బంగ్లాదేశ్‌ నుంచి మోదీ, దీదీలకు 2,600 కేజీల మామిడి పళ్లు

5 Jul, 2021 19:40 IST|Sakshi

ప్రధాని మోదీకి, రాష్ట్రపతికి మామాడి పండ్లు పంపిన బంగ్లా ప్రధాని షేక్‌ హాసినా

న్యూఢిల్లీ: బంగ్లాదేశ్‌ ప్రధాన మంత్రి షేక్‌ హసీనా భారత రాష్ట్రపతి రామ్‌నాథ్‌ కోవింద్‌, ప్రధాని నరేమంద్ర మోదీ, పశ్చిమ బెంగాల్‌ ముఖ్యమంత్రి మమతా బెనర్జీలకు మామాడి పళ్లు పంపించారు. హరిభంగా రకానికి చెందిన సుమారు 2,600 కిలోగ్రాముల మామిడి పండ్లను పంపించారు. త్రిపుర ముఖ్యమంత్రి విప్లవ్‌ దేబ్‌కు కూడా ఈ మామిడి పళ్లలో వాటా ఉంది. మామిడిపండ్లు సోమవారం ఢిల్లీలోని బంగ్లాదేశ్ హైకమిషన్‌కు చేరుకోగా.. ఆ తర్వాత వాటిని విదేశాంగ మంత్రిత్వ శాఖకు పంపించారు. మామిడిపండ్లు ఆదివారం బెనపోల్ పెట్రోపోల్ ల్యాండ్ బార్డర్ ద్వారా కోల్‌కతాకు చేరుకోగా.. ఆ తరువాత రైలు ద్వారా ఢిల్లీకి రవాణా చేయబడ్డాయి.

ఈ సందర్భంగా బంగ్లాదేశ్ విదేశాంగ మంత్రి డాక్టర్ ఎ.కె. అబ్దుల్ మోమెన్ మాట్లాడుతూ, "మాకు చాలా తీపి, రుచికరమైన మామిడి పండ్లు ఉన్నాయి. మేము వాటిని పుష్కలంగా ఉత్పత్తి చేస్తాము. మేము మా ఆనందాన్ని మా మిత్రులతో పంచుకోవాలనుకుంటున్నాము. చారిత్రాత్మకమైన ముజిబ్ బోర్షోతో పాటు బంగ్లాదేశ్ స్వాతంత్ర్య స్వర్ణోత్సవ ఉత్సవాల సందర్భంగా రుచికరమైన మామిడి పండ్లను మా పొరుగువారు, స్నేహితులకు ఇచ్చి.. మా ఆనందాన్ని పంచుకోవాలనుకుంటున్నాము’’ అని తెలిపారు.

హరిభంగా మామిడి పళ్లను బంగ్లా వాయువ్య భాగంలో ఎక్కువగా సాగు చేస్తారు. ముఖ్యంగా రంగపూర్ జిల్లా వీటి సాగుకు ప్రధాన కేంద్రంగా ఉంది. గతంలో, పీఎం హసీనా ‘హిల్సా’ చేపలను పంపిన సంగతి తెలిసిందే. భారతదేశం-బంగ్లాదేశ్ మంచి సంబంధాలున్న సంగతి తెలిసిందే. భారత ప్రధాని మోదీ ఈ ఏడాది ప్రారంభంలో బంగ్లాదేశ్ స్వాతంత్ర్య స్వర్ణోత్సవ ఉత్సవాలతో పాటు బంగ్లా జాతిపిత బంగాబందు షేక్ ముజిబూర్ రెహ్మాన్ జయంతి శతాబ్ది ఉత్సవాల్లో భాగంగా దేశాన్ని సందర్శించారు. ఈ క్రమంలో ఇరు దేశాల మధ్య రవాణా, వాణిజ్యాన్ని పెంచడంపై రెండు దేశాలు దృష్టి సారించాయి. భారతదేశంతో పాటు, బంగ్లాదేశ్ భూటాన్‌కు మామిడి పండ్లను పంపింది. అలానే నేపాల్, శ్రీలంక, మాల్దీవులు, ఒమన్, సౌదీ అరేబియా, యుఎఇ, ఖతార్, బహ్రెయిన్, కువైట్, జోర్డాన్ దేశాధ్యక్షులు, ప్రధానులకు సరుకులను పంపుతుంది.
 

Read latest National News and Telugu News
Follow us on FaceBook, Twitter, Instagram, YouTube
తాజా సమాచారం కోసం      లోడ్ చేసుకోండి
మరిన్ని వార్తలు