన్నారు. అంత కంటే ముందు ఆయన ఉప ప్రధానమంత్రిగా కూడా పనిచేశారు.

చరణ్‌ సింగ్‌ ప్రధానిగా ఉన్న కాలంలో లోక్‌సభ ఒక్కసారి కూడా సమావేశం కాలేదు. లోక్‌సభ సమావేశం ప్రారంభమవుతుందనగా, ముందురోజు ఆయన ప్రభుత్వానికి మద్దతునిచ్చిన కాంగ్రెసు పార్టీ మద్దతు ఉపసంహరించుకోవడంతో భారతీయ లోక్‌దళ్‌ ప్రభుత్వం కూలిపోయింది. చరణ్‌సింగ్‌ తన పదవికి రాజీనామా చేశారు. ఆరు నెలల అనంతరం లోక్‌సభకు మళ్లీ ఎన్నికలు జరిగాయి. చరణ్‌ సింగ్‌ తన జీవిత చరమాంకం వరకు లోక్‌దళ్‌ పార్టీకి నాయకత్వం వహిస్తూ ప్రతిపక్షంలోనే ఉన్నారు. చరణ్‌సింగ్‌ పూర్వీకులకు 1857 సిపాయిల తిరుగుబాటులో పాల్గొన్న నేపథ్యం ఉంది.  

తొలి ముస్లిం లీగ్‌ సీఎం
స్వతంత్ర భారతదేశంలోని ఒక రాష్ట్రానికి తొలిసారి ఒక ముస్లిం లీగ్‌ నేత ముఖ్యమంత్రి అయ్యారు. సిహెచ్‌.మొహమ్మద్‌ కొయా కేరళ ముఖ్యమంత్రిగా ఎంపికయ్యారు. అనంతర కాలంలో ఉప ముఖ్యమంత్రిగా కూడా ఉన్నారు.  కొయా తొలిసారి 1957లో కేరళ అసెంబ్లీకి ఎన్నికయ్యారు. కేబినెట్‌లో విద్య, హోమ్, ఆర్థిక శాఖల మంత్రిగా ఉన్నారు. కాంగ్రెస్, కమ్యూనిస్టు పార్టీల మంత్రి మండళ్లలో పని చేశారు. 1962లో లోక్‌సభకు ఎన్నికయ్యారు. కేరళ డిప్యూటీ ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడే 56 ఏళ్ల వయసులో మరణించారు. 

మరిన్ని వార్తలు