ఆకుపచ్చని అమృతం

5 Jun, 2022 10:43 IST|Sakshi

జైహింద్‌ స్పెషల్‌ స్టోరీ

మనదేశ స్వాతంత్య్ర అమృతోత్సవాలకు మరొక సందర్భంగా నేటి ‘ప్రపంచ పర్యావరణ దినోత్సవం’ జతకూడింది. స్వాతంత్య్రానికి 75 ఏళ్లయితే, పర్యావరణ దినోత్సవ ఆలోచన ఆవిర్భావానికి ఇది 50వ సంవత్సరం. 

మొదటి ప్రపంచ యుద్ధం కారణంగా సంభవించిన వినాశనంతో మొత్తం ప్రపంచం తల్లడిల్లింది. ఈ విషాదాన్ని ఇంకా మరవకముందే రెండో ప్రపంచ యుద్ధం తీసుకొచ్చిన విపత్తు మరింత పెద్దది. అణ్వాయుధాల కారణంగా గాలి, నీరు, భూమి కాలుష్యమైన విషయం ఒక దశాబ్దం గడిస్తే కానీ ప్రపంచ దేశాలకు బోధపడలేదు. అలా మొదలైన అవగాహన, సమిష్టి కృషితో 1972 జూన్‌ 5న స్టాక్‌ హోమ్‌ లో ఒక పన్నెండు రోజులపాటు ‘యూ.ఎన్‌. కాన్ఫరెన్స్‌ ఆన్‌ హ్యూమన్‌ ఎన్విరాన్‌ మెంట్‌’ సదస్సు నడిచింది. ఈ సమావేశం మొదలైన జూన్‌ 5 వ తేదీన పర్యావరణ దినోత్సవంగా ప్రపంచ వ్యాప్తంగా జరుపుకోవడం మొదలైంది!  

మొదలైంది మనదేశంలోనే!
ఆలోచన లేదా ప్రతిపాదన... విశ్లేషణ లేదా సిద్ధాంత వివరణ... అటు తర్వాత ఆచరణ, అనువర్తన! అనంతరం.. తెలిసిన విషయాన్ని, అనుభవాన్ని మరింతమందికి, మరిన్ని ప్రాంతాలకు తీసుకుపోవడం! ఇది ఒక మనిషి మస్తిష్కం నుంచి బయలుదేరిన ఆలోచనా తరంగం ఎలా జనసంద్రంలో మమేకమవుతుందో చెబుతుంది. పర్యావరణ ఉద్యమశీలి, సంఘసేవకుడు సుందర్‌ లాల్‌ బహుగుణ (1927–2021) ప్రకృతి ప్రేమైక జీవనగమనాన్ని గమనిస్తే.. ఆ దంపతుల స్ఫూర్తికర్తల గురించి తెలుసుకోవాలనిపిస్తుంది. బహుగుణ భార్య విమలకు మార్గదర్శి సరళాబెన్‌ (1901–1982) కాగా, బహుగుణకు మార్గనిర్దేశనం చేసింది మీరాబెన్‌ (1892–1982)! పరవళ్ళు తొక్కే గోదావరిని గమనించి, ఆ నది ఎలా మొదలైందో తెలుసుకోవాలంటే త్రయంబకేశ్వరం వెళ్ళాలి. అలాగే సరళాబెన్, మీరాబెన్‌ కంటే ముందు తారసపడే మహనీయుడు జె సి కుమారప్ప (1892–1960). ఇంకొంచెం మూలాల్లోకి వెళితే తారసపడే పర్యావరణ వెలుగు.. గాంధీజీ! 

ఆలోచన గాంధీజీది కాగా, సిద్ధాంత వివరణను 1920 దశకంలో ఇచ్చింది ఆర్థిక శాస్త్రవేత్త జె సి కుమారప్ప. ఆచరణ, అనువర్తన దిశగా ఆలోచనను ప్రజల్లోకి తీసుకువెళ్ళినవాళ్ళు మీరాబెన్, సరళాబెన్‌ ద్వయం! ఈ క్రమంలో వారి కృషి, విజయాలు గమనిస్తే, మనదేశంలో రూపు దిద్దుకున్న ఆధునిక పర్యావరణ ఉద్యమం తొలిరూపు మన కళ్ళకు కడుతుంది. కనుకనే జె.సి.కుమారప్పను ‘గ్రీన్‌ గాంధియన్‌’ గా గౌరవిస్తే, మీరాబెన్‌ ను తొలి భారతదేశపు ‘ఎకో ఫెమినిస్ట్‌’ గా కొనియాడుతారు. ఇక సరళాబెన్‌ 1950, 60 దశాబ్దాలలో చండి ప్రసాద్‌ భట్, సుందర్‌ లాల్‌ బహుగుణ, విమలా బహుగుణ, రాధాభట్‌ వంటి ఎంతోమంది సామాజిక కార్యకర్తలను తీర్చిదిద్దారు. అంటే మనం చిప్కో ఉద్యమం పూర్వపు విషయాలు చెప్పుకుంటున్నామని గుర్తించాలి.

అంటే ప్రపంచం గమనించకముందే పర్యావరణ సమస్య గుర్తించి రకరకాల ఆలోచనలు మొదలైంది మనదేశంలో! 1974 మార్చిలో మొదలైన చిప్కో ఉద్యమాన్ని..   ప్రపంచ దేశాలలో కూడా తొలి పర్యావరణ ఉద్యమంగా పరిగణిస్తారు. దీనికి నేపథ్యం ఏమిటో పరిశీలిస్తే  భారతదేశపు పర్యావరణ త్రిమూర్తులనదగ్గ ముగ్గురు మహనీయుల ఉత్కృష్టమైన సేవ కనబడుతుంది. ఈ ముగ్గురూ క్రెస్తవులు కావడం ఒక విశేషం కాగా, అందులో మీరాబెన్, సరళాబెన్‌ ఇద్దరు ‘గాంధీజీ ఆంగ్లేయ కుమార్తెలు’గా గుర్తింపు పొందారు. జెసి కుమారప్ప అసలు పేరు జోసెఫ్‌ చెల్లాదురై కార్నోలియన్, మీరాబెన్‌ పేరు మ్యాడలిన్‌ స్లేడ్‌. సరళాబెన్‌ పూర్వపు పేరు క్యాథలిన్‌ మేరీ హెయిల్‌ మన్‌. 

గాంధీజీ ప్రతిపాదనలు 
అర్థిక స్థితిగతులు, ప్రజల బాగోగులు, పేదరికం, ఆకలి వంటి విషయాలు చర్చిస్తున్నపుడు గాంధీజీ ప్రకృతి వనరులు, వ్యవసాయం ప్రకృతిని రక్షించడం వంటి విషయాలు ప్రస్తావిస్తారు. అప్పటికి గాంధీజీ పర్యావరణం, ఎకాలజి, సస్టెయిన్‌ బుల్‌ డెవలప్‌మెంట్, హోలిస్టిక్‌ డెవలప్‌మెంట్‌ వంటి మాటలు వాడలేదు. నేటికి వందేళ్ళ క్రితం తనకు ఆర్థికశాస్త్రం అంత బాగా తెలియదు అంటూనే మనుషులుగా మన బాధ్యత ఏమిటి, ఇతర వ్యక్తులతో, ప్రకృతితో ఎలా నడుచుకోవాలో గాంధీజీ చాలా సందర్భాలలో చెప్పారు. గాంధీజీ ఆలోచనలను ఒక సిద్ధాంతంగా మనకు ఇచ్చిన దార్శనికుడు! ప్రపంచం ఇంకా కళ్ళు తెరుచుకోని సమయంలో పర్యావరణ భావనను గాంధీజీ, కుమారప్ప ప్రతిపాదిస్తే, ఆ భావనలను ఆచరించడమే కాక పరివ్యాప్తం చేసిన మహిళా ద్వయం మీరాబెన్, సరళాబెన్‌! 

భారతదేశపు స్వాతంత్య్రోద్యమం కేవలం రాజకీయ హక్కుల ఉద్యమం కాదు. గాంధీజీ భావనలో అది సమగ్ర అభ్యుదయ ఉద్యమం, అందులో ప్రకృతి పరిరక్షణ, పర్యావరణ సంరక్షణ, సహజవనరుల పొదుపు కూడా అంతర్భాగాలే! ఆ సమగ్ర స్ఫూర్తిని అందుకోలేకపోవడం మనదేశపు సామూహిక వైఫల్యం!  పర్యావరణ ఉద్యమాలు మన నేల నుండి ఇతర దేశాలకు పాకాయి, స్ఫూర్తినిచ్చాయి. అంతకుమించి ప్రపంచవ్యాప్తంగా  పర్యావరణ వాదులంతా గాంధీజీ అహింసను ఆచరణాత్మకంగా విశ్వసిస్తారు. సంరక్షణ అహింసే కదా! 
– డా‘‘ నాగసూరి వేణుగోపాల్‌, ఆకాశవాణి పూర్వ సంచాలకులు

మరిన్ని వార్తలు