కమలనాథుల్లో కొత్త ఉత్సాహం

1 Oct, 2020 07:00 IST|Sakshi
ఢిల్లీలో ఎంఎంజోషికి లడ్డూ తినిపిస్తున్న లాయర్‌ మహిపాల్‌ అహ్లూవాలియా

బిహార్‌ అసెంబ్లీ, ఉప ఎన్నికల్లో ఇదే ప్రచార అంశం

న్యూఢిల్లీ: బాబ్రీ మసీదు కూల్చివేత కేసులో బీజేపీ అగ్రనేతలు, హిందూత్వవాదులు నిర్దోషులుగా బయటపడడం కాషాయం కూటమిలో కొత్త ఉత్సాహాన్ని నింపింది. వివాదాస్పద కట్టడాన్ని కుట్ర ప్రకారం కూల్చలేదని, అప్పటికప్పుడు జరిగిపోయిన సంఘటన అంటూ పదే పదే చెబుతూ వస్తున్న బీజేపీ నాయకులు సీబీఐ ప్రత్యేక న్యాయస్థానం ఇచ్చిన తీర్పుని స్వాగతిస్తున్నారు. బిహార్‌ ఎన్నికలు, వివిధ రాష్ట్రాల్లో 56 అసెంబ్లీ స్థానాలు, ఒక లోక్‌ సభ స్థానానికి ఉప ఎన్నికలు జరగనున్న నేపథ్యంలో బాబ్రీ తీర్పుతో మరో భావోద్వేగ అంశాన్ని ఎన్నికల్లో ప్రచారం చేసుకునే అవకాశం బీజేపీకి వచ్చింది.

కమలనాథులు  రామ మందిర నిర్మాణాన్ని తమ ఖాతాలో వేసుకుంటూనే మసీదు కూల్చివేతతో అంటిన మట్టిని వదిలించుకునే ప్రయత్నాల్లో ఉన్నారు. గత ఏడాది మందిర నిర్మాణానికి అనుకూలంగా తీర్పు రావడం, ఇప్పుడు మసీదు కూల్చివేతలో బీజేపీ ప్రమేయం లేదని కోర్టు తేల్చి చెప్పడంతో రాజకీయంగా తమకు బాగా లబ్ధి చేకూరుతుందని బీజేపీ  వర్గాలు యోచిస్తున్నాయి. కోర్టు తీర్పుని జై శ్రీరామ్‌ నినాదాలతో స్వాగతించామని అగ్రనేత ఎల్‌కే అడ్వాణీ వ్యాఖ్యానించారు. అటు రాముడికి గుడి కడుతున్నారన్న పేరు ప్రతిష్టలు రావడంతో పాటు, మసీదు కూల్చివేత అప్రతిష్ట కూడా పార్టీకి అంటకుండా తీర్పు వెలువడడం బీజేపీలో మంచి ఉత్సాహాన్ని నింపింది. మొత్తమ్మీద రామజన్మభూమి ఉద్యమం పార్టీకి అన్ని రకాలుగా కలిసొచ్చిందనే విశ్లేషణలు వినబడుతున్నాయి.  

తీర్పుపై ఎవరేమన్నారు..
► సీబీఐ కోర్టు తీర్పు చరిత్రాత్మకం. ‘జై శ్రీరామ్‌.. అందరికీ మంచి బుద్ధి ప్రసాదించాలని దేవుడిని వేడుకుంటున్నాను.
–మురళీ మనోహర్‌ జోషి, బీజేపీ

► కోర్టు తీర్పును స్వాగతిస్తున్నాను. ఆలస్యమైనా చివరికి న్యాయమే గెలిచింది.
–రాజ్‌నాథ్‌ సింగ్, కేంద్ర మంత్రి

► 472 ఏళ్లుగా సాగిస్తున్న పోరాటానికి ఎట్టకేలకు తెరపడింది. ఆలయాల రక్షణకు, వాటి ఆస్తుల పరిరక్షణకు పోరాటం కొనసాగిస్తాం.
–వినోద్‌ బన్సల్, విశ్వహిందూ పరిషత్‌ ప్రతినిధి  

► రాజ్యాంగ స్ఫూర్తికి 2019నాటి సుప్రీంకోర్టు తీర్పుకు ఈ తీర్పు విరుద్ధం.  
–రణ్‌దీప్‌ సూర్జేవాలా, కాంగ్రెస్‌ పార్టీ ప్రతినిధి  

► ప్రభుత్వాలు పక్షపాత ధోరణితో వ్యవహరించరాదు. న్యాయం పూర్తిగా వక్రీకరించబడింది.
–సీతారాం ఏచూరి, సీపీఎం ప్రధాన కార్యదర్శి

► సీబీఐ కోర్టు తీర్పు దురదృష్టకరం. దీనిపై ప్రభుత్వం కోర్టులో సవాల్‌ చేయాలి.  
–ఇండియన్‌ యూనియన్‌ ముస్లింలీగ్‌

►  ఈ కుట్రలో భాగస్వాములెవరన్నదీ బహిరంగ సత్యం. దీనిపై సీబీఐ అప్పీలుకు వెళ్లాలి.
–వలీ రహ్మానీ, ఆల్‌ ఇండియా ముస్లిం పర్సనల్‌ లా బోర్డ్‌ ప్రధాన కార్యదర్శి

► పట్టపగలే జరిగిన మసీదు విధ్వంసాన్ని ప్రపంచమంతా చూసింది. ఎవరి ప్రోద్బలంతో ఈ ఘటన జరిగిందో అందరికీ తెలుసు.
–మౌలానా అర్షద్‌ మదానీ, జమైత్‌ ఉల్‌ ఉలేమా ఇ హింద్‌ అధ్యక్షుడు

► ఆ నిర్మాణాన్ని కూల్చివేశారనడానికి సంబంధించి ఎన్నో సాక్ష్యాలున్నా కోర్టు పట్టించుకోలేదు. దీనిపై ముస్లింలు హైకోర్టుకు వెళ్లవచ్చు. దీనిపై అంగీకారం కుదిరితే బోర్డు కూడా పార్టీగా చేరవచ్చు. బాధితులు, తనవంటి ఎందరో సాకు‡్ష్యలు కూడా అవసరమైతే అప్పీలుకు వెళ్లే హక్కుంది.
–జఫర్యాబ్‌ జిలానీ, ఏఐఎంపీఎల్‌బీ సభ్యుడు, సీనియర్‌ లాయర్‌

► చారిత్రక మసీదు ధ్వంసానికి బాధ్యులైన వారిని నిర్దోషులుగా పేర్కొనడం సిగ్గు చేటు. దీనిని తీవ్రంగా ఖండిస్తున్నాం. భారత ప్రభుత్వం మైనారిటీలకు, వారి ప్రార్థనా స్థలాలకు రక్షణ కల్పించాలని కోరుతున్నాం.
–పాకిస్తాన్‌ విదేశాంగ శాఖ  

► కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వం చేతిలో సీబీఐ పంజరంలో చిలక మాదిరిగా మారిపోయింది. బాబ్రీ కేసులో నిజాయతీగా వ్యవహరించడంలో సీబీఐ విఫలమైంది.
 –ఎంకే స్టాలిన్, డీఎంకే అధ్యక్షుడు  

మరిన్ని వార్తలు