మహోజ్వల భారతి: దివిసీమ గాంధీ!

4 Aug, 2022 15:23 IST|Sakshi
మండలి వెంకట కృష్ణారావు

మండలి వెంకట కృష్ణారావు అవనిగడ్డ శాసనసభ నియోజకవర్గం నుంచి 1972లో ఏకగ్రీవంగా ఎన్నికైన శాసన సభ్యుడు, గాంధేయవాది. రాష్ట్ర మాజీ మంత్రి మండలి బుద్ధప్రసాద్‌ తండ్రి. నేడు కృష్ణారావు జయంతి. ఆయన 1926 ఆగస్టు 4 న కైకలూరు మండలం పల్లెవాడలో జన్మించారు. కృష్ణా జిల్లా కైకలూరు తాలూకా, పల్లెవాడ గ్రామంలో వెంకట కృష్ణారావు ‘దివిసీమ గాంధీ’గా మన్ననలనందుకున్నారు. ‘బాధలలో ఉన్న వారిని మనమే ముందు వెళ్లి ఓదార్చాలి’ అని ఆయన ఆచరించి చెప్పిన మాటలు దివిసీమ ప్రజలకు భగవద్గీతలా వినిపిస్తూనే ఉంటాయి.

కృష్ణారావు కృషి వల్లే దివిసీమలోని నిరుపేదలకు బంజరు భూములను పంచే కార్యక్రమం ప్రారంభమైంది. 15 వేల ఎకరాల బంజరు భూములను ఆనాడు పేదలకు పంచారు. 1974 లో ఆయన విద్యా సాంస్కృతిక వ్యవహారాల మంత్రిగా బాధ్యతలు స్వీకరించారు. 1975 రాక్షస నామ సంవత్సరం ఉగాదినాడు ప్రథమ ప్రపంచ తెలుగు మహాసభలను హైదరాబాద్‌లో ఘనంగా నిర్వహించారు. అక్కడే ‘అంతర్జాతీయ తెలుగు సంస్థ’ను 1975లో నాటి భారత రాష్ట్రపతి ఫక్రుద్దీన్‌ అలీ అహమ్మద్‌ ప్రారంభించారు.

కృష్ణారావు ఆ సంస్థకు ప్రథమ అధ్యక్షులుగా వ్యవహరించారు. ప్రథమ ప్రపంచ తెలుగు మహాసభల కార్యనిర్వాహక అధ్యక్షులుగా, అంతర్జాతీయ తెలుగు కేంద్రం ప్రథమ అధ్యక్షులుగా వ్యవహరించిన మండలి వెంకట కృష్ణారావు కృషిని గుర్తించి దివంగత ముఖ్యమంత్రి వైఎస్‌ రాజశేఖరరెడ్డి అంతర్జాతీయ తెలుగు కేంద్రం పేరును ‘మండలి వెంకట కృష్ణారావు అంతర్జాతీయ తెలుగు కేంద్రం’గా మార్చారు. దివిసీమ లోని పులిగడ్డ – పెనుమూడి వంతెనకు కూడా మండలి వెంకట కృష్ణారావు పేరు పెట్టారు. కృష్ణారావు 1997 సెప్టెంబర్‌ 27న 71 ఏళ్ల వయసులో తుదిశ్వాస విడిచారు.



మృదుమధురశ్రీ
జంధ్యాల పాపయ్య శాస్త్రి 20వ శతాబ్దంలో జనాదరణ పొందిన తెలుగు కవులలో ఒకరు. ఆయన కవిత్వం సులభ శైలిలో, సమకాలీన ధోరణిలో, చక్కని తెలుగు నుడికారంతో సొంపుగా ఉంటుంది. ఖండకావ్యాల రచన ఆయన  ప్రత్యేకత. కరుణ రస ప్రధానంగా అనేక కవితలు రాసి ‘కరుణశ్రీ‘ అని ప్రసిద్ధులయ్యారు. కరుణశ్రీ ‘పుష్పవిలాపము‘, ‘కుంతి కుమారి’ కావ్యాలతో ప్రసిద్ధులయ్యారు. ఇక ఆయన కవితాత్రయం ‘ఉదయశ్రీ’, ‘విజయశ్రీ’, ‘కరుణశ్రీ’ అత్యధిక ముద్రణలు కలిగి, ఆయనకు ఎనలేని ఖ్యాతిని తెచ్చిపెట్టాయి. 

నేడు కరుణశ్రీ జయంతి. ఆయన గుంటూరు జిల్లా, పెదనందిపాడు మండలంలోని కొమ్మూరు గ్రామంలో 1912 ఆగస్టు 4న జన్మించారు. తల్లి మహాలక్ష్మమ్మ, తండ్రి పరదేశయ్య. కొమ్మూరులో ప్రాథమిక, మాధ్యమిక విద్యను అభ్యసిస్తున్నప్పుడే పాపయ్యశాస్త్రికి సంస్కృత భాషపై మక్కువ పెరిగింది. భమిడిపాటి సుబ్రహ్మణ్యశర్మ, కుప్పా ఆంజనేయశాస్త్రి వద్ద సంస్కృత కావ్యాలు చదివారు. రాష్ట్ర భాషా విశారద, ఉభయ భాషా ప్రవీణ, హిందీ భాషా ప్రవీణ పరీక్షలలో ఉత్తీర్ణుడై అమరావతి రామకృష్ణ విద్యాపీఠంలోనూ, గుంటూరు స్టాల్‌ గర్ల్స్‌ హైస్కూలులోనూ, ఆంధ్ర క్రైస్తవ కళాశాలలోనూ అధ్యాపకునిగా పనిచేశారు.1992 జూన్‌ 22న పరమపదించారు.  

మరిన్ని వార్తలు