Azadi Ka Amrit Mahotsav: లక్ష్యం 2047 అటవీ పరిరక్షణ

4 Jul, 2022 15:05 IST|Sakshi

భారతదేశంలో పర్యావరణ వ్యవస్థ మహాత్మా గాంధీ కాలం నుంచే ఉంది. ఆయనతో పాటూ ఉంటూ వచ్చింది. ఆర్థిక పురోగతిలో పర్యావరణ అంశాలను మేళవించడం అనే భావన మాత్రం తొలిసారిగా నాలుగో పంచవర్ష ప్రణాళికా కాలంలో (1969–1974) ఆరంభమైంది. ఆనాటి వరకు రాజకుటుంబాలు, విదేశీ పర్యాటకులు సఫారీ పేరుతో జంతువుల వేటను తీవ్రస్థాయిలో కొనసాగించేవారు. అప్పట్లో వన్యప్రాణుల విభాగం వ్యవసాయ మంత్రిత్వ కార్యాలయానికి అనుసంధానమై ఉండేది. ఇది వలసపాలనా కాలం నాటి చట్టాలతోటే నడిచేది. 1973లో ప్రారంభించిన టైగర్‌ ప్రాజెక్టు దేశంలో ప్రప్రథమ వన్యప్రాణి పరిరక్షణ ప్రాజెక్టుగా రికార్డుకెక్కింది.

తదనంతరం మంత్రిత్వ శాఖగా మారిన పర్యావరణ విభాగం 1980లో ఉనికిలోకి వచ్చింది. అదే సమయంలో రిజర్వ్‌ చేసిన అడవులను రిజర్వ్‌డ్‌ పరిధిలోంచి తీసివేయాలన్నా, అటవీ భూములను అటవీయేతర ప్రయోజనాలకు ఉపయోగించాలన్నా కేంద్రప్రభుత్వ ముందస్తు అనుమతి తప్పనిసరి అని నాటి కేంద్ర ప్రభుత్వం ఒక ఆర్డినెన్స్‌ను తీసుకొచ్చింది. పర్యావరణ, అటవీ, వాతావరణ మార్పు మంత్రిత్వ శాఖ గణాంకాల ప్రకారం– అటవీ నిర్మూలనను అరికట్టడంలో అటవీ పరిరక్షణ చట్టం(ఎఫ్‌సీఏ) గొప్ప పాత్ర పోషించింది. 1951 నుంచి 1976 మధ్య ప్రతి సంవత్సరం 1.6 లక్షల హెక్టార్ల అటవీ భూమిని ఇతర అవసరాలకు మళ్లించడం జరిగేది. అటవీ పరిరక్షణ చట్టాన్ని అమలు చేయడంతో 1980 నుంచి 2011 మధ్య ఈ సంఖ్య ఏటా 32,000 హెక్టార్లకు తగ్గిపోయింది. చట్టాన్ని చక్కగా అమలు చెయ్యడం వల్లే ఇది సాధ్యమయింది. వచ్చే ఇరవై  ఐదేళ్లలో మరింతగా  అటవీ పరిరక్షణ లక్ష్యాలను సాధించేందుకు భారత్‌ గట్టి సంకల్పంతో ఉంది. 

మరిన్ని వార్తలు