అద్వానీపై సీబీఐ కోర్టు ప్రశ్నల వర్షం

24 Jul, 2020 20:31 IST|Sakshi

లక్నో : భారత మాజీ ఉప ప్రధానమంత్రి, బీజేపీ కురవృద్ధుడు ఎల్‌కే అద్వానీపై సీబీఐ ప్రత్యేక న్యాయస్థానం ప్రశ్నల వర్షం కురిపించింది. 1992 బాబ్రీ మసీదు కూల్చివేతకు సంబంధించి.. సీబీఐ కోర్టు శుక్రవారం వీడియో కాన్ఫరెన్స్‌ ద్వారా అద్వానీ వాంగూల్మం నమోదు చేసింది. ఉదయం 11 గంటల నుంచి మధ్యాహ్నం 3.30 గంటల మధ్యలో దాదాపు నాలుగున్నర గంటల పాటు ఈ కేసు విచారణ కొనసాగింది. ఈ క్రమంలో న్యాయమూర్తి అద్వానీని 100 ప్రశ్నలు అడిగినట్టు ఆయన తరఫున లాయర్‌ తెలిపారు. అయితే ఈ సందర్భంగా తనపై ఉన్న ఆరోపణలను అద్వానీ ఖండించినట్టు వెల్లడించారు. (జోషి వాంగ్మూలం నమోదు చేసిన సీబీఐ కోర్టు)

ఇప్పటికే ఈ కేసుకు సంబంధించి సీబీఐ ప్రత్యేక న్యాయస్థానం గురువారం బీజేపీ సీనియర్‌ నాయకులు మురళీ మనోహర్‌ జోషి వాంగ్మూలం నమోదు చేసిన సంగతి తెలిసిందే.  సీఆర్‌పీసీ సెక్షన్‌ 313 కింద ఈ కేసులో ఆరోపణలు ఎదుర్కొంటున్న మొత్తం 32 మంది తమ వాదనలను వినిపించవచ్చని న్యాయమూర్తి ఇదివరకే పేర్కొన్న సంగతి తెలిసిందే. కాగా, బాబ్రీ మసీదు కూల్చివేత కేసును ఆగస్టు 31 లోగా పూర్తి చేయాలని లక్నో సీబీఐ ప్రత్యేక కోర్టు న్యాయమూర్తిని సుప్రీంకోర్టు ఆదేశించిన సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో గడువులోగా విచారణ పూర్తిచేసి, తీర్పు వెలువరించేందుకు సీబీఐ ప్రత్యేక న్యాయస్థానం రోజువారి విచారణ చేపడుతోంది. (నదిలో మధ్యలో సెల్ఫీ దిగుదామనుకుంటే..)

మరోవైపు కోర్టు ముందు వాంగ్మూలం వినిపించడానికి రెండు రోజుల ముందు అద్వానీ కేంద్ర హోం శాఖ మంత్రి అమిత్‌ షాతో సమావేశమైన సంగతి తెలిసిందే. వీరిద్దరి మధ్య భేటీ దాదాపు 30 నిమిషాల పాటు సాగింది.

మరిన్ని వార్తలు