జమ్ము ఉగ్రకాండ.. అమిత్‌ షా హైలెవెల్‌ మీటింగ్‌ ముందర మరొకటి

2 Jun, 2022 12:40 IST|Sakshi
అమిత్‌ షా.. పక్కన కుల్గాంలో నిరసన తెలియజేస్తున్న కశ్మీరీ పండిట్లు

శ్రీనగర్‌: జమ్ముకశ్మీర్‌లో  మైనార్టీలపై వరుస ఉగ్రదాడులు ఆందోళనకు గురి చేస్తున్నాయి. తాజాగా మరో హిందూ కమ్యూనిటీ వ్యక్తిని కాల్చిచంపారు ముష్కరులు. కుల్గాంలోని ఆరే మోహన్‌పురలో గురువారం ఉదయం ఈ ఘటన జరిగింది. కశ్మీర్‌ వరుస కాల్పుల ఘటనలపై కేంద్ర హోంశాఖ మంత్రి అమిత్‌ షా.. శుక్రవారం హైలెవెల్‌ మీటింగ్‌ నిర్వహించనున్నారు. అంతకంటే ముందే మరొ ఘటన జరగడం విశేషం.

మృతుడిని ఎలఖాహీ డెహతి బ్యాంక్‌ మేనేజర్‌ విజయ్‌కుమార్‌గా గుర్తించారు. ఆయన స్వస్థలం రాజస్థాన్ హనుమాన్‌గఢ్‌‌. రెండు రోజుల కిందట ప్రభుత్వ టీచర్‌ రజనీ బాలా(36) ముష్కరులు కాల్చి చంపిన సంగతి తెలిసిందే. అంతకు ముందు రాహుల్‌ భట్‌ మరణం.. నిరసనలతో పాటు రాజకీయంగానూ దుమారం రేపింది. ఈ మధ్యలో ఓ టీవీ ఆర్టిస్ట్‌ అమ్రీన్‌ భట్‌ కూడా దారుణ హత్యకు గురైంది.

ఇదిలా ఉంటే.. కశ్మీర్‌లో వరుసగా హిందువులపై ఉగ్రవాదులు విరుచుకుపడుతున్నారు. ఈ క్రమంలో వాళ్ల భద్రత విషయంలో తీవ్ర విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. హిందూ వర్గాల తరపున అక్కడి పార్టీలన్నీ కేంద్రాన్ని నిలదీస్తున్నాయి. మరోవైపు కశ్మీర్‌ పండిట్లు సైతం.. తమను బలవంతంగా తీసుకొచ్చి ఉగ్రవాదుల చేతిలో చంపిస్తున్నారంటూ కేంద్రంపై మండిపడుతున్నారు.

కశ్మీర్‌ పరిస్థితులపై కేంద్ర హోంశాఖ మంత్రి అమిత్‌ షా.. శుక్రవారం హైలెవెల్‌ మీటింగ్‌ నిర్వహించనున్నారు. అంతకంటే ముందే ఈ ఘటన జరగడం విశేషం.  ఈ భేటీలో షాతో పాటు కశ్మీర్‌ లెఫ్టినెంట్‌ గవర్నర్‌ మనోజ్‌ సిన్హా హాజరుకానున్నారు. కశ్మీర్‌లో వరుసగా జరుగుతున్న ఘటనలపై వివరణ ఇవ్వనున్నారు ఎల్జీ. కేంద్రం హోం కార్యదర్శి అజయ్‌ భల్లా, సీఆర్‌పీఎఫ్‌ డీజీ కుల్దీప్‌సింగ్‌, బీఎస్‌ఎఫ్‌ చీఫ్‌ పంకజ్‌ సింగ్‌.. ఈ భేటీకి హాజరయ్యే అవకాశాలు కనిపిస్తున్నాయి.
చదవండి: కశ్మీరీ పండిట్ల ఆవేదనే బీజేపీకి ఆయుధమా?

మరిన్ని వార్తలు