మన ఆటోవాలా నిజాయితీకి ఫారినర్‌ ఫిదా.. మనసిచ్చి మరీ మనువాడింది

25 Nov, 2022 18:45 IST|Sakshi

అతనొక ఆటోడ్రైవర్‌. అయినా ఆమె అతన్ని అర్థం చేసుకుని ఇష్టపడింది.  అతని నిజాయితీ ఆమెను బాగా ఆకర్షించింది. స్వదేశీ-విదేశీ అభ్యంతరాలు, ఆస్తిపాస్తుల అంతరాల్ని పక్కన పెట్టింది.  మనసులో మాట బయటపెట్టి.. అతన్ని ఒప్పించింది. ఐదేళ్లుగా వాళ్ల ప్రేమ ప్రయాణం సాగింది. డేటింగ్‌ పేరుతో ఎక్కడ మోసం చేస్తుందేమోనని ఆ కుర్రాడి కుటుంబం కంగారు పడింది. దేశం కానీ దేశం నుంచి అల్లుడు అనేసరికి ఆమె తల్లిదండ్రులు ఆలోచనలో పడ్డారు.  కానీ, వాళ్ల ప్రేమ కొనసాగింది. చివరికి.. మనసైన వాడిని అతని సంప్రదాయ పద్ధతుల్లోనే వివాహం ఆడింది. 

బెల్జియంకు చెందిన కెమిల్‌ తన కుటుంబం పాటు ఐదేళ్ల కిందట కర్ణాటక విజయనగర జిల్లా హంపికి టూర్‌ మీద వచ్చింది. ఆ సమయంలో హంపి జనతా ప్లాట్‌కు చెందిన ఆటోడ్రైవర్‌ అయిన అనంతరాజుతో పరిచయం ఏర్పడింది. ఇక్కడ ఉన్నన్నిరోజులు వాళ్ల గైడ్‌గా ఉన్నాడు రాజు. ఎక్కడా మోసం చేయకుండా ప్రయాణికులతో, విదేశీయులతో అతను వ్యవహరించిన తీరు, నిజాయితీ ఆమెను విపరీతంగా ఆకర్షించాయి.  

పైగా తనకు వచ్చే సంపాదనలో అతను కొంత దానం చేస్తున్నాడని తెలిసి.. ఆ మంచి మనసును ఇష్టపడిందామె. ఈ క్రమంలో అతన్ని ప్రేమిస్తున్నట్లు తన ఇంట్లో వాళ్లకు చెప్పింది. మొదట ఆలోచనలో పడ్డా.. కూతురి సంతోషం కోసం వాళ్లు అంగీకరించారు. పెద్దల సమక్షంలోనే ఆమె అతనికి ప్రపోజ్‌ చేసింది. తన ఇంట్లో వాళ్లను అడిగి.. ఆమె ప్రేమకు అంగీకారం తెలిపాడతను. అలా..

వాళ్ల ప్రేమ.. పెద్లల సమక్షంలోనే పెరిగి పెద్దైంది. అయితే.. కరోనా సమయంలో వాళ్ల వివాహం జరగాల్సి ఉంది. బెల్జియంలో గ్రాండ్‌గా పెళ్లి ప్లాన్‌ చేశారు ఆమె తల్లిదండ్రులు. ఈలోపు.. కరోనా పరిణామాలతో ఆ పెళ్లి వాయిదా పడింది. దీంతో ఇరు కుటుంబాల్లో ఆందోళన నెలకొంది. కెమిల్‌ బెల్జియంలో సామాజిక వేత్త.  ఈ గ్యాప్‌లో వాళ్ల బంధం మరింత బలపడింది. ఆమెకు మరో వ్యక్తితో వివాహం చేయాలని ప్రయత్నాలు మొదలయ్యాయి. ఎలాగైనా రాజునే పెళ్లి చేసుకుంటానని భీష్మించుకుని కూర్చుంది. చివరికి వాళ్ల ఇంట్లో వాళ్లు.. రాజు తల్లిదండ్రులతో మరోసారి పెళ్లి సంప్రదింపులు మొదలుపెట్టారు. 

చివరికి.. భారత్‌లోనే పెళ్లి బాజాలు మొగాయి. ఇవాళ(శుక్రవారం 25-11-2022) హంపీ విరూపాక్షేశ్వర ఆలయంలో పెద్దలు, బంధు మిత్రుల నడుమ ఘనంగా వివాహం జరిగింది.  హంపీకి చెందిన అంజీనప్ప కుమారుడు అనంతరాజుకి, బెల్జియంకు చెందిన జీప్‌ పిలిఫ్‌ మూడవ కుమార్తె కెమిల్‌ ఏడగుడులతో ఒక్కటవ్వడం స్థానికంగా ఆకట్టుకుంది. 

మరిన్ని వార్తలు