సోషల్ మీడియానా మజాకా: వైరల్ వీడియో

8 Oct, 2020 14:11 IST|Sakshi

బాబాకా ధాబాకు క్యూ కట్టిన కస్టమర్లు

సంతోషంతో  ఉక్కిరి అయిన యజమాని

సాక్షి, న్యూఢిల్లీ: చిన్నపిల్లలనుంచి వృద్ధుల దాకా సోషల్ మీడియా విపరీతమైన ప్రభావాన్ని పడవేస్తోంది. ఆధునిక టెక్నాలజీ యుగంలో సోషల్ మీడియా ప్రపంచ దిశ దశను మారుస్తోంది. రాజకీయాలు నుంచి వంటింటి దాకా సోషల్ మీడియానా మజాకా అనిపిస్తోంది. ఢిల్లీలో చోటు చేసుకున్న ఒక సంఘటన గురించి తెలుసుకుంటే.. సోషల్ మీడియా మీద ఒకింత కోపంగా ఉన్న వారు కూడా ఔరా అనక మానరు.

ఢిల్లీలోని మాలవీయనగర్‌లో ఉన్న బాబాకా ధాబా గురించి ట్విటర్‌లో ఒక వీడియో పోస్ట్ అయింది. కరోనా, లాక్‌డౌన్ కారణంగా డిమాండ్ లేక షాపు యజమాని కన్నీళ్లు పెట్టుకున్న వీడియోలో షేర్ చేశారు. దాదాపు 80 ఏళ్ళ వృద్ధాప్యంలో జీవనం కోసం ఆ జంట పడుతున్న ఆరాటాన్ని చూపించారు. అంతేకాదు వీరిని ఆదుకోవాలని విజ్ఞప్తి చేశారు. అంతే క్షణాల్లో ఈ వీడియో వైరల్ గా మారింది.  

పిల్లల అనాదరణకు గురైన ఈ వృద్ధ దంపతుల పోరాట కథ పలువురి హృదయాలను కదిలించింది. బాలీవుడ్ నటులు సునీల్ శెట్టి, రవీన్ టాండన్, సోనమ్ కపూర్,  రవీనా టాండన్, జర్నలిస్టు, నటి స్వర భాస్కర్, క్రికెటర్ ఆర్ అశ్విన్ లాంటి సెలబ్రిటీలతో పలువురు దీన్ని లైక్ చేసి, షేర్ చేశారు. దీంతో నెటిజనుల నుంచి స్పందన భారీగా వచ్చింది.  సపోర్ట్ లోకల్ అంటూ స్థానికులు బాబా కా ధాబాకు క్యూ కట్టారు. ఫుడ్ స్టాల్  లో లభ్యమయ్యే  భోజనం, చపాతీలకు ఇబ్బడి ముబ్బడిగా ఆర్డర్లు ఇవ్వడం మొదలు పెట్టారు. 

బాబా చేతి వంట మటర్ పనీర్ ఆసాంతం లొట్టలేసుకుంటూ ఆరగించేశారు. సెల్ఫీలతో సందడి చేశారు. దీంతో  సంతోషంతో ఉక్కిరి అయిపోవడం యజమాని వంతైంది. అంతేకాదు మాలవీయ నగర్ బాబాకా ధాబా ఒక ల్యాండ్ మార్క్ గా నిలిచింది. ఈ వీడియో ఆమ్ ఆద్మీ పార్టీ ఎమ్మెల్యే సోమనాథ్ భారతిని కూడా కదిలించింది.  బాబా కా ధాబాను తాను సందర్శించానని, వారి జీవితాల్లో సంతోషం కోసం తాను చేయగలిగింది తాను చేస్తానంటూ ట్వీట్ చేశారు. కాగా ఈ వీడియోను బ్లాగర్ గౌరవ్ వాసన్ చిత్రీకరించారు. బాబా కా దాబా ఓనరు పేరు కాంత ప్రసాద్. భార్య  పేరు బాదామి దేవి.

మరిన్ని వార్తలు