South Indian Jallianwala Bagh 1938: విదురాశ్వత్థ

28 Jun, 2022 07:47 IST|Sakshi
1939లో మీర్జా–పటేల్‌ ఒప్పందం కుదరడానికి దారితీసింది ఈ విదురాశ్వత్థ మారణకాండే

జలియన్‌వాలాబాగ్‌ వంటి మారణకాండే ఒకటి దక్షిణ భారతదేశంలోనూ జరిగింది. అది కూడా ఏప్రిల్‌ నెలలోనే. కర్ణాటక, చిక్‌బళ్లాపూర్‌ జిల్లా, గౌరీబిదనూరు తాలూకాలోని విదురాశ్వత్థ అనే గ్రామం అందుకు ప్రత్యక్ష సాక్షి.

‘జలియన్‌వాలా బాగ్‌’ అనేది ఏడెకరాల విస్తీర్ణంలోని ఒక తోట. పంజాబ్‌లోని అమృత్‌సర్‌లో స్వర్ణాలయ ప్రాంగణానికి దగ్గర్లో ఆ తోట ఉండేది. ఇప్పటికీ ఉంది కానీ, జలియన్‌వాలా బాగ్‌ అనగానే ఆనాటి తోట గుర్తుకు రాదు. ఆ ప్రదేశంలో జరిగిన ఊచకోత, రక్తపాతం.. ప్రతి భారతీయునికీ స్ఫురణకు వస్తాయి. 1919 ఏప్రిల్‌ 13న బ్రిటిష్‌ అధికారి జనరల్‌ డయ్యర్‌ ఆదేశాలపై బ్రిటన్‌ సైనికులు విచక్షణా రహితంగా జరిపిన కాల్పులలో 379 మంది భారతీయులు చనిపోయారు. చనిపోయిన వారిలో ఎంతోమంది మహిళలు, పిల్లలు కూడా ఉన్నారు. ఏకబిగిన 10 నిముషాల పాటు జరిగిన 1650 రౌండ్ల కాల్పులలో అనధికారికంగా వెయ్యి మందికి పైగానే మరణించారు.

రెండు వేలమందికి పైగా గాయపడ్డారు. పంజాబీలకు ముఖ్యమైన ‘వైశాఖీ’ పండుగ ఆ రోజు. వేడుకలకు, విహారానికి వచ్చి ఆరోజు సాయంత్రం వరకు తోటలో ఉన్న వారిపై సూర్యాస్తమయానికి ఆరు నిముషాల ముందు హటాత్తుగా తూటాల వర్షం కురిసింది. బ్రిటిష్‌ ప్రభుత్వం తీసుకువచ్చిన రౌలత్‌ చట్టాన్ని వ్యతిరేకిస్తూ సమావేశాలు పెడుతున్న జాతీయోద్యమకారులు వైశాఖి వేడుకల్లో కలిసిపోయి ఉన్నారని అనుమానించిన బ్రిటష్‌ సైన్యం జరిపిన కాల్పులు అవి. ఆ దురంతానికి నూరేళ్లు కావస్తున్న సందర్భంలో 2019లో బ్రిటన్‌ ప్రధాని థెరిసా మే అలా జరిగి ఉండాల్సింది కాదని పశ్చాత్తాపం వ్యక్తం చేశారు. 
దక్షిణ భారతదేశంలోనూ ఇలాంటి మారణకాండే ఒకటి జరిగింది.

అది కూడా ఏప్రిల్‌ నెలలోనే. కర్ణాటక, చిక్‌బళ్లాపూర్‌ జిల్లా, గౌరీబిదనూరు తాలూకాలోని విదురాశ్వత్థ అనే గ్రామంలో 1938 ఏప్రిల్‌ 25న జాతీయ కాంగ్రెస్‌ నేతల నాయకత్వంలో కొంతమంది స్థానికులు స్వాతంత్య్ర కాంక్షతో జాతీయ జెండాను ఎగరేసేందుకు గ్రామ కూడలికి చేరుకున్నారు. బ్రిటిష్‌ పాలన ఉండగా భారతీయ జెండాను ఎగరేయడం అంటే తిరుగుబాటుకు అది పరాకాష్ట. ప్రభుత్వం సమ్మతించలేదు. గ్రామస్థులు జెండా ఎగరేయడానికే నిశ్చయించుకున్నారు. వారిని చెదరగొట్టడం కోసం సైనికులు కాల్పులు జరిపారు. ఆ ఘటనలో 35 మంది గ్రామస్థులు మరణించారు. వందల మంది గాయపడ్డారు. దాంతో విదురాశ్వత్థ గ్రామం మొత్తం ఒక్కసారిగా భగ్గుమంది.

విషయం తెలుసుకున్న గాంధీజీ మొదట సర్దార్‌పటేల్‌ను, ఆచార్య కృపలానీని విదురాశ్వత్థకు పంపారు. తర్వాత తనే స్వయంగా వెళ్లారు. 1939లో మీర్జా–పటేల్‌ ఒప్పందం కుదరడానికి దారితీసింది ఈ మారణకాండే. అప్పటి మైసూర్‌ దివాన్‌ మీర్జా ఇస్మాయిల్‌కు, భారత రాజనీతిజ్ఞులు పటేల్‌కు మధ్య జరిగిన ఆ ఒప్పందం ఫలితంగా మైసూర్‌ రాష్ట్రంలో ప్రజల భాగస్వామ్యంతో మొట్టమొదటిసారిగా ప్రభుత్వం ఏర్పడింది.హింసాఘటన–అహింసా ప్రతిఘటనల పోలికలతో దక్షిణ భారత జలియన్‌వాలా బాగ్‌గా విదురాశ్వత్థ వాడుకలోకి వచ్చింది.

విదురాశ్వత్థలో బ్రిటిష్‌ సైనికుల కాల్పులకు అమాయకపు పౌరులు మరణించిన చోట 1971లో భారత ప్రభుత్వం ఒక స్మారక చిహ్నాన్ని కట్టించింది.  ఊళ్లో ఉండే అశ్వథ వృక్షం వల్ల ఊరికి ఆ పేరు వచ్చింది. భారతంలోని ఒక ఇతిహాసాన్ని బట్టి దృతరాష్ట్రుని కొలువులో ఉండే విదరురు ఆ వృక్షాన్ని నాటాడని అంటారు. అందుకే ఆ గ్రామానికి విదురాశ్వత్థ అనే పేరు వచ్చిందని స్థానికులు చెబుతారు. భారతంలో ఎలా ఉన్నా.. భారత స్వాతంత్య్ర సంగ్రామంలో తిరుగుబాటు స్ఫూర్తికి ఈ గ్రామం ఒక చిహ్నంలా నిలిచిపోయింది. వృక్షం మాత్రం 2001లో కూలిపోయింది.  

(చదవండి: తొలి భారతీయుడు! అమిత సత్యవాది)

మరిన్ని వార్తలు