శతమానం భారతి: లక్ష్యం 2047.. కృత్రిమ మేధస్సు

9 Aug, 2022 13:53 IST|Sakshi

భవిష్యత్తు యుద్ధాలను ఎదుర్కొవడంలో ఎ.ఐ. ఆధారిత రక్షణ ఉత్పత్తుల ప్రాధాన్యాన్ని దృష్టిలో ఉంచుకుని భారత్‌ 2018 లోనే కృత్రిమ మేధస్సుపై కార్యాచరణ బృందాన్ని ఏర్పాటు చేసుకుంది! రక్షణ రంగంలో కృత్రిమ మేధస్సును ప్రోత్సహించే వ్యూహం రూపకల్పన ఈ బృందం బాధ్యత. రక్షణ రంగంలో స్వావలంబన దిశగా భారతదేశం రక్షణ ఉత్పత్తుల తయారీకి ప్రాధాన్యం ఇస్తోంది.

అంతేకాక, ఆవిష్కరణలకు ప్రోత్సాహంలో భాగంగా అంకుర సంస్థలకు, విదేశీ పెట్టుబడులకు అవకాశం కల్పిస్తోంది. ఫలితంగా భారత రక్షణ ఉత్పత్తుల ఎగుమతులు సైతం పెరిగాయి. అదే సమయంలో భారత సైన్యానికి అత్యాధునిక ఆయుధ పరికరాల కొరత కూడా తీరింది. దేశం నుంచి 2021–22 ఆర్థిక సంవత్సరంలో రక్షణ ఎగుమతులు అత్యధికంగా నమోదై రు.13,000 కోట్లకు చేరాయి. ఈ నేపథ్యంలోనే ఈ ఏడాది జూలై 11న కృత్రిమ మేధస్సు ఆధారిత ఉత్పత్తులు, సాంకేతిక పరిజ్ఞానాలను ఓ 75 ర కాల వరకు రక్షణశాఖ మంత్రి రాజ్‌నాథ్‌ సింగ్‌ ప్రారంభించారు.

వాటిల్లో కృత్రిమ మేధ వేదికగా గల స్వయం ప్రతిపత్తి / మానవ రహిత / రోబోటిక్‌ వ్యవస్థలు, బ్లాక్‌ చైన్‌ ఆధారిత యాంత్రీకరణ, కమ్యూనికేషన్‌లు, కమాండ్, కంట్రోల్, కంప్యూటర్‌ నిఘా, అంతరిక్ష నిఘా, సైబర్‌ భద్రత, మానవ ప్రవర్తన విశ్లేషణ, మేధో పర్యవేక్షక వ్యవస్థలు, స్వయం ప్రతిపత్తిగల మారణాయుధ వ్యవస్థలు ఉన్నాయి. 75 ఏళ్ల క్రితం సాధించుకున్న స్వేచ్ఛను వేడుకగా జరుపుకుంటున్న ఈ తరుణంలో.. దేశ సార్వభౌమత్వ ప్రకటనకు, ప్రదర్శనకు కృత్రిమ మేధను భారత్‌ ఒక వజ్రాయుధంలా మలుచుకుంటున్న తీరు అగ్రరాజ్యాల దృష్టిని సైతం ఆకర్షిస్తోంది.

మరిన్ని వార్తలు