5జీకి మారాలనుకుంటున్నారా? ఆ లింక్‌ను క్లిక్‌ చేశారంటే అంతే..

13 Oct, 2022 20:25 IST|Sakshi

హలో మీరు 5జీకి మారాలనుకుంటున్నారా?, లింక్‌ను క్లిక్‌ చేయండి అంటారు. లేదా మీ 5జీ నంబర్‌ను బ్యాంకు ఖాతాకి లింక్‌ చేయాలి, ఓటీపీ చెప్పండి ప్లీజ్‌ అని అడిగితే అది మోసగాళ్ల పనేనని తెలుసుకోండి. 5జీ పేరుతో అప్పుడే సైబర్‌ నేరగాళ్లు సొమ్ము కాజేసే ప్రయత్నాలు ప్రారంభించారు.

  దేశంలో 5 జీ మొబైల్‌ సేవలు ప్రారంభమైన నేపథ్యంలో సైబర్‌ కేటుగాళ్లు అప్పుడే రంగంలోకి దిగారు. మీ నెట్‌వర్క్‌ను అప్‌డేట్‌ చేసుకోండి అని వంచనకు పాల్పడే అవకాశం ఉంది, ప్రజలు అప్రమత్తంగా ఉండాలని పోలీసులు తెలిపారు. ఇప్పటికే బెంగళూరు తో పాటు దేశవ్యాప్తంగా ఎంపికచేసిన కొన్ని నగరాల్లో ప్రయోగాత్మకంగా 5 జీ నెట్‌వర్క్‌ సేవలు ప్రారంభం కావడం తెలిసిందే. ప్రజలు 4 జీ నుంచి 5జీ కి అప్‌డేట్‌ కోసం వేచి చూస్తున్నారు. ఈ నేపథ్యంలో పోలీసులు అన్ని జిల్లాల్లో సైబర్‌ మోసాల పట్ల జాగృతం చేస్తున్నారు. జిల్లాకేంద్రాల్లో కరపత్రాలు ముద్రించి సార్వజనిక స్థలాల్లో పంచుతున్నారు.  

లింక్‌ ఓపెన్‌ చేయరాదు  
మొబైల్‌ 5 జీ నెట్‌వర్క్‌కు, బ్యాంక్‌ అకౌంట్‌ కు ఎలాంటి సంబంధం ఉండదు. సైబర్‌ వంచకులు బ్యాంకు ప్రతినిధుల ముసుగులో ఫోన్‌ చేసి  మీ బ్యాంక్‌ అకౌంట్‌కు లింక్‌ అయిన మొబైల్‌ నంబరును 5 జీ నెట్‌వర్క్‌ కు అప్‌డేట్‌ చేస్తామంటారు. నమ్మి వారు చెప్పినట్లు చేస్తే చిక్కుల్లో పడతారని పోలీసులు హెచ్చరించారు. లింక్‌ పంపించి క్లిక్‌ చేయమంటే స్పందించరాదు. 
చదవండి: పులితో ఆటలా? అని అనకండి.. ముద్దులాటలు కూడా..! వైరల్‌ వీడియో

నమ్మితే అంతే 
సైబర్‌ వంచకులు ఎయిర్‌టెల్, జియోతో పాటు ఇతర మొబైల్‌ నెట్‌వర్క్‌ కంపెనీల కాల్‌సెంటర్ల పేరుతో ఫోన్‌ చేస్తారు. సిమ్‌కార్డును 5 జీ కి అప్‌డేట్‌ చేస్తామని, ఓటీపీ ని చెప్పాలని నమ్మిస్తారు. ఓటీపీ చెప్పారో.. బ్యాంకు ఖాతాలో నగదు మాయం చేస్తారు. ఇటువంటి కాల్స్‌ను అస్సలు నమ్మరాదని పోలీసులు తెలిపారు. ఇటీవల వస్తున్న మొబైల్‌ స్మార్ట్‌ ఫోన్లు 5 జీ నెట్‌వర్క్‌ కు సపోర్ట్‌  చేస్తాయి. కానీ పాత మొబైల్స్‌ 4జీ నెట్‌వర్క్‌కు మాత్రమే సరిపోతాయి. ఈ నేపథ్యంలో సైబర్‌ వంచకులు, 4 జీ మొబైల్స్‌ను 5జీ కి అప్‌డేట్‌ చేస్తామని కాల్స్‌ చేయడం మొదలైంది. వాట్సాప్‌ మెసేజ్, లింక్‌లు పంపుతారు. వాస్తవంగా 4జి మొబైల్స్‌ని 5జీ కి అప్‌డేట్‌ చేయడం సాధ్యం కాదు.  

మరిన్ని వార్తలు