Balaknath: ఈ ‍మూడు కారణాలే బాబాను సీఎం రేసు నుంచి తప్పించాయా?

11 Dec, 2023 07:43 IST|Sakshi

రాజస్థాన్ ముఖ్యమంత్రి పదవి రేసు నుంచి బాబా బాలక్‌నాథ్ తప్పుకున్నారు. రాజస్థాన్‌ అసెంబ్లీ ఎన్నికలకు ముందు నుంచే బాబా బాలక్‌నాథ్‌ పేరు ముఖ్యమంత్రి పదవి రేసులో వినిపించింది. పార్టీ అంతర్గత సర్వేలో కూడా ఆయన ఆధిక్యత కనబరిచారు. ఎన్నికల్లో ఆయన గెలిచిన తర్వాత ఈ వాదన మరింత బలపడింది. పైగా బాబా బాలక్‌నాథ్‌.. బీజేపీ నేతలు అమిత్ షా, జేపీ నడ్డాలతో కూడా సమావేశం అయ్యారు. 

ఈ నేపధ్యంలో బాబా ముఖ్యమంత్రి అవుతారనే చర్చలు మరింత ఊపందుకున్నాయి. అయితే ఇప్పుడు ఆయన తాను ముఖ్యమంత్రి రేసులో లేనని ఒక ప్రకటన ద్వారా తెలియజేశారు.  అయితే బాబా సీఎం కాకపోవడానికి మూడు కారణాలను కీలకంగా ఉన్నాయని విశ్లేషకులు అంటున్నారు.

మొదటిది: బాబా బాలక్‌నాథ్ ఓబీసీ వర్గానికి చెందినవారు. రాజస్థాన్ పొరుగు రాష్ట్రమైన మధ్యప్రదేశ్‌లో సీఎం పదవికి బలమైన పోటీదారులుగా ఓబీసీ నేతలు ఉన్నారు. అటువంటి పరిస్థితిలో రాబోయే లోక్‌సభ ఎన్నికల దృష్ట్యా రెండు పొరుగు రాష్ట్రాలలో ఒకే సామాజికవర్గానికి చెందిన ముఖ్యమంత్రులను ఎంపిక చేసేందుకు బీజీపీ సుముఖంగా లేదని తెలుస్తోంది.

రెండవది: బాబా బాలక్‌నాథ్‌కు రాజకీయాలలో తగినంత అనుభవం లేదు. ఒక ప్రకటనలో ఆయన కూడా ఈ విషయాన్ని అంగీకరించారు. బాబా బాలక్‌నాథ్‌ ఇప్పటి వరకు ఒక్కసారి మాత్రమే ఎంపీ అయ్యారు. ప్రస్తుతం ఎమ్మెల్యేగా ఉన్నారు. ఈ కోణంలో చూస్తే బాబా రాజకీయ అనుభవం ఐదేళ్లు మాత్రమే. తగిన అనుభవం లేకపోవడంతోనే బాబా సీఎం కుర్చీ దూరమయ్యారనే మాట వినిపిస్తోంది.

మూడవది: రాజస్థాన్‌కు పొరుగు రాష్ట్రమైన ఉత్తరప్రదేశ్‌లో యోగి ఆదిత్యనాథ్ ముఖ్యమంత్రిగా ఉన్నారు. ఇలాంటి పరిస్థితుల్లో రాజస్థాన్‌లోనూ బాబా బాలక్‌నాథ్‌ను సీఎం చేస్తే బీజేపీపై హిందుత్వ ముద్ర మరింత బలమవుతుంది. అప్పడు అన్ని వర్గాలను అభివృద్ధి చేస్తామని చెబుతున్న బీజేపీ హామీకి విలువలేకుండా పోతుంది. అందుకే బాబాను సీఎం రేసు నుంచి బీజేపీ తప్పించిందని అంటున్నారు. 
ఇది కూడా చదవండి: మధ్యప్రదేశ్‌ సీఎం ఎవరు? రాజస్థాన్‌లో ఏం జరుగుతోంది?

>
మరిన్ని వార్తలు