యోగి సర్కార్‌పై కోర్టు ధిక్కరణ దావా! వివరణ కోరిన సుప్రీం

14 Jul, 2022 14:53 IST|Sakshi

న్యూఢిల్లీ: ఉత్తర ప్రదేశ్‌ యోగి సర్కార్‌పై కోర్టు ధిక్కరణ దావాకి సిద్ధమయ్యారు సమాజ్‌వాదీ పార్టీ నేత ఆజాం ఖాన్‌. రామ్‌పూర్‌లోని తన యూనివర్సిటీని సీల్‌ చేసిన విషయంలో యోగి ప్రభుత్వంపై కోర్టుకెక్కనున్నట్లు ప్రకటించారు ఆజాం ఖాన్‌.

కోర్టు ఆదేశాలను పట్టించుకోకుండా.. తనకు చెందిన మొహమ్మద్‌ అలీ జవుహార్‌ యూనివర్సిటీ చుట్టూ ఉన్న ఫెన్సింగ్‌ను తొలగించకపోవడంపై కోర్టు ధిక్కరణ కింద సుప్రీంను ఆశ్రయించనున్నట్లు ఆయన వెల్లడించారు.  ఈ మేరకు సుప్రీం కోర్టు సైతం ఈ వ్యవహారంపై గురువారం యూపీ ప్రభుత్వం నుంచి వివరణ కోరింది. ఫెన్సింగ్‌ తొలగించకపోవడం వల్ల.. యూనివర్సిటీ కార్యకలాపాలు నిలిచిపోయానని కోర్టుకు తెలిపారు ఆజాంఖాన్‌. ఈ మేరకు జస్టిస్‌ ఏఎం ఖాన్‌వలీకర్‌, జేబీ పార్దీవాలాతో కూడిన ధర్మాసం.. జులై 19లోపు వివరణ ఇవ్వాలని యూపీ సర్కార్‌ను కోరుతూ.. జులై 22వ తేదీకి విచారణను వాయిదా వేసింది. 

మే 27వ తేదీన జస్టిస్‌ చంద్రచూడ్‌, జస్టిస్‌ బెలా త్రివేదిలతో కూడిన ధర్మాసనం.. అలహాబాద్‌ హైకోర్టు ఇచ్చిన యూనివర్సిటీ స్థలాల జప్తు ఆదేశాలపై స్టే విధించింది. ఈ క్రమంలో యూనివర్సిటీ ఫెన్సింగ్‌ను తొలగించకపోవడం అత్యున్నత న్యాయస్థానాన్ని ఆక్రమించారు ఆయన.  

ఇదిలా ఉంటే.. ఉత్తర ప్రదేశ్‌ రాజకీయాల్లో సీనియర్‌ నేతగా పేరున్న ఆజాం ఖాన్‌.. వివాదాస్పద వ్యాఖ్యలు, వైఖరితో తరచూ వార్తల్లో నిలుస్తుంటారు కూడా. భూ కబ్జాతో పాటు చాలా కేసులు ఆయనపై నమోదు అయ్యాయి. ఒకానొక తరుణంలో ఆయన జైలు శిక్షపై న్యాయస్థానాల్లోనూ ఆసక్తికరమైన చర్చ కూడా నడిచింది. మరోవైపు రాజకీయ వైరంతోనే జైలుకు పంపారంటూ ఆజాం ఖాన్‌ అనుచరులు ఆరోపిస్తున్నారు. మొన్న యూపీ ఎన్నికల్లో జైలు నుంచే ఆయన ఘన విజయం సాధించడం విశేషం. 27 నెలలు జైల్లో గడిపిన ఈయన.. మే నెలలో జైలు నుంచి విడుదల అయ్యారు.

మరిన్ని వార్తలు