అయ్యో.. మళ్లీ రోడ్డు పక్కకే... ‘బాబా కా దాబా’ 

9 Jun, 2021 08:15 IST|Sakshi

పాత స్థలంలోనే హోటల్‌ నడుపుతున్న కాంతాప్రసాద్‌ దంపతులు 

కరోనా వల్ల ఆదాయం లేక మూతపడిన రెస్టారెంట్‌ 

న్యూఢిల్లీ: ‘బాబా కా దాబా’ వృద్ధ దంపతులు కాంతాప్రసాద్, ఆయన భార్య బాదామీ దేవి గుర్తున్నారా? వారి కథ మళ్లీ మొదటికొచ్చింది. కరోనా ధాటికి మళ్లీ దక్షిణ ఢిల్లీలోని మాలవ్యా నగర్‌లో రోడ్డు పక్కన చిన్న హోటల్‌ నడుపుకుంటున్నారు. చాలీచాలని ఆదాయంతో బతుకీడుస్తున్నారు. రూ.5  లక్షల పెట్టుబడితో వారు గతేడాది ప్రారంభించిన రెస్టారెంట్‌ ఆరు నెలలు బాగానే నడిచింది. క్రమంగా వినియోగదారుల ఆదరణ పడిపోయింది. నష్టాలు వస్తుండడంతో చేసేది లేక ఈ ఏడాది ఫిబ్రవరిలో మూసేశారు. ఇప్పుడు మళ్లీ పాత హోటలే కొనసాగిస్తున్నారు.

కరోనా వల్ల ఆదాయం లేక కన్నీటి పర్యంతం అవుతున్న బాబా కా దాబా దంపతుల వ్యథను యూ ట్యూబర్‌ గౌరవ్‌ వాసన్‌ గత ఏడాది సోషల్‌ మీడియాలో పోస్టు చేశాడు. ఈ వీడియో దేశవ్యాప్తంగా వైరల్‌గా మారింది. బాబాకా దాబాకు జనం పోటెత్తారు.   రాత్రే సక్సెస్‌ఫుల్‌ దాబాగా మారింది. మానవతావాదులు అందించిన ఆర్థిక సాయంతో కాంతాప్రసాద్‌ దంపతులు తమ అప్పులన్నీ తీర్చేశారు. రూ.5 లక్షల దాకా పోగుచేశారు. ఈ డబ్బుతో అద్దె స్థలంలో రెస్టారెంట్‌ ప్రారంభించారు. ఆరు నెలలపాటు సక్రమంగా నడిచి ఫిబ్రవరిలో మూతపడింది. 

రెస్టారెంట్‌తో నష్టాలే మిగిలాయి 
లాక్‌డౌన్‌ కంటే ముందు నిత్యం రూ.3,500 దాకా అమ్మకాలు జరిగేవని, ఇప్పుడు కనీసం రూ.1,000 రావడం లేదని కాంతాప్రసాద్‌ ఆవేదన వ్యక్తం చేశాడు. తమ కుటుంబంలో 8 మంది ఉన్నామని, ఈ ఆదాయంతో ఎలా బతకాలని వాపోయాడు. రెస్టారెంట్‌ ప్రారంభిస్తే నష్టాలే మిగిలాయన్నాడు. ముగ్గురిని పనిలో పెట్టుకున్నానని, నెలవారీ ఆదాయం ఎప్పుడూ రూ.40 వేలు దాటలేదన్నాడు. కొందరి తప్పుడు సలహా వల్లే రెస్టారెంట్‌ మొదలుపెట్టానని తెలిపాడు.

అప్పట్లో వైరల్‌ అయిన 'బాబా కా దాబా' వీడియో

చదవండి: బాబా కా ధాబా : యుట్యూబర్‌‌పై ఎఫ్‌ఐఆర్‌ నమోదు

Read latest National News and Telugu News
Follow us on FaceBook, Twitter, Instagram, YouTube
తాజా సమాచారం కోసం      లోడ్ చేసుకోండి
మరిన్ని వార్తలు