జిన్నా రమ్మన్నా అజీమ్‌ తండ్రి వెళ్లలేదు!

24 Jul, 2022 11:55 IST|Sakshi

మహోజ్వల భారతి

గాంధీజీకి జాషువా స్మృత్యంజలి
ఆధునిక తెలుగు కవుల జాబితాలో ప్రముఖ స్థానం పొందిన కవి గుఱ్ఱం జాషువా. సమకాలీన కవిత్వ ఒరవడి అయిన భావ కవిత్వ రీతి నుండి పక్కకు జరిగి, సామాజిక ప్రయోజనం ఆశించి రచనలు చేశారు. తక్కువ వర్ణంగా భావించబడిన కులంలో జన్మించినందున అనేక అవమానాలు ఎదుర్కొన్నారు. తన కవిత్వాన్ని ఆయుధంగా చేసుకుని మూఢాచారాలపై తిరగబడ్డారు. ఆఖరికి ఛీత్కారాలు ఎదురైన చోటే సత్కారాలు పొందారు. జాషువా 1895 సెప్టెంబర్‌ 28 న గుర్రం వీరయ్య, లింగమ్మ దంపతులకు ఆంధ్రప్రదేశ్‌ లోని గుంటూరు జిల్లా వినుకొండ మండలం చాట్రగడ్డపాడులో జన్మించారు. తల్లిదండ్రులు వేరువేరు కులాలకు చెందిన వారు.

జాషువా 1928 నుండి 1942 వరకు గుంటూరు లోనే ఉన్నత పాఠశాలలో తెలుగు పండితుడిగా ఉన్నారు. 1957–59 మధ్య కాలంలో మద్రాసు రేడియో కేంద్రంలో ప్రోగ్రామ్‌ ఎగ్జిక్యూటివ్‌గా చేశారు. జీవనం కోసం ఎన్నో రకాల ఉద్యోగాలు చేసిన జాషువాకు 1964లో ఆంధ్రప్రదేశ్‌ శాసనమండలిలో సభ్యత్వం లభించింది. జాషువా రచనల్లో ‘గబ్బిలం’ (1941) సర్వోత్తమమైనది. కాళిదాసు ‘మేఘసందేశం’ తరహాలో సాగుతుంది. అయితే ఇందులో సందేశాన్ని పంపేది యక్షుడు కాదు. ఒక అంటరాని కులానికి చెందిన కథానాయకుడు తన గోడును కాశీ విశ్వనాథునికి చేరవేయమని గబ్బిలంతో సందేశం పంపడమే దీని కథాంశం. ఎందుకంటే గుడిలోకి దళితుడికి ప్రవేశం లేదు. కాని గబ్బిలానికి అడ్డు లేదు. ఇందులో ఆ కథానాయకుడి వేదనను వర్ణించిన తీరు హృదయాలను కలచివేస్తుంది. జాషువా 1948 లో రాసిన ‘బాపూజీ’.. మహాత్మా గాంధీ మరణ వార్త విని ఆవేదనతో ఘటించిన స్మృత్యంజలి. నేడు జాషువా వర్ధంతి. 1971 జూలై 24 న తన 75వ యేట ఆయన కన్నుమూశారు. 

జిన్నా రమ్మన్నా అజీమ్‌ తండ్రి వెళ్లలేదు!
అజీమ్‌ ప్రేమ్‌జీ  కంటే ముందు ఆయన తండ్రి మహమ్మద్‌ ప్రేమ్‌జీ గురించి తెలుసుకోవాలి. మహమ్మద్‌ ప్రేమ్‌జీ వ్యాపారవేత్త. బియ్యం వ్యాపారంలో ఆరితేరిన ఆయన ‘రైస్‌ కింగ్‌ ఆఫ్‌ బర్మా’గా పేరుపొందారు. అజీమ్‌ పుట్టిన కొద్ది నెలల్లోనే ఆయన ‘వెస్టర్న్‌ ఇండియా పామ్‌ రిఫైన్డ్‌ ఆయిల్‌ లిమిటెడ్‌’ కంపెనీని ప్రారంభించారు. తర్వాతి కాలంలో ఇదే ‘విప్రో’గా రూపాంతరం చెందింది. దేశ విభజన తర్వాత పాకిస్థాన్‌కు వచ్చేయాల్సిందిగా మహమ్మద్‌ ప్రేమ్‌జీని జిన్నా ఆహ్వానించారు.

అయితే, ఆయన సున్నితంగా తోసిపుచ్చి, భారత్‌లోనే ఉండిపోయారు. ఒకవైపు వ్యాపార విస్తరణను కొనసాగిస్తూనే, కొడుకు అజీమ్‌ను ఉన్నత చదువుల కోసం విదేశాలకు పంపారు. స్టాన్‌ఫోర్డ్‌ వర్సిటీలో ఎలక్ట్రికల్‌ ఇంజనీరింగ్‌ కోర్సులో చేరారు అజీమ్‌. అయితే, 1966లో మహమ్మద్‌ ప్రేమ్‌జీ ఆకస్మికంగా మరణించారు. తండ్రి మరణంతో అజీమ్‌ చదువును అర్ధంతరంగానే వదిలేసి భారత్‌కు వచ్చారు. అనంతరం తండ్రి వ్యాపార సామ్రాజ్యానికి వారసుడిగా ‘విప్రో’ పగ్గాలు చేపట్టారు అజీమ్‌. వేల కోట్ల ఆస్తులు ఉన్నా,  ఇదంతా సమాజం నుంచి తనకు దక్కిందేనని, సమాజానికి తిరిగి ఇవ్వడంలోనే తనకు సంతృప్తి ఉందని అంటారు అజీమ్‌ ప్రేమ్‌జీ. నేడు అజీమ్‌ జన్మదినం. 1945 జూలై 24న మహారాష్ట్రలోని అమల్నేర్‌ పట్టణంలో జన్మించారు. 

మరిన్ని వార్తలు