2 Year Old Weighing 45 Kg: అతి చిన్నవయసులోనే అరుదైన సర్జరీ

4 Aug, 2021 08:14 IST|Sakshi

వయసు రెండేళ్లు, 45 కిలోల బరువు

బేరియాట్రిక్‌ సర్జరీ చేయించుకున్న అతి పిన్న వయస్కురాలు 

న్యూఢిల్లీ: ఆ పాప వయసు కేవలం రెండు సంవత్సరాలు. కానీ బరువు మాత్రం ఏకంగా 45 కేజీలు. సాధారణంగా, ఆ వయస్సు పిల్లల బరువు 12-15 కిలోలు. కానీ ఖ్యాతి వర్షిణి ఊబకాయంతో తీవ్రంగా బాధపడుతూ, అడుగులు వేయలేకపోయేది. సరిగ్గా పడుకోవడమూ కష్టమైపోయింది. దీంతో ఆ పాపకి ఒంట్లోంచి కొవ్వుని బయటకు తీసే అత్యంత క్లిష్టమైన బేరియాట్రిక్‌ సర్జరీ చేయాల్సి వచ్చింది. ఢిల్లీలోని పత్‌పర్‌గంజ్‌లోని మాక్స్‌ సూపర్‌ స్పెషాలిటీ ఆస్పత్రిలో వైద్యులు ఈ శస్త్ర చికిత్సని విజయవంతంగా పూర్తి చేశారు. బేరియాట్రిక్‌ సర్జరీతో ఆకలి మందగించి తీసుకునే ఆహారం తగ్గిపోతుంది. దీంతో బరువు కూడా తగ్గుతారు.

‘‘ఖ్యాతి వర్షిణి పుట్టినప్పుడు సాధారణంగానే రెండున్నర కేజీల బరువుంది.. కానీ ఆ తర్వాత చాలా త్వరగా బరువు పెరిగిపోయింది. 6 నెలలు వచ్చేసరికి 14 కేజీలు ఉన్న ఆ పాప రెండేళ్లకి 45 కేజీలకు చేరుకుంది. అధిక బరువు కారణంగా ఆరోగ్యం క్షీణిస్తుండడంతో రిస్క్‌ తీసుకొని సర్జరీ చేయాల్సి వచ్చింది’’అని పీడియాట్రిక్ ఎండోక్రినాలజీ కన్సల్టెంట్ మన్ ప్రీత్ సేథి వివరించారు. 

దేశంలో బరువు తగ్గించే శస్త్రచికిత్స చేయించుకున్న అతి పిన్నవయస్కురాలు ఖ్యాతియేనని వైద్యులు చెప్పారు. శస్త్రచికిత్స జరిగిన ఐదు రోజుల తర్వాత, ఖ్యాతి పరిస్థితి బాగా మెరుగు పడిందని, ప్రధాన లక్షణాలలో ఒకటైన  గురక పూర్తిగా ఆగిపోయిందని మత్తుమందు నిపుణుడు డాక్టర్ అరుణ్ పురి చెప్పారు. అలాగే ఊబకాయంతో బాధపడుతున్నఇతర పిల్లలకు భవిష్యత్తులో ఇలాంటి శస్త్రచికిత్సలు చేయడానికి  మార్గం మరింత సుగమమైందని  \చెప్పారు. 
 

మరిన్ని వార్తలు