Bappi Lahiri Death: బప్పీలహరి మృతికి కారణం ఇదే.. సాధారణంలా అనిపించినా ఎంతో ప్రాణాంతకం కూడా!

16 Feb, 2022 20:14 IST|Sakshi

పాత‌‌ కొత్త తరం బాలీవుడ్​కే కాదు.. బప్పీలహరి పాటలు తెలుగునాట కృష్ణ, చిరు, బాలయ్య, మోహన్​బాబు లాంటి వాళ్లకు బ్లాక్ బస్టర్​ సాంగ్స్​తో కెరీర్ బూస్ట్​ ఇచ్చాయనడంలో ఎలాంటి సందేహం అక్కర్లేదు. అలాంటి మ్యూజిక్​ ఐకాన్​ అస్తమించడం భారత సినీ పరిశ్రమను, ఆయన పాటల అభిమానులను దిగ్భ్రాంతికి గురి చేస్తోంది. అయితే ఆయన హఠాన్మరణం వెనుక.. అబ్ స్ట్రక్టివ్ స్లీప్ అప్నియా (ఓఎస్ఏ) కారణమని వైద్యులు ప్రకటించారు. ఈ సమస్య కారణంగానే ఆయన గుండె ఆగిపోయింది కూడా!.

స్లీప్​ అప్నియా అనేది బ్రీతింగ్​ డిజార్డర్​(శ్వాస సంబంధిత వ్యాధి). నిద్రలో ఆగి ఆగి శ్వాస తీసుకోవడం దీని లక్షణం. ఇందులో మూడు రకాలు ఉంటాయి. అబ్ స్ట్రక్టివ్  స్లీప్​ అప్నియా, సెంట్రల్​ స్లీప్​ అప్నియా, కాంప్లెక్స్​ స్లీప్​ అప్నీయా. నిజానికి స్లీప్ ఆప్నియా చాలా సాధారణమైన డిసీజ్ అనుకుంటారు చాలామంది. కానీ, అదే సమయంలో ఇది ప్రాణాంతకమైంది కూడా. 

నిద్రిస్తున్న సమయంలో అప్పర్ ఎయిర్ వేస్ (శ్వాస తీసుకునే ఎగువ భాగంలో) బ్లాక్ కు గురి అవుతాయి. దీంతో గాలి తీసుకునే మార్గాన్ని మరింత వ్యాకోచింపచేసి, గాలిని ఊపిరితిత్తుల్లోకి పంపించేందుకు వీలుగా ఛాతీ కండరాలు బలంగా పనిచేస్తాయి. దీంతో పెద్ద జెర్కింగ్ చప్పుడుతో లేచి గాలి తీసుకుంటారు. ఈ సమస్య ఉన్న వారు చాలామందే ఉంటారు. పిల్లల దగ్గరి నుంచి వృద్ధుల దాకా.. ముఖ్యంగా ఓవర్​వెయిట్​ ఉన్నవాళ్లపై తీవ్ర ప్రభావం చూపెడుతుంది. 

సాధారణంగా.. గాలి నోరు, ముక్కు, ఊపిరితిత్తుల​ గుండా గాలి ప్రవాహం ఉంటుంది. అది నిద్రలో కూడా. శ్వాసనాళ కండరాలు మూసుకుపోవడం వల్ల ఓఎస్ఏ సమస్య ఏర్పడుతుంది. నిద్ర సమయంలో గొంతు భాగంలో సాఫ్ట్ టిష్యూ వ్యాకోచించడం వల్ల గాలి వెళ్లే మార్గానికి అడ్డుపడుతుంది. దీంతో శ్వాస నాళాల ఎగువభాగం అడ్డంకికి గురవుతుంది. గాలి సరిపడా అందకపోవడంతో లేచి గాలి తీసుకోవాలంటూ మెదడు అదే పనిగా సంకేతాలు అందిస్తుంది. దీంతో ఈ సమస్య ఉన్నవాళ్లు మంచి నిద్ర పోలేరు. ఇది దీర్ఘకాలంలో వారి గుండె ఆరోగ్యాన్ని దెబ్బతీస్తుంది.

లక్షణాలు

► పెద్ద శబ్దంతో గురక
► అలసటలేమితో పడుకున్నప్పుడు
 ఉలిక్కిపడి లేచి ఊపిరి పీల్చుకోవడం, ఉక్కిరి బిక్కిరి కావడం.
పగటి పూట ఎక్కువసేపు నిద్ర
నిద్రలో శ్వాసకు ఆటంకం
రాత్రిళ్లు చెమటలు పోయడం
పొద్దుపొద్దునే తలనొప్పులు
నిద్రలో పదేపదే మేల్కొనడం వల్ల మతిమరుపు, నిద్రమబ్బు, మాటిమాటికి ఇరిటేషన్​
పెద్దగా గురకపెట్టడం స్లీప్ అప్నియాకు సంకేతంగా చూడాలి.

రిస్క్​ ఫ్యాక్టర్స్
ఓవర్​ వెయిట్​ ఉన్నవాళ్లే ఎక్కువగా దీని బారినపడతారు.

వయసు మళ్లినవాళ్లు, షుగర్​ పేషెంట్ల మీదా ప్రభావం ఉంటుంది.

శ్వాసనాళాలు ఇరుక్కుగా ఉన్నవాళ్లకు ఈ డిజార్డర్ రావొచ్చు. టాన్సిల్స్​ వాపునకు గురి కావడం, అడినాయిడ్స్​ వాపు సమస్యలతో నాళాలు మూసుకుపోయేవాళ్లకు కూడా ఈ సమస్య ఎదురు కావొచ్చు. 

హైబీపీ పేషెంట్లు, ఎక్కువగా పొగ తాగే అలవాటు ఉన్నవాళ్లు సైతం స్లీప్ ఆప్నియా బారిన పడే అవకాశాలు ఎక్కువ. 

స్లీప్ అప్నియా​ కలిగించే సమస్యలనే అబ్​ స్ట్రక్టివ్​ స్లీప్​ అప్నియా కలిగిస్తుంది. చికిత్స, జాగ్రత్తలు తీసుకోకుంటే.. ప్రమాదం కూడా. అందుకే పగటి పూట ఎక్కువ నిద్ర పోకపోవడం మంచిది. ఆడవాళ్లలో ఈ సమస్య ఉంటే గనుక వెయిట్​లెస్​ పిల్లలు పుట్టే అవకాశం, ఇతర సమస్యలు ఎదురు కావొచ్చు. అంతేకాదు డ్రై ఐ, గ్లౌకోమా సమస్యలు రావొచ్చు.

ట్రీట్​మెంట్​ ఆప్షన్స్​
బరువు తగ్గించుకోవడం

సీపీఏపీ (CPAP) కంటిన్యూయస్​ పాజిటివ్​ ఎయిర్​వే ప్రెజర్​.. ఈ పరికరాన్ని వైద్యులు సూచించిస్తుంటారు. దీన్ని తలకు ధరించి పడుకుంటే శ్వాస నాళాల్లోకి పాజిటివ్ ప్రెజర్ ను పంపిస్తుంది. దాంతో అవి తెరచుకుంటాయి. దీనివల్ల గురక రాకుండా, శ్వాసకు ఇబ్బంది లేకుండా మంచిగా నిద్రపోవచ్చు. 

ఒక పక్కకు తిరిగి పడుకోవడం. బోర్లా పడుకోవడం ఓఎస్​ఏను మరింత దారుణంగా చేస్తుంది.

సర్జరీ.. అదీ అవసరమైతేనే. 

గమనిక.. పైన ఇచ్చిన సమాచారం.. సాధారణమైనది మాత్రమే. ఇలాంటి డిసీజ్ బారిన పడినప్పుడు, లక్షణాలు కనిపించినప్పుడు, ఓఎస్​ఏ పరిస్థితి​ ఎదురైనప్పుడు.. స్పెషలిస్టులను, ఫ్యామిలీ వైద్యులను సంప్రదించడం ఉత్తమం.
 
స్లీప్ అప్నియా బారినపడితే.. జీవిత కాలం 12-15 ఏళ్లపాటు తగ్గుతుందని పలు పరిశోధనలు వెల్లడించాయి. కనుక దీన్ని నిర్లక్ష్యం చేయకుండా చికిత్స తీసుకోవడం మంచిది.

మరిన్ని వార్తలు