బాబ్రీ విధ్వంసం వెనక పాక్‌ హస్తం!

1 Oct, 2020 15:08 IST|Sakshi

సాక్షి, న్యూఢిల్లీ : అయోధ్యలోని బాబ్రీ మసీదు విధ్వంసం కేసులో 28 ఏళ్ల సుదీర్ఘ విచారణ అనంతరం ప్రత్యేక సీబీఐ కోర్టు ఇచ్చిన తీర్పుకు అన్ని జాతీయ పత్రికలు, ప్రాంతీయ పత్రికలు తగిన ప్రాధాన్యతనిచ్చాయి. పాలకపక్ష బీజేపీ నేతలు ఎల్‌కే అడ్వాణీ, మురళీ మనోహర్‌ జోషి, కళ్యాణ్‌ సింగ్, ఉమా భారతి సహా మొత్తం 32 మంది నిందితులు నిర్దోషులని, వారు బాబ్రీ విధ్వంసానికి ముందస్తు కుట్ర పన్నారనడానికి ఎలాంటి ఆధారాలు లేవంటూ ఇచ్చిన తీర్పుకు ఈ పత్రికలు ఎక్కువ ప్రాధాన్యతనిచ్చాయి. (బాబ్రీ తీర్పు.. బీజేపీకి నయా అస్త్రం)

బాబ్రీ మసీదు విధ్వంసం వెనక పాకిస్థాన్‌ హస్తం ఉండవచ్చంటూ ప్రత్యేక సీబీఐ జడ్జీ ఎస్‌కే యాదవ్‌ చేసిన వ్యాఖ్యకు కొన్ని పత్రికలు తక్కువ ప్రాధాన్యతనివ్వగా మిగతా పత్రికలు అసలు పట్టించుకోలేదు. విధ్వంసం జరిగిన రోజున బాబ్రీ మసీదు వద్ద టెర్రరిస్టులు కూడా ఉండి ఉండవచ్చంటూ ఆయన చేసిన వ్యాఖ్యలను ఎవరూ పెద్దగా పట్టించుకోలేదు. బీజేపీ సీనియర్‌ నేతలు బాబ్రీ మసీదు విధ్వంసానికి కుట్ర పన్నారనడానికి ఫొటోలు, వీడియోల సాక్ష్యంగానీ, ఫోరెన్సిక్‌ నిపుణుల విశ్లేషణలుగానీ లేవంటూ కూడా జడ్జీ నొక్కి చెప్పడాన్ని కూడా పత్రికలు పట్టించుకోలేదు. (‘బాబ్రీ’ తీర్పు: అందరూ నిర్దోషులే)

1992, డిసెంబర్‌ 6వ తేదీన  బాబ్రీ మసీదు విధ్వంసానికి పాల్పడిన వారు మాత్రం ‘కచ్చితంగా సంఘ విద్రోహ శక్తులే’ అంటూ కూడా జడ్జీ యాదవ్‌ వ్యాఖ్యానించారు. మసీదును కూల్చడం అక్రమమని, అది చట్టాన్ని ఉల్లంఘించటమేనంటూ అయోధ్య స్థల వివాదం కేసులో సుప్రీం కోర్టు తీర్పునిచ్చిన నేపథ్యంలో ఆయన ఈ వ్యాఖ్యలు చేసి ఉండవచ్చు. పాలకపక్ష బీజేపీ తన పార్టీ వైఖరికి సానుకూలంగా తీర్పులిస్తోన్న వారిని రాజకీయ పదవులతో సముచితంగా సత్కరిస్తున్నాయంటూ ఒకటి, రెండు జాతీయ ఆంగ్ల పత్రికలు వ్యంగ్యోక్తులు విసిరాయి. (మసీదు దానికదే కూలిపోయిందా?)

‘బాబ్రీ విధ్వంసం కేసులో ఎవరూ దోషులు కాదు’ అనే శీర్షికతో వార్తను ప్రచురించిన ఆనందబజార్‌ పత్రిక, ఇంకా నయం ‘బాబ్రీని ఎవరు కూల్చలేదు’ అంటూ కోర్టు తీర్పు ఇవ్వలేదంటూ కొంతమంది సంబర పడుతున్నారని వ్యాఖ్యానించింది. ‘ఏక్‌ దక్కా ఔర్‌ దో, బాబ్రీ మసీద్‌ తోడ్‌ దో’ అంటూ బీజేపీ లేదా విశ్వహిందూ పరిషద్‌ నాయకులు ఎల్‌కే అడ్వాణీ, మురళీ మనోహర్‌ జోషి, అశోక్‌ సింఘాల్‌’ నినాదాలు ఇవ్వడం ఎవరూ వినలేదంటూ ఆ పత్రిక వ్యంగోక్తి విసిరింది. ‘బీజేపీ, ఆర్‌ఎస్‌ఎస్‌ నాయకులు బాబ్రీ మసీదును విధ్వంసం చేయకుండా ప్రజలను అడ్డుకునేందుకు ప్రయత్నించారు’ అంటూ సీబీఐ జడ్జీ యాదవ్‌ చేసిన వ్యాఖ్యకు తమిళ పత్రిక ‘దినమలార్‌’ ప్రాధాన్యతనిచ్చింది. 

ఈ తీర్పును సవాల్‌ చేస్తూ సీబీఐ సుప్రీం కోర్టుకు వెళుతుందా? అంటూ కూడా ఆ పత్రిక సందేహం వ్యక్తం చేసింది. ‘1992, డిసెంబర్‌ 6వ తేదీన ఏం జరిగిందో, 2020, సెప్టెంబర్‌ 30వ తేదీన ఏం తీర్పు వెలువడిందో మనందరికి తెలుసు. బాబ్రీ విధ్వంసం తర్వాత చెలరేగిన అల్లర్లలో చిమ్మిన రక్తం ఎంతో మనలో కళ్లతో చూసిన వారు ఉన్నారు. ఇదంగా ఎవరు చేశారో మనకు తెలుసు. ఎందుకు చేశారో మనకు తెలుసు. దాని వల్ల జాతికెంత నష్టమో మనకు తెలుసా? వారికి న్యాయబద్ధత కల్పిస్తున్నాం. ఎన్నికల అనంతరం ఎన్నికల్లో గెలిపిస్తూ వస్తున్నాం. ఇప్పుడు నిరాశతో ఓండ్ర పెడితే లాభం ఏమిటీ?! ది టెలీగ్రాఫ్‌ పత్రిక వ్యాఖ్యానించింది. 

Read latest National News and Telugu News
Follow us on FaceBook, Twitter, Instagram, YouTube
తాజా సమాచారం కోసం      లోడ్ చేసుకోండి
మరిన్ని వార్తలు