బాబా రాందేవ్‌ సీరియస్‌ వార్నింగ్‌.. లైవ్‌లోనే అసహనం.. వీడియో వైరల్‌

31 Mar, 2022 07:59 IST|Sakshi

ఛండీగఢ్‌: యోగా గురు బాబా రామ్‌దేవ్‌ సహనం కోల్పోయారు. లైవ్‌లోనే ఓ జర్నలిస్టుపై అసహనం వ్యక్తం చేస్తూ బెదిరింపులకు పాల్పడ్డారు. ఇందుకు సంబంధించిన వీడియో సోషల్‌ మీడియాలో వైరల్‌గా మారింది. వివరాల ప్రకారం.. రామ్‌దేవ్‌ బుధవారం హర్యానాలోని కర్నాల్‌లో ఓ కార్యక్రమంలో పాల్గొన్నారు. కాగా, అంతకు ముందు 2014లో బాబా రామ్‌ దేవ్‌ ప్రజలు లీటర్‌కు రూ. 40 పెట్రోల్‌, రూ. 300 లకే గ్యాస్‌ సిలిండర్‌ ఇచ్చే ప్రభుత్వాన్ని ఎన్నుకోవాలని కోరారు.

ఈ సందర్బంగా ఓ మీడియా విలేకరి గతంలో బాబా రామ్‌దేవ్‌ చేసిన వ్యాఖ్యలపై ప్రశ్నలపై ప్రశ్నించారు. దీంతో బాబా రామ్‌ దేవ్‌ సహనం కోల్పోయి లైవ్‌లోనే బెదిరించారు. తాజాగా చమురు ధరలు పెరుగుతున్న నేపథ్యంలో విలేకరి, రామ్‌ దేవ్‌ బాబా వ్యాఖ్యలపై ప్రశ్నించగా.. ‘‘అవును, ఇప్పుడు ఏం చేయమంటారు..? ఇలాంటి ప్రశ్నలు అడగకండి.. నేనేమీ మీ కాంట్రాక్టర్‌ను కాదు.. అన్ని ప్రశ్నలకు సమాధానం ఇవ్వాల్సిన పనిలేదు..’’ అన్నారు. ఇంతో సదరు విలేకరి మరోసారి ప్రశ్నించగా.. అతడిపై రామ్‌ దేవ్‌ సీరియస్‌గా చూస్తూ..‘‘ నేను, ఆ వ్యాఖ‍్య చేశాను. అబ్ క్యా కర్ లేగా (నువ్వేం చేస్తావు)? నోరు మూసుకో. మళ్లీ అడగకు.. ఇలా మాట్లాడకు.. మంచిది కాదు.. నువ్వు మీ పేరెంట్స్‌కు మంచి కొడుకుగా ఉండాలి’’ అంటూ వార్నింగ్ ఇచ్చారు.

అనంతరం బాబా రామ్‌ దేవ్‌ మాట్లాడుతూ.. కష్ట సమయాల్లో మరింత కష్టపడి పనిచేయాలని రామ్‌దేవ్ ప్రజలకు విజ్ఞప్తి చేశారు. ‘‘ఇంధన ధరలు తగ్గితే పన్ను రాదని, దేశాన్ని ఎలా నడుపుతారని, జీతాలు చెల్లిస్తారని, రోడ్లు ఎలా వేస్తారని ప్రభుత్వం చెబుతోందంటూ ఆసక్తికర వ్యాఖ‍్యలు చేశారు. అవును, ద్రవ్యోల్బణం తగ్గాలి, అందుకు ఒప్పుకుంటాను.. అయితే ప్రజలు కష్టపడి పనిచేయాలి. తాను కూడా తెల్లవారుజామున 4 గంటలకు నిద్రలేచి రాత్రి 10 గంటల వరకు పని చేస్తాను" అని అన్నారు. ఇదిలా ఉండగా.. దేశంలో పెట్రోల్‌, డీజిల్‌ ధరలు రోజురోజుకు పెరుగుతున్నాయి. బుధవారం లీటర్‌ పెట్రోల్‌, డీజిల్‌పై మరో 80 పైసలు పెరిగింది. దీంతో గత తొమ్మిది రోజులలో లీటరుకు రూ. 5లకు పైగా పెరిగాయి.

మరిన్ని వార్తలు