నిందితుడి పూర్వాపరాలు విచారించాకే బెయిల్‌

13 Sep, 2021 04:14 IST|Sakshi

న్యాయస్థానాలకు సుప్రీంకోర్టు సూచన

న్యూఢిల్లీ: నిందితుడికి బెయిల్‌ మంజూరు చేసేటప్పుడు న్యాయస్థానాలు అతడి పూర్వాపరాలను సమగ్రంగా విచారించాలని సుప్రీంకోర్టు స్పష్టం చేసింది. అతడి నేర చరిత్రను పరిశీలించాలని సూచించింది. ఒకవేళ బెయిల్‌ ఇస్తే బయటకు వెళ్లాక తీవ్రమైన నేరాలకు పాల్పడే అవకాశం ఉందా? అనేది తెలుసుకోవాలని పేర్కొంది. హత్య, సాక్ష్యాధారాలను మాయం చేయడం వంటి కేసుల్లో నిందితుడైన ఇందర్‌ప్రీత్‌ సింగ్‌కు పంజాబ్‌ అండ్‌ హరియాణా హైకోర్టు బెయిల్‌ మంజూరు చేయడాన్ని సవాలు చేస్తూ దాఖలైన పిటిషన్‌పై జస్టిస్‌ డి.వై.చంద్రచూడ్, జస్టిస్‌ ఎం.ఆర్‌.షాల  ధర్మాసనం విచారణ చేపట్టింది. నిందితుడికి బెయిల్‌ ఇస్తూ పంజాబ్‌ అండ్‌ హరియాణా హైకోర్టు జారీ చేసిన ఉత్తర్వులను పక్కనపెట్టింది. పూర్వాపరాలు పూర్తిగా తెలుసుకున్న తర్వాతే బెయిల్‌పై నిర్ణయం తీసుకోవాలని కోర్టులకు సూచించింది. జరిగిన నేరం, లభించిన సాక్ష్యాధారాలు కూడా బెయిల్‌ను ప్రభావితం చేస్తాయని తెలిపింది. నేరం రుజువైతే విధించబోయే శిక్ష తీవ్రతను కూడా బెయిల్‌ విషయంలో పరిగణనలోకి తీసుకోవాలని పేర్కొంది. 

మరిన్ని వార్తలు