బీజేపీకి బిగ్‌ షాక్‌.. ఎంపీ ఔట్‌

22 May, 2022 19:52 IST|Sakshi

పశ్చిమ బెంగాల్‌లో బీజేపీ, అధికార టీఎంసీ మధ్య ఇప్పటికే ఘర్షణ వాతావరణమే కొనసాగుతోంది. ఈ క్రమంలో బీజేపీకి భారీ షాక్‌ తగిలింది. బీజేపీకి చెందిన ఎంపీ అర్జున్‌ సింగ్‌ కమలం పార్టీకి రాజీనామా చేశారు. అనంతరం తన సొంత పార్టీ అయిన అధికార తృణముల్‌ కాంగ్రెస్‌లో చేరారు.

వివరాల ప్రకారం..  బైర‌క్‌పూర్ ఎంపీ అర్జున్‌ సింగ్‌ ఆదివారం టీఎంసీలో చేరారు. కాగా,  2019 సార్వ‌త్రిక ఎన్నికల స‌మ‌యంలో ఆయ‌న తృణ‌మూల్‌ను వీడి, బీజేపీ తీర్థం పుచ్చుకున్నారు. దీంతో బీజేపీ ఆయ‌న‌కు బైర‌క్‌పూర్ నుంచి ఎంపీ స్థానం నుంచి బ‌రిలోకి దింపింది. ఆ ఎన్నికల్లో ఆయన బీజేపీ తరఫున విజయం సాధించారు. ఇదిలా ఉండగా.. కొన్ని రోజులుగా ఆయ‌న బీజేపీపై తీవ్ర అసంతృప్తితో ఉన్నారు. ఈ అసంతృప్తితోనే బీజేపీకి వ్య‌తిరేకంగా ట్వీట్లు చేస్తున్నారు. త‌న‌కు పార్టీలో తగిన గుర్తింపు ఇవ్వడంలేదని, ఇమ‌డ‌నీయ‌డం లేద‌ని ఆగ్రహం వ్యక్తం చేశారు.

ఇక, తీవ్ర అసంతృప్తితో ఆదివారం బీజేపీకి గుడ్‌ బై చెప్పి.. సొంత పార్టీ గూటికి చేరారు. మూడు సంవత్సరాల తర్వాత అర్జున్‌ సింగ్‌ టీఎంసీలో చేరారు. ఈ క్రమంలో తృణ‌మూల్ అగ్ర‌నేత అభిషేక్ బెన‌ర్జీ ఎంపీ అర్జున్ సింగ్‌కి పార్టీ కండువా క‌ప్పి, సాద‌రంగా టీఎంసీలోకి ఆహ్వానించారు. కాగా, అర్జున్ సింగ్ 2001లో టీఎంసీ త‌ర‌పున ఎమ్మెల్యేగా గెలుపొందారు.

ఇది కూడా చదవండి: ఒకే వేదికపై ముగ్గురు సీఎంలు

మరిన్ని వార్తలు