బెంగాల్‌ కేబినెట్‌ మంత్రి ఆకస్మిక మృతి.. మమతా బెనర్జీ దిగ్భ్రాంతి

29 Dec, 2022 15:38 IST|Sakshi

కోల్‌కతా: పశ్చిమ బెంగాల్‌ అధికార పార్టీ తృణమూల్‌ కాంగ్రెస్‌ సీనియర్‌ నేత, కేబినెట్‌ మంత్రి సుబ్రతా సాహా కన్నుమూశారు. ముర్షిదాబాద్‌ మెడికల్‌ కాళాశాలలో గురువారం ఉదయం 10.40 గంటల ప్రాంతంలో ఆయన మృతి చెందినట్లు ఆసుపత్రి వర్గాలు తెలిపాయి. బుధవారం రాత్రి ఆకస్మికంగా అనారోగ్యానికి గురైన మంత్రిని ఆసుపత్రికి తరలించగా కొన్ని గంటల్లోనే ప్రాణాలు కోల్పోయారు. కేబినెట్‌ మంత్రి సుబ్రతా సాహా మృతి ముఖ్యమంత్రి మమతా బెనర్జీకి తీరని లోటుగా పార్టీ వర్గాలు తెలిపాయి. 

సుబ్రతా సాహా ప్రస్తుతం ఫుడ్‌ ప్రాసెసింగ్‌ మంత్రిత్వ శాఖ సహాయ మంత్రిగా పని చేస్తున్నారు. ముర్షిదాబాద్‌లోని సగర్దిఘి నియోజకవర్గ ఎమ్మెల్యేగా వరుసగా మూడు సార్లు గెలుపొందారు. 69 ఏళ్ల సాహాకు ఇటీవలే పిత్తాశయ ఆపరేషన్‌ జరిగింది. అనారోగ్యం నుంచి కోలుకును బుధవారం ఉదయమే సొంత జిల్లాకు తిరిగివచ్చారు మంత్రి. కానీ, రాత్రి ఒక్కసారిగా కుప్పకూలిపోయారు. దీంతో హుటాహుటిన బెర్హంపోర్‌లోని ముర్షిదాబాద్‌ మెడికల్‌ కలేజీలో చేర్పించారు. గురువారం ఉదయం మరణించారు. 

మమత బెనర్జీ దిగ్భ్రాంతి..
మంత్రి సుబ్రతా సాహా ఆకస్మిక మరణంపై దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు ముఖ్యమంత్రి మమతా బెనర్జీ. ‘సుబ్రతాబాబుతో దీర్ఘకాలంగా మంచి సంబంధాలు ఉన్నాయి. ఆయన రాజకీయ, సామాజిక సేవలు గుర్తుండిపోతాయి. సుబ్రతా సాహా మృతితో రాజకీయ ప్రపంచంలో లోటు ఏర్పడింది. ఆయన కుటుంబానికి నా ప్రగాఢ సానుభూతి’ అని సామాజిక మాద్యమాల్లో రాసుకొచ్చారు దీదీ. 

ముర్షిదాబాద్‌ జిల్లా నుంటి 2011లో టీఎంసీ తరఫున గెలిచిన ఏకైక ఎమ్మెల్యేగా నిలిచారు సుబ్రతా సాహా. సగర్డిఘి నియోజకవర్గం నుంచి వరుసగా మూడుసార్లు విజయం సాధించారు. తొలిసారి కాంగ్రెస్‌ తరపున గెలిచారు. ఆ తర్వాత టీఎంసీలో చేరారు.

ఇదీ చదవండి: మమతా బెనర్జీకి ఎదురుదెబ్బ.. టీఎంసీ సీనియర్‌ నేత రాజీనామా!

మరిన్ని వార్తలు