-

తొలి భారతీయుడు! అమిత సత్యవాది

27 Jun, 2022 09:51 IST|Sakshi

‘‘సుసంపన్నమయిన భారతదేశానికి పట్టాల్సిన గతి ఇదా?’’ అన్నది నౌరోజీ సూటి ప్రశ్న. ఆయన ప్రసంగ సారాంశమే తర్వాత కాలంలో ఓ సిద్ధాంతంగా సుప్రసిద్ధమయింది!  భారత రాజకీయాల్లో నౌరోజీ మితవాదే అయివుండొచ్చు కానీ, మౌలికంగా ఆయన సత్యవాది కూడా!

ఈ రోజున వలసవాదం గురించి తెలియని వాళ్ళూ లేరు. వాళ్ళకు ‘‘వలసదేశాల నుంచి సంపద తరలింపు’’ గురించి నోరుపడిపోయేంతగా వివరించి చెప్పాల్సినంత అగత్యమూ లేదు! ఎవడో రడ్యార్డ్‌ కిప్లింగ్‌ – ఎంత నోబెల్‌ లారియేట్‌ అయినప్పటికీ తెల్ల జాతి జింగోయిజం ప్రదర్శించి వైట్‌మ్యాన్స్‌ బర్డెన్‌ అంటూ ఏదో రాస్తే  ‘‘ఆయన భావప్రకటన సౌకుమార్యాన్ని’’ నెత్తినేసుకుని కీర్తించడానికి ఇవాళ ఎవరూ సిద్ధంగా లేరు! అలాగే, ఎవడో రాబర్ట్‌ సెసిల్‌ అనే శాలిస్‌బరీ ప్రభువు – ఎంత బ్రిటన్‌ ప్రధానమంత్రి అయినప్పటికీ నౌరోజీ ఓటమి గురించి ప్రస్తావిస్తూ, ‘‘ఓ నల్లవాణ్ణి బ్రిటిష్‌ పార్లమెంట్‌ సభ్యుడిగా ఆమోదించేంత స్థాయికి మన జాతి ఎదగలే’’దని వ్యంగ్య విభవం ఒలకపోస్తే ‘‘ఆహా ఏం చమత్కారం గురూ!’’ అంటూ చప్పట్లు కొట్టేవాళ్ళు ఆ దేశాల్లోనే లేరిప్పుడు!! 

రేపోమాపో అటు అమెరికాలోనూ ఇటు బ్రిటన్‌ లోనూ కూడా భారతీయ వంశాంకురాలు – అందునా మహిళలు – ముఖ్య పదవులు గెల్చుకున్నా విస్తుపోనవసరం లేదు – అలాగే, మీసాలు మెలేయాల్సిన అవసరమూ లేదు!! పోతే, మనం కాలేజీల్లో చదువుకున్న పాఠ్య పుస్తకాల్లో నౌరోజీ ప్రతిపాదించిన ‘‘వలసల సంపద హరణం’’ సిద్ధాంతం గురించి ప్రముఖంగా ప్రస్తావించడం కద్దు. ఆ పుస్తకాలు రాసేవాళ్ళంతా వలసవాదాన్నీ, సామ్రాజ్యవాదాన్నీ, ఆ మాటకొస్తే వాటన్నిటికీ మూలమైన పెట్టుబడిదారీ విధానాన్ని వ్యతిరేకించేవాళ్ళు కారుకదా! కానీ, వాళ్ళందరూ, ‘‘వలస దేశాల నుంచి సకల రూపాల్లో సంపద తరలించుకు పోయారు సుమా!’’ అని పాఠ్య గ్రంథాల్లో రాయక తప్పని పరిస్థితి ఏర్పడ్డానికి దాదాభాయ్‌ నౌరోజీ మొదలు నేటి శశి థరూర్‌ వరకూ ఎందరో కారకులు. చారిత్రక స్పృహ కలిగివుండడమంటే ఈ విషయాన్ని మర్చిపోకపోవడమే!!

తొలి భారతీయుడు 
దాదాభాయ్‌ నౌరోజీ తన తొంభయ్‌ రెండేళ్ళ సుదీర్ఘ జీవితంలో ఎన్నో ఘనతలను సాధించి ఆయా రంగాల్లో ప్రథముడిగా నిలిచారు. తను చదువుకున్న ఒకానొక భారతీయ కళాశాలలో గణితశాస్త్రం, తత్వశాస్త్రాలను బోధించే అధ్యాపకుడిగా నియమితుడైన తొలి భారతీయుడు నౌరోజీ. సహచర ఆచార్యుల నుంచి ‘‘భారతదేశ భవితవ్యం’’గా ప్రశంసలను అందుకున్న నౌరోజీ ఇరవయ్యేడో యేటనే రాజకీయరంగ ప్రవేశం చేశారు; మరో రెండేళ్ళలోనే రస్త్‌ గొఫ్తార్‌ (సత్యవాది) అనే ఆంగ్లో–గుజరాతీ పత్రికను ప్రారంభించారు; బ్రిటిష్‌ పార్లమెంట్‌ ఎన్నికల్లో పోటీచేసి గెల్చిన తొలి భారతీయుడు నౌరోజీ; కార్ల్‌ కౌట్‌స్కీ, గియోర్గియ్‌ ప్లెఖనోఫ్‌ తదితరుల నాయకత్వంలోని సెకండ్‌ ఇంటర్నేషనల్‌లో పాల్గొన్న తొలి (బహుశా ఏకైక) భారతీయుడు నౌరోజీ.

ఆ వేదిక మీదనుంచే తొలిసారి ఆయన బ్రిటిష్‌ వలసవాద ప్రభుత్వం భారతదేశాన్ని ఎలా కొల్లగొడుతోందో గణాంక వివరాలతో సహా వెల్లడించారు. అప్పట్లో భారత జనాభా పాతిక కోట్ల మంది వుండేవారట. వాళ్ళ తలసరి వార్షిక ఆదాయం 27 రూపాయలని’’ ప్రభుత్వం ప్రకటించగా, నిజానికి ఆ మొత్తం 20 రూపాయలకు మించదని నౌరోజీ వాదించి రుజువు చేశారు! ‘‘సుసంపన్నమయిన భారతదేశానికి పట్టాల్సిన గతి ఇదా?’’ అన్నది నౌరోజీ సూటి ప్రశ్న. ఆయన ప్రసంగ సారాంశమే తర్వాత కాలంలో ఓ సిద్ధాంతంగా సుప్రసిద్ధమయింది! దాన్నే మనం కాలేజీల్లో చదువుకున్నాం. భారత రాజకీయాల్లో నౌరోజీ మితవాదే అయివుండొచ్చు కానీ, మౌలికంగా ఆయన సత్యవాది కూడా! లేనట్లయితే, గాలికి పోయే మీడియా ముళ్ళకంపను చెంగుకు తగిలించుకోవలసిన అవసరం ఏముంది?

సరిహద్దులు చెరిపేశాడు!
‘లేడీ విద్‌ ఎ ల్యాంప్‌’గా ప్రసిద్ధురాలైన ఫ్లారెన్స్‌ నైటింగేల్, అమెరికన్‌ పరిశోధనాత్మక పాత్రికేయురాలు ఇడా వెల్స్, జాతిపరమైన వివక్షకు వ్యతిరేకంగా పోరాడిన బ్రిటిష్‌ క్వేకర్‌ కార్యకర్త కేథరిన్‌ ఇంపీ, కార్ల్‌ మార్క్స్‌ ‘అదనపు విలువ సిద్ధాంతాలు’ సంపుటాలకు సంపాదకుడిగా వ్యవహరించిన కార్ల్‌ కౌట్‌స్కీ, వి.ఐ.లెనిన్‌ తన రాజకీయ గురువుగా సంభావించిన గియోర్గియ్‌ ప్లెహనోఫ్, ఆఫ్రికన్‌ అసోసియేషన్‌ వ్యవస్థాపకుడూ ట్రినిడాడ్‌కు చెందిన ప్రముఖ న్యాయవాదీ హెన్రీ సిల్విస్టర్‌ విలియవ్‌సు, అమెరికన్‌ సామాజిక శాస్త్రవేత్త డబ్లు్య.ఈ.బీ.డ్యూబోయ్స్, ఘనా ప్రథమ నేత ఎన్‌ క్రుమా..  తదితరులతో నౌరోజీ –పందొమ్మిదో శతాబ్దిలోనే – స్నేహసంబంధాలు కలిగివుండడం ఆషామాషీ విషయం కాదు!

ఒక చరిత్ర పరిశోధకుడి అంచనా మేరకు నౌరోజీ – లండన్‌లో వుండే రోజుల్లో – మార్క్స్‌ను కూడా కలిసేవుంటారు. అలాంటి అంతర్జాతీయస్థాయి నాయకుణ్ణి కాంగ్రెస్‌ పార్టీలో మితవాదిగా మాత్రమే పరిగణించడం ఎంతవరకూ చారిత్రకమో నిపుణులు కనీసం ఇప్పుడయినా నౌరోజీ కన్నుమూసి నూట అయిదేళ్ళు కావస్తున్న తరుణంలోనయినా నిగ్గుతేల్చాలి!                                                             
– మందలపర్తి కిషోర్‌

(చదవండి: మహోజ్వల భారతి: బంకిమ్‌ని బయటే నిలబెట్టేశారు!)

మరిన్ని వార్తలు