బాబ్రీ విధ్వంసం కేసుపై నేడే తుదితీర్పు

30 Sep, 2020 07:53 IST|Sakshi

లక్నో: సుదీర్ఘకాలంగా పెండింగ్‌లో ఉన్న 1992 బాబ్రీమసీదు కూల్చివేత కేసులో ప్రత్యేక న్యాయస్థానం నేడు తుదితీర్పు వెలువరించనుంది. తీర్పు వెలువరించే రోజు నాటికి జీవించి ఉన్న 32 మంది ముద్దాయిలు కూడా కోర్టు ఎదుట హాజరుకావాలని సీబీఐ జడ్జి ఎస్‌కే యాదవ్‌ 16వ తేదీన ఆదేశించారు. ముద్దాయిల్లో మాజీ ఉపప్రధాని ఎల్‌కే అడ్వాణీ, కేంద్ర మాజీ మంత్రులు మురళీ మనోహర్‌ జోషి, ఉమాభారతి, ఉత్తరప్రదేశ్‌ మాజీ ముఖ్యమంత్రి కళ్యాణ్‌ సింగ్, వినయ్‌ కతియార్, సాధ్వి రితంబర ఉన్నారు. తీర్పునిచ్చే రోజు కరోనా ఆసుపత్రిలో చికిత్స పొందుతోన్న ఉమాభారతి, కళ్యాణ్‌ సింగ్‌ కోర్టులో హాజరవుతారో లేదో తెలియరాలేదు. కళ్యాణ్‌ సింగ్‌ ఉత్తరప్రదేశ్‌ ముఖ్యమంత్రిగా ఉండగా బాబ్రీ విధ్వంసం జరిగింది. రాజస్తాన్‌ గవర్నర్‌గా పదవీ కాలం ముగియగానే గత సెప్టెంబర్‌ నుంచి, ఆయనపై విచారణ కొనసాగింది.(చదవండి: నూతన శకానికి నాందీ క్షణం)

విచారణ జరుగుతుండగానే 16 మంది మరణం
కాగా 1992 డిసెంబర్‌ 6న కరసేవకులు అయోధ్యలో బాబ్రీ మసీదుని కూల్చివేశారు. దేశ వ్యాప్తంగా సంచలనం రేపిన ఈ కేసును సీబీఐ విచారించింది. ఈ క్రమంలో సీబీఐ 351 మంది సాక్షుల్ని న్యాయస్థానం ఎదుట ప్రవేశపెట్టింది. 600 డాక్యుమెంట్లను రుజువులుగా చూపించింది. 48 మందిపై అభియోగాలు నమోదు చేయగా, విచారణ జరుగుతుండగానే 16 మంది ప్రాణాలు కోల్పోయారు. 16వ శతాబ్దం నాటి బాబ్రీ మసీదుని కూల్చివేతలో పాల్గొన్న కరసేవకుల్ని ఈ కేసులో నిందితులందరూ కుట్ర పన్ని వారిని రెచ్చగొట్టారని సీబీఐ న్యాయస్థానం ఎదుట వాదనలు వినిపించింది. 

మరిన్ని వార్తలు