బాలాకోట్‌ ఎయిర్‌ స్ట్రైక్‌‌: ‘కోతి ఖతమైంది’

26 Feb, 2021 11:48 IST|Sakshi

బాలాకోట్‌ వైమానిక దాడికి నేటితో రెండేళ్లు పూర్తి

ఆపరేషన్‌ పేరుతో సహా మరిన్ని వివరాలు వెలుగులోకి

న్యూఢిల్లీ: 1971లో జరిగిన ఇండో-పాక్‌ యుద్ధం తర్వాత భారతదేశం దాయాది పాకిస్తాన్‌పై చేసిన మొదటి వైమానకి దాడి బాలాకోట్‌ ఎయిర్‌ స్ట్రైక్. 40 మంది భారత సీఆర్‌పీఎఫ్‌ జవాన్లను పొట్టనబెట్టుకున్న పుల్వామా ఉగ్రదాడికి ప్రతీకారంగా భారత్‌ బాలకోట్‌లోని ఉగ్ర స్థావరంపై చేసిన దాడికి నేటితో రెండు సంవత్సరాలు పూర్తయ్యాయి. సరిగ్గా రెండేళ్ల క్రితం 2019, ఫిబ్రవరి 26న తెల్లవారుజామున 3.30 గంటలకు భారత మిరాజ్‌ 2000 ఫైటర్‌ జెట్స్‌ ఎల్‌ఓసీని దాటుకుని.. పాకిస్తాన్‌ బాలకోట్‌లోని జైషే మహ్మమద్‌ టెర్రర్‌ క్యాంప్‌పై దాడి చేశాయి. ఉరి, బాలాకోట్‌పై జరిగిన వైమానిక దాడులతో పాక్‌కు భారత సామార్థ్యం మరోసారి తెలిసి వచ్చింది. 

ఇక రెండు సంవత్సరాల క్రితం జరిగిన ఈ దాడికి సంబంధించి మరింత సమాచారం తాజాగా వెలుగులోకి వచ్చింది. నాటి ఎయిర్‌ స్ట్రైక్ ఆపరేషన్‌కు పెట్టిన పేరుతో పాటు నాడు ఓ క్షిపణి విఫలమయ్యిందనే వివరాలు వెలుగులోకి వచ్చాయి. నాటి ఆపరేషన్‌లో మన మిరాజ్‌ ఫైటర్‌ జెట్స్‌ని ఎదిరించేందుకు.. పాక్‌ తన ఎఫ్‌ 16 ఫైటర్‌ జెట్స్‌ని రంగంలోకి దింపింది. కాని ప్రయోజనం లేకపోయింది. ఈ దాడిలో ఐఏఎఫ్‌ మిరాజ్ 2000 యోధులు తమ స్పైస్ 2000 పెనెట్రేటర్ బాంబులను విడుదల చేశాయి. ఇవి ఒక్కొక్కటి 90 కిలోల పేలుడు పదార్థాలతో నిండి ఉంటాయి. సరిగ్గా పావుగంట తర్వాత అనగా 3.45 గంటలకు ఎయిర్‌ చీఫ్‌ బీఎస్‌ ధనోవా జాతీయ భద్రతా సలహాదారు అజిత్‌ దోవల్‌కి ఆపరేషన్‌ సక్సెస్‌ అయ్యిందనే సమాచారం ఇచ్చారు.

ప్రత్యేక ఆర్‌ఏఎక్స్‌ నంబర్‌ ద్వారా టెలిఫోన్‌ కాల్‌ చేసిన ధనోవా హిందీలో బందర్‌ మారా గయా(కోతి చంపబడింది) అని తెలిపారు. అంటే పాకిస్తాన్‌,‌ బాలకోట్‌లో ఉన్న ఉగ్రవాద సంస్థ జైషే మహ్మద్‌ టెర్రరిస్ట్‌ శిక్షణా క్యాంప్‌ని సరిహద్దు దాటి సాహసోపేతమైన ముందస్తు ఆపరేషన్‌లో భారత్‌ నాశనం చేసింది అని అర్థం. ఆర్‌ఏఎక్స్‌ అనేది అల్ట్రా-సేఫ్డ్ ఫిక్స్‌డ్-లైన్ నెట్‌వర్క్. అజిత్‌ దోవల్‌తో మాట్లాడిన అనంతరం ధనోవా అప్పటి రక్షణ శాఖ మంత్రి నిర్మలా సీతారామన్‌, రా సెక్రటరీ అనిల్‌ ధస్మానాకు తెలియజేశారు. ఆ తర్వాత దోవల్‌ ఈ విషయాన్ని ప్రధాని నరేంద్ర మోదీకి తెలిపారు. పాకిస్తాన్ ఇంటెలిజెన్స్‌ను గందరగోళపరిచేందుకు ‘బందర్’ అనే కోడ్ పేరును ఉద్దేశపూర్వకంగా ఎన్నుకున్నట్లు బాలకోట్ దాడిలో పాల్గొన్న ఉన్నతాధికారులు వెల్లడించారు. 

చదవండి: 
బాలాకోట్‌ దాడి: సంచలన విషయాలు వెల్లడి
పుల్వామా దాడిపై పాక్‌‌ సంచలన ప్రకటన

మరిన్ని వార్తలు