Korukonda Subba Reddy History Telugu: సైరా సుబ్బారెడ్డి   

24 Jun, 2022 11:28 IST|Sakshi

నమ్మకద్రోహులందించిన సమాచారంతో సుబ్బారెడ్డిని 1858 జూన్‌ 11న బ్రిటీషర్లు నిర్భంధించారు. విచారణ సందర్భంగా నానా సాహెబ్‌ ఆదేశాల మేరకే తాను స్వతంత్ర సంగ్రామంలో పాల్గొన్నానని, తనకు స్ఫూర్తి తాంతియా తోపే అని సుబ్బారెడ్డి నిర్భయంగా చెప్పారు. 

సిపాయిల తిరుగుబాటు బ్రిటీష్‌వారిపై జరిగిన తొలి స్వతంత్ర పోరాటంగా చరిత్రకారులు పేర్కొంటారు. అయితే ఈ పోరాటం ఎక్కువగా ఉత్తరభారతానికే పరిమితమైందని కొందరి భావన. కానీ దక్షిణభారతంలో తెలుగునాట, తమిళనాడులో, కర్నాటక, కేరళలో కూడా ఈ తిరుగుబాటుకు మద్దతు దొరికింది. ఉదాహరణకు విజయనగరంలో స్థానిక ఇన్‌ఫాన్‌ట్రీ తిరుగుబాటు చేయగా, హైదరాబాద్‌లో తుర్రబజ్‌ఖాన్‌  తదితరులు, కడపలో షేక్‌ పీర్‌సాహెబ్‌ బ్రిటీషర్లకు వ్యతిరేకంగా పోరాడారు.

అయితే ఏకీకృత నాయకత్వం లోపించడంతో పోరాటం విఫలమైంది. కానీ దేశ ప్రజల్లో స్వాతంత్య్ర స్ఫూర్తిని రాజేయడంలో ప్రథమ స్వాతంత్య్ర సంగ్రామం పాత్ర మరువలేనిది. ఆంధ్రా ప్రాంతంలో 1857–58 కాలంలో తొలి స్వతంత్ర పోరాటం జరిగింది. ఈ పోరాటానికి సమరయోధుడు కోరుకొండ సుబ్బారెడ్డి నాయకత్వం వహించారు. గోదావరి నదీ ప్రాంతంలో గెరిల్లా యుద్ధ తంత్రంతో బ్రిటీషర్లను ముప్పుతిప్పలు పెట్టారు. చివరకు నమ్మినవారే మోసం చేయడంతో బ్రిటీషర్ల చేతికి చిక్కి అమరుడయ్యాడు. ఆయన సాగించిన పోరాటం తర్వాత రోజుల్లో పలు చోట్ల గెరిల్లా పోరాటాలకు స్ఫూర్తిగా నిలిచింది.

పోలవరం పులిబిడ్డ
పోలవరం సమీపంలోని కోరుటూరులో కోరుకొండ సుబ్బారెడ్డి జన్మించారు. యుక్తవయసు వచ్చాక గ్రామ మునసబుగా ఆయన పనిచేశారు. బుట్టాయగుడెం నుంచి యర్నగూడెం మధ్యలో ఉన్న పలు ఆదివాసీ గ్రామాలకు ఆయన జమిందారుగా వ్యవహరించారు. కొండరెడ్డి తెగకు చెందిన సుబ్బారెడ్డి మాటంటే స్థానిక ఆదివాసులకు వేదవాక్కుగా ఉండేది. 1850 తర్వాత కాలంలో దేశమంతా బ్రిటీషర్ల దాష్టీకం పెరుగుతూ వచ్చింది. పలు రాజ్యాలను, జమీన్‌లను ఆక్రమించుకోవడం, భారతీయులను బానిసలుగా చూడడంతో స్థానికుల్లో బ్రిటీషర్ల పట్ల వ్యతిరేకత ప్రబలింది. చివరకు ఈ వ్యతిరేకత 1857లో పీష్వా నానాసాహెబ్, ఝాన్సీలక్ష్మీబాయి, తాంతియాతోపే తదితరుల ఆధ్వర్యంలో తిరుగుబాటుగా పరిణమించింది. ఇదే సమయంలో యర్నగూడెం ప్రాంతంలోని 40 గ్రామాలకు స్వాతంత్య్రం సంపాదించాలని కొండారెడ్డి భావించారు. ఆదివాసీలపై బ్రిటీషర్ల దమనకాండను వ్యతిరేకిస్తూ తానుకూడా తొలి స్వాతంత్య్ర సంగ్రామంలో పాల్గొన్నారు. ఈ క్రమంలో తొలుత ఆయన బ్రిటీషర్ల నుంచి నాగవరం కోటను స్వాధీనం చేసుకొన్నారు. సుబ్బారెడ్డిని దెబ్బతీయడానికి ఆయన ప్రధాన ఆదాయ వనరైన గోదావరీ రవాణా వ్యవస్థపై పన్ను వసూళ్లను బ్రిటీష్‌ సబ్‌కలెక్టర్‌ నిలిపివేశాడు. 

నమ్మక ద్రోహానికి బలి
నాగవరం కోటను తిరిగి స్వాధీనం చేసుకునే ప్రక్రియలో బ్రిటీషర్లకు కొందరు స్థానికులు సహకరించారు. సుబ్బారెడ్డిపై బ్రిటీషర్లు ప్రకటించిన రూ. 2500 బహుమతి వీరిలో స్వార్ధాన్ని ప్రేరేపించింది. నమ్మకద్రోహులందించిన సమాచారంతో సుబ్బారెడ్డిని 1858 జూన్‌ 11న బ్రిటీషర్లు నిర్భంధించారు. విచారణ సందర్భంగా నానా సాహెబ్‌ ఆదేశాల మేరకే తాను స్వతంత్ర సంగ్రామంలో పాల్గొన్నానని, తనకు స్ఫూర్తి తాంతియా తోపే అని సుబ్బారెడ్డి నిర్భయంగా చెప్పారు. ఢిల్లీ స్వాధీనానంతరం నానాసాహెబ్‌ డక్కన్‌కు వస్తారని, ఎవరైతే బ్రిటీషర్లకు వ్యతిరేకంగా పోరాడారో వారికి బహుమానాలిస్తారని చెప్పారు. దీంతో కలవరపడిన బ్రిటీషర్లు ఆయనకు మరణశిక్ష విధించి అక్టోబర్‌ 7న ఉరిశిక్షను అమలు చేశారు. ఆయనతో పాటు కొర్ల సీతారామయ్య అనే సహచరుడికి మరణశిక్ష విధించిన బ్రిటీష్‌ ప్రభుత్వం మరో 35మంది ఆదివాసీలకు యావజ్జీవ శిక్ష విధించి గుంటూరు సెంట్రల్‌ జైలుకు పంపింది. మరో 8 మందికి మరణ శిక్షను, ఇంకో 8 మందికి అండమాన్‌ ద్వీపాంతరవాస శిక్షను విధించింది. సుబ్బారెడ్డి సాగించిన పోరాటం తర్వాతి కాలంలో ఆంధ్రలో అనంతర  పోరాటాలకు పునాదిగా నిలిచింది. 
 – దుర్గరాజు శాయి ప్రమోద్‌

సుబ్బారెడ్డి సంచి
కోరుకొండ సుబ్బారెడ్డి సాగించిన పోరాటం బ్రిటీషర్లను ఎంతగానో భయపెట్టింది, మరెంతగానో చికాకుపెట్టింది. దీంతో ఆయనకు ఉరిశిక్ష అమలు చేయడంతో సంతృప్తి చెందని బ్రిటీష్‌ పాలకులు ఆయన శరీరాన్ని ఒక ఇనుప పంజరంలో ఉంచి రాజమండ్రి కోటగుమ్మం వద్ద వేలాడదీశారు. 1858 నుంచి 1920 వరకు ఆయన అస్థిపంజరం అలాగే ఆ ఇనుప పంజరంలో ఉందంటే బ్రిటీషర్ల కర్కశత్వం అర్థం చేసుకోవచ్చు. ప్రజల్లో తమకు వ్యతిరేకంగా తిరుగుబాటు చేస్తే పర్యవసానాలు దారుణంగా ఉంటాయని చెప్పడం కోసం బ్రిటీషర్లు ఈ క్రూరకార్యానికి పాల్పడ్డారు. సదరు ఇనుప పంజరాన్ని స్థానికులు సుబ్బారెడ్డి సంచి అని పిలిచేవారు. అయితే బ్రిటీషర్లు ఆశించినట్లు ఆయన సంచీ ప్రజల్లో భయాన్ని రేకెత్తించే బదులు స్వాతంత్య్ర కాంక్షను ప్రేరేపించింది. 

మరిన్ని వార్తలు