జిగ్నేష్‌ మేవానీకి ఎట్టకేలకు బెయిల్‌

29 Apr, 2022 19:31 IST|Sakshi
జిగ్నేష్‌ మేవానీ

కొక్రాఝర్: గుజరాత్‌ ఎమ్మెల్యే, దళిత నాయకుడు జిగ్నేష్‌ మేవానీకి ఎట్టకేలకు బెయిల్‌ లభించింది. దౌర్జన్యపూరితంగా ప్రభుత్వ ఉద్యోగి విధులకు ఆటంకం కలిగించిన కేసులో అస్సాంలోని బార్పేట సెషన్స్‌ కోర్టు శుక్రవారం బెయిల్ మంజూరు చేసింది. శనివారం ఆయన జైలు నుంచి విడుదలయ్యే అవకాశముంది. 

ప్రధాని నరేంద్ర మోదీకి వ్యతిరేకంగా ట్వీట్ చేసినందుకు గుజరాత్‌లో ఏప్రిల్ 20న జిగ్నేష్‌ను అస్సాం పోలీసులు అరెస్టు చేశారు. ఏప్రిల్‌ 25న ఆయనకు బెయిల్ మంజూరైంది. స్థానిక కోర్టు బెయిల్‌ మంజూరు చేసిన కొద్ది గంటల్లోనే ఆయనను మరోసారి అదుపులోకి తీసుకున్నారు. మహిళా పోలీసు అధికారిని దుర్భాషలాడి దాడి చేశారన్న ఆరోపణలపై ఆయనపై కేసు నమోదు చేశారు. 

ఏప్రిల్ 26న బెయిల్‌ పిటిషన్‌ దాఖలు చేయగా బార్పేట చీఫ్ జ్యుడీషియల్ మేజిస్ట్రేట్ ముకుల్ చెతియా.. బెయిల్ నిరాకరించి ఐదు రోజుల పోలీసు కస్టడీకి పంపారు. మేవానీ ఏప్రిల్ 28న మరోసారి బెయిల్ పిటిషన్‌ను దాఖలు చేయగా, వాదనలు విన్న తర్వాత కోర్టు ఉత్తర్వులను రిజర్వ్ చేసింది. 29న బెయిల్‌ మంజూరు చేసింది. రూ. 1,000 వ్యక్తిగత బాండ్‌పై కోర్టు బెయిల్‌ ఇచ్చిందని మేవానీ తరపు న్యాయవాది అంగ్షుమన్ బోరా తెలిపారు. దీన్ని బట్టే ఇది అక్రమ కేసు అని అర్థమవుతోందన్నారు. 

మొదటి కేసుకు సంబంధించిన లాంఛనాలను పూర్తి చేయడానికి మేవానీని తిరిగి కొక్రాఝర్‌కు తీసుకెళ్లే అవకాశం ఉందని, ఆపై విడుదల చేస్తారని.. దీనికి ఒక రోజు పట్టవచ్చని బోరా చెప్పారు. బీజేపీ, ఆర్‌ఎస్‌ఎస్‌ కుట్రపూరితంగా తనను కేసుల్లో ఇరికించాయని మెవానీ అంతకుముందు ఆరోపించారు. కాగా, గుజరాత్‌ అసెంబ్లీ ఎన్నికల నేపథ్యంలో ప్రతిపక్షాల నోరు మూయించేందుకు అధికార బీజేపీ చేస్తున్న ప్రయత్నంగా మేవానీ అరెస్ట్‌ను విపక్షాలు పేర్కొంటున్నాయి. (క్లిక్: తీవ్ర వ్యాఖ్యల ఎఫెక్ట్‌.. బీజేపీకి దూరం కానున్నాడా?)

Poll
Loading...
మరిన్ని వార్తలు