సీఎం మమతాపై గవర్నర్‌ అసంతృప్తి

16 Aug, 2020 15:02 IST|Sakshi

కోల్‌కతా: స్వాతంత్ర్య వేడుకుల సందర్భంగా రాజ్‌భవన్‌లో గవర్నర్‌ జగదీప్ ధంఖర్‌ నిర్వహించిన తేనీటి విందుకు రాష్ట్ర ముఖ్యమంత్రి మమతా బెనర్జీ హాజరుకాలేదు. కార్యక్రమానికి సంబంధించి ముందుగా సమాచారం అందిచినా  సీఎం మమతా బెనర్జీ, ప్రభుత్వ అధికారులు గైర్హజరు కావటం తనకు ఆశ్చర్యం కలిగించిందని అన్నారు. శనివారం ఉదయం కోల్‌కతాలోని రెడ్‌రోడ్‌లో జాతీయ జెండాను ఎగురవేసిన అనంతరం గవర్నర్‌ సీఎం మమతా బెనర్జీ, ప్రభుత్వ అధికారులను రాజ్‌భవన్‌లో జరిగే ‘ఎట్‌ హోం’ కార్యక్రమానికి ఆహ్వానించారు. అయితే ఈ కార్యక్రమానికి సీఎం మమతా హాజరు కాలేదు. దీంతో సీఎం లేకుండానే గవర్నర్‌ దంపతులు కార్యక్రమంలో పాల్గొన్నారు. దీంతో గవర్నర్‌ పక్కన ఏర్పాటు చేసిన కుర్చి ఖాళీగా కనిపించింది. (ప్రజాస్వామ్యానికి పరీక్షా సమయం)

ప్రస్తుతం గవర్నర్‌ నిర్వహించిన ఈ కార్యక్రమంలో మమతా పాల్గొనకపోవటం చర్చనీయంశంగా మారింది. ‘రాజ్‌భవన్‌లో స్వాతంత్ర్య వేడుకుల సందర్భంగా ఏర్పాటు చేసిన కార్యక్రమంలో సీఎం మమతా బెనర్జీ హాజరు కాకపోవడం నాకు చాలా ఆశ్చర్యం కలిగించింది. మనకు స్వేచ్ఛ, ప్రజాస్వామ్యం, భద్రత కల్పించిన స్వాతంత్ర్య సమరయోధులను గుర్తు చేసుకోవటంలో మనం మరింత ఎదగాలి’ అని ఆయన ట్విటర్‌లో అసంతృప్తి వ్యక్తం చేశారు. ఇటువంటి పరిస్థితి పశ్చిమ బెంగాల్‌కు ఉన్న గొప్ప సంస్కృతి, నీతిని పలుచన చేస్తుందన్నారు. ఇది ఒక అనాలోచితన ధోరణి అని ట్వీట్ చేశారు.‌ ఇక కరోనా వైరస్‌ వ్యాప్తి చెందుతున్న సమయంలో గవర్నర్‌ నిర్వహించే ఎట్‌ హోం కార్యక్రమం సరికాదని ప్రభుత్వం భావించినట్లు తెలుస్తోంది. (రాష్ట్రపతి భవన్‌లో ఎట్ హోం కార్యక్రమం)

>
మరిన్ని వార్తలు