ఆ వేరియంట్‌ వల్లే భారీగా కేసులు

5 Jun, 2021 06:16 IST|Sakshi

న్యూఢిల్లీ: దేశంలో రెండు నెలలుగా భారీగా కోవిడ్‌ కేసులు పెరగడానికి బి.1.617 వేరియంటే ప్రధాన కారణమని ఇండియన్‌ సార్స్‌–కోవ్‌–2 కన్సార్టియం ఆన్‌ జెనోమిక్స్‌(ఇన్సాకాగ్‌) స్పష్టం చేసింది. ఏప్రిల్, మే నెలల్లో దేశవ్యాప్తంగా ఒక్కసారిగా భారీగా కేసులు పెరిగిన విషయం తెలిసిందే. మొట్టమొదటిసారిగా యూకేలో బయటపడిన వైరస్‌ వేరియం ట్‌ బి.1.1.7 లేదా ఆల్ఫా కేసులు ఇప్పుడు దేశంలో ఒకటిన్నర నెలలుగా తగ్గుముఖం పట్టాయని దేశం లోని 10 జాతీయ స్థాయి ప్రయోగశాలల ఉమ్మడి వేదిక ఇన్సాకాగ్‌ తెలిపింది.

కోవిడ్‌ వేరియంట్‌ బి.1.617 కేసులు మొదటిసారిగా మహారాష్ట్రలో బయటపడగా ఇప్పుడు పశ్చిమబెంగాల్, ఆంధ్రప్రదేశ్, ఢిల్లీ, గుజరాత్, తెలంగాణల్లోనూ పెరిగినట్లు తెలిపింది. గడిచిన 2 నెలలుగా కొన్ని రాష్ట్రా ల్లో భారీగా కేసులు పెరగటానికి బి.1.617 వేరియంట్‌కు సంబంధం ఉందని ఇన్సాకాగ్‌ పే ర్కొంది. ఈ వేరియంట్‌ ఇప్పుడు బి.1.617.1, బి.1.617.2, బి1.671.3 అనే వేరియంట్లుగా మారినట్లు తెలిపింది. ఇందులోని బి.1.617.2 వేరియంట్‌ వ్యాప్తి ఎక్కువగా ఉందని గుర్తించిన ప్రపంచ ఆరోగ్య సంస్థ ఇటీవల దీనికి డెల్టా వేరియంట్‌గా నామకరణం చేసినట్లు గుర్తు చేసింది.

వారణాసి ప్రాంతంలో 7 వేరియంట్లు
సాక్షి, హైదరాబాద్‌: ఉత్తరప్రదేశ్‌లోని వారణాసి ప్రాంతంలో కనీసం 7 కరోనా వేరియంట్లు వ్యాప్తిలో ఉన్నట్లు బెనారస్‌ హిందూ యూనివర్సిటీ, (బీహెచ్‌యూ) సెంటర్‌ ఫర్‌ సెల్యులార్‌ అండ్‌ మాలిక్యులర్‌ బయాలజీ (సీసీఎంబీ) సంయుక్త అధ్యయనంలో తేలింది. వారణాసి పరిసర ప్రాంతాల్లోని పలు వేరియంట్ల జన్యుక్రమాలను విశ్లేషించి పరిశీలించినప్పుడు ఈ ఏడు రకాలు ఆ ప్రాంతంలో ఎక్కువ వ్యాప్తిలో ఉన్నట్లు తెలిసిందని సీసీఎంబీ తెలిపింది. దేశంలో రెండో దఫా కోవిడ్‌ కేసులు పెరిగేందుకు కూడా ఈ వేరియంటే కారణమని బీహెచ్‌యూ శాస్త్రవేత్త ప్రొఫెసర్‌ సింగ్‌ తెలిపారు.

దేశంలోని ఇతర ప్రాంతాల్లో మాదిరిగానే బి.1.617.2 లేదా డెల్టా వేరియంట్‌ కూడా ఈ ప్రాంతంలో చాలా సాధారణంగా కనిపించిందని ఆయన వివరించారు. సేకరించిన నమూనాల్లో 36 శాతం ఈ వేరియంట్‌వేనని తెలిపారు. వీటితోపాటు దక్షిణాఫ్రికాలో గుర్తించిన బి.1.351 వేరియంట్‌ను తొలిసారి వారణాసి ప్రాంతంలో గుర్తించామని సీసీఎంబీ గౌరవ సలహాదారు డాక్టర్‌ రాకేశ్‌ మిశ్రా తెలిపారు.
చదవండి: ఏడాదిలోపే కోవిడ్‌ ఆయుధాలు సిద్ధం

Read latest National News and Telugu News
Follow us on FaceBook, Twitter, Instagram, YouTube
తాజా సమాచారం కోసం      లోడ్ చేసుకోండి
మరిన్ని వార్తలు