గాంధీజీ ప్రసంగం అనువాదం! వెంకట సుబ్బమ్మ

22 Jul, 2022 10:00 IST|Sakshi

భారత జాతీయోద్యమంలో గాంధీ శకం మొదలై, ఉద్యమం ఊపందుకున్న రోజులు అవి. దేశ ప్రజలందరిలో జాతీయత భావం ఒకేరకంగా ఉన్నప్పటికీ భాష వేరు కావడం వల్ల పోరాటం సంఘటిత శక్తిగా మారడంలో విఫలమవుతోందని గ్రహించిన గాంధీజీ ‘దక్షిణ భారత హిందీ ప్రచారసభ’ను ప్రారంభించారు. దక్షిణాది రాష్ట్రాల్లో హిందీ నేర్పించడానికి ప్రత్యేక తరగతులు నిర్వహించారు.

గూడూరులో బహిరంగ సభ
హిందీ ప్రచారంలో భాగంగా దక్షిణాదిలో ఎక్కువగా పర్యటించారు గాంధీజీ. అలాగే హరిజనోద్ధరణ కోసం కూడా ఆయన విస్తృతంగా గ్రామాలను సందర్శించారు. 1934లో గాంధీజీ చెన్నై నుంచి రైల్లో గూడూరు మీదుగా నెల్లూరుకు పర్యటిస్తున్నప్పుడు గూడూరులో ధర్మరాజు ఆలయం ముందు ఒక బహిరంగ సభ జరిగింది. ఆ సభలో గాంధీజీ ప్రసంగాన్ని తెలుగులో అనువదించడానికి హిందీ, తెలుగు తెలిసిన వారొకరు కావలసి వచ్చారు.

అప్పుడు గాంధీజీ ప్రసంగాన్ని తెనుగీకరించింది ఓ పదమూడేళ్ల అమ్మాయి! ఆమె పేరు తన్నీరు వెంకటసుబ్బమ్మ. అనువాదం ఒక్కటే కాదు, ఆనాటి జాతీయోద్యమంలో వెంకటసుబ్బమ్మగారు అనేక విధాలుగా పాల్పంచుకున్నారు. ‘ఆజాదీ కా అమృత్‌ మహోత్సవ్‌’ సందర్భంగా ఆ జ్ఞాపకాలను ఆమె కుమారుడు డాక్టర్‌ బెజవాడ రవికుమార్‌
సాక్షి ‘జైహింద్‌’తో పంచుకున్నారు. 

‘బాలకుటీర్‌’లో నేర్చుకుంద
 ‘‘మా అమ్మ పుట్టిల్లు తిరుపతి జిల్లా గూడూరు (అప్పటి నెల్లూరు జిల్లా). మా తాత తన్నీరు రమణయ్య సోడా వ్యాపారి. స్వాతంత్య్రపో రాటంలో చురుగ్గా పాల్గొన్నారు. ఆయన గూడూరు పట్టణ కాంగ్రెస్‌ కార్యదర్శి. జాతీయోద్యమంలో పాల్గొన్నందుకు కొంతకాలం బళ్లారిలో జైలు శిక్షను కూడా అనుభవించారు. గాంధీజీ హిందీ ప్రచారోద్యమాన్ని చేపట్టినప్పుడు హిందీ నేర్చుకోవడానికి మా అమ్మను గూడూరులోని ‘బాల విద్యాకుటీర్‌’లో చేర్పించారు మా తాతయ్య.

గూడూరులో శిక్షణ తర్వాత చురుగ్గా ఉన్న ముగ్గురిని ఎంపిక చేసి ప్రయాగ మహిళా విద్యాపీఠంలో విదుషీ పట్టా కోర్సు కోసం అలహాబాద్‌కు పంపించారు వాళ్ల హిందీ టీచర్‌ గుద్దేటి వెంకట సుబ్రహ్మణ్యంగారు. అలా అలహాబాద్‌ (ప్రయాగ్‌రాజ్‌)లో హిందీ నేర్చుకుంటూ, కస్తూర్బా ఆశ్రమంలో జాతీయ నాయకులకు సహాయంగా పని చేసే అవకాశం వచ్చింది అమ్మకు. సరోజినీ నాయుడు, జవహర్‌లాల్‌ నెహ్రూ, కమలా నెహ్రూ, అనిబీసెంట్, విజయలక్ష్మీ పండిట్‌ వంటి నాయకుల మధ్య జరిగే చర్చలను దగ్గరగా చూశారామె. ఆమెలో జాతీయోద్యమ స్ఫూర్తికి బీజాలు పడిన సందర్భం అది.

బాపూజీ ముగ్ధులయ్యారు
కోర్సు పూర్తయిన తర్వాత ఇక పెళ్లి సంబంధాలు చూడాలనే ఉద్దేశంతో అమ్మను గూడురుకు తీసుకువచ్చేశారు మా తాతయ్య. గాంధీజీ హరిజనోద్ధరణ మూవ్‌మెంట్‌లో భాగంగా దక్షిణాది యాత్ర చేసినప్పుడు అమ్మ దుబాసీగా గాంధీజీ ప్రసంగాన్ని తర్జుమా చేయడంతోపాటు బాపూజీకి స్వాగతం పలుకుతూ సన్మాన పత్రం చదివింది. స్పష్టమైన ఉచ్చారణకు, ధీర గంభీరంగా చదివిన తీరుకు ముగ్ధుడైన బాపూజీ అమ్మ చేతిని ముద్దాడి, తన మెడలో ఉన్న ఖాదీ మాలను తీసి అమ్మ మెడలో వేశారు.

తాను రాసుకుంటున్న పెన్నును కూడా బహూకరించారు. ఆ సమయంలో అమ్మ నడుముకు వెళ్లాడుతున్న ఒక తాళం చెవిని గమనించారాయన. అది మా అమ్మ ట్రంకు పెట్టె తాళం చెవి. ‘చాబీ ఇస్తావా’ అని అడిగారట. అప్పుడు అమ్మ నిర్మొహమాటంగా ‘ఇవ్వను’ అని చెప్పిందట. అప్పుడాయన అమ్మ తల మీద చెయ్యి వేసి పుణుకుతూ నవ్వారట. అమ్మ తరచూ ఆ సంగతులను చెబుతూ ఉండేది.


జాతీయ పతాకావిష్కరణ సందర్భంగా 80 ఏళ్ల వయసులో వెంకట సుబ్బమ్మ హిందీలో దేశభక్తి గీతాలను ఆలపించినప్పటి చిత్రం

అలహాబాద్‌ జ్ఞాపకాలు
అమ్మకు పదిమంది సంతానం. నేను తొమ్మిదో వాడిని. నేను, మా ఆవిడ డాక్టర్లం కావడంతో అమ్మ ఆరోగ్యరీత్యా కూడా మా దగ్గర ఉండడమే ఆమెకు సౌకర్యం అనే ఉద్దేశంతో అమ్మను నేనే చూసుకు న్నాను. అలా రోజూ సాయంత్రం నాలుగున్నర నుంచి ఐదున్నర మధ్య అమ్మ దగ్గర కూర్చుని ఆమె చెప్పే కబుర్లు వినడమే నేను ఆమెకిచ్చిన ఆనంద క్షణాలు. ఆ సమయంలో నాకు ఆమె అలహాబాద్‌  జ్ఞాపకాలను ఎన్నిసార్లు చెప్పిందో లెక్కేలేదు.

ఆమె 83 ఏళ్లు జీవించి 2004లో పరమపదించారు. ఆశ్చర్యం ఏమిటంటే... అంతకు ముందు మూడేళ్ల కిందట జాతీయపతాకావిష్కరణ సందర్భంగా ఆమె హిందీలో దేశభక్తి గీతాలను ఆలపించారు. ఆమె మంచి రచయిత కూడా. చరణదాసు శతకాలు రెండు, కాలేజ్‌ అమ్మాయిల కోసం నాటకాలు, ప్రభోద గీతాలు రాశారు. అన్నింటికంటే ముఖ్యంగా ఆమె బయోగ్రఫీ రాసుకున్నారు. కానీ అప్పుడు కొంత అప్పుడు కొంత రాస్తూ ఉండడంతో కొన్ని పేజీలు లభించలేదు.

ఆ రచనను పరిష్కరించి ప్రచురించడం నాకు సాధ్యం కాలేదు..’’ అని తన తల్లికి చేయాల్సిన సేవ మరికొంత మిగిలిపోయిందన్నట్లు ఒకింత ఆవేదన వ్యక్తం చేశారు డాక్టర్‌ రవి కుమార్‌. నెల్లూరు జిల్లా, కావలి పట్టణంలోని ఆయన ఇల్లు... తల్లి రాసిన పుస్తకాల ప్రతులు, ఆమె పుస్తకావిష్కరణల ఫొటోలతో వెంకటసుబ్బమ్మ జాతీయోద్యమ జ్ఞాపకాల దొంతరలా ఉంటుంది. 
– వాకా మంజులారెడ్డి సాక్షి ఫీచర్స్‌ ప్రతినిధి

(చదవండి: బోస్‌ భుజాల మీద హిట్లర్‌ చెయ్యి వేశాడా! నిజమా?! కథనమా?)

మరిన్ని వార్తలు