Karnataka Politics: ఇంజనీరు రిపేర్‌ చేస్తాడా? 

28 Jul, 2021 01:59 IST|Sakshi

రాజకీయ ఉద్దండుడిగా పేరొందిన యెడ్డీనే స్థానిక బీజేపీ నేతలు ఇబ్బంది పెట్టగా, సౌమ్యుడిగా పేరున్న బొమ్మై వీరితో ఎలా నెగ్గుకొస్తారన్నది ఆసక్తికరంగా మారింది. యెడ్డీ ఆశీస్సులతో పాటు, పార్టీ లో సీనియర్‌ నేతల మద్దతుందని బొమ్మై చెప్పారు. గతంలో సదానంద గౌడను యెడ్డీ మద్దతుతోనే సీఎం చేశారు. కానీ హైకమాండ్‌ ఆశించినట్లు గౌడ రాణించలేకపోయారు. సీఎంగా దిగినంత మాత్రాన యెడ్డీ ఊరికే ఉండరు. రాజకీయాల్లో యాక్టివ్‌గానే ఉండే సంకేతాలు కనిపిస్తున్నాయి. ఆయన కుమారులు సైతం బీజేపీలోనే కొనసాగుతారు. వీరిలో రాష్ట్ర బీజేపీ ఉపాధ్యక్షుడు విజయేంద్రను సూపర్‌ సీఎంగా పిలిచేవారు.

తండ్రి సీఎంగా దిగిపోయినా, విజయేంద్ర హవా కొనసాగించే యత్నాలు సాగించవచ్చు. యెడ్డీని వ్యతిరేకించిన ఎమ్మెల్యేలు అరవింద్‌ బెల్లాద్, బసన్న గౌడ పాటిల్‌ ఎంతవరకు బొమ్మైకి సహకరిస్తారో తెలీదు. అరవింద్‌.. యెడ్డీ స్థానంలో సీఎం కావాలని ఆశించారు. కానీ అధిష్టానం బొమ్మైను ఎంచుకుంది. వీరితో పాటు సీఎం పోస్టు ఆశించిన పలువురు ఆశావహులను బుజ్జగించుకుంటూ రాబోయే ఎన్నికల్లో పార్టీని తిరిగి గెలిపించాల్సిన బాధ్యత బొమ్మైపై ఉంది. ఈ మెకానికల్‌ ఇంజనీరు యెడ్డీ వర్గాన్ని, అసమ్మతి వర్గాన్ని సముదాయించుకుంటూ సొంత పార్టీని గెలుపు తీరాలకు చేరుస్తారో, లేదో వేచిచూడాల్సిందే!     –నేషనల్‌ డెస్క్, సాక్షి 

50%కి పైగా 2 ఏళ్ల లోపే... 
కర్ణాటక సీఎంలుగా పనిచేసిన వారిలో 50 శాతానికి పైగా రెండేళ్లలోపే పదవిలో ఉన్నారు. బుధవారం సీఎంగా ప్రమాణ స్వీకారం చేయబోతున్న బసవరాజ బొమ్మైకి మరో 19 నెలల పదవీకాలం మాత్రమే మిగిలి ఉంది. 2023 మేలోపు కర్ణాటక అసెంబ్లీకి తదుపరి ఎన్నికలు జరగనున్నాయి. కన్నడనాట సీఎంల పదవీకాలం వివరాలిలా ఉన్నాయి. 

పదవీకాలం    సీఎంలు 
0–1 ఏళ్లు      9 మంది 
1–2              7 
2–3              6 
3–4              3 
4–5              3 
5+                3  

మరిన్ని వార్తలు