పెట్రో నిరసన; 38 కి.మీ సైకిల్‌ తొక్కిన మంత్రి

8 Jul, 2021 08:25 IST|Sakshi

కోల్‌కతా: పెట్రోల్‌ ధర కోల్‌కతాలో రూ.100 మార్కును చేరినందుకు నిరసనగా పశ్చిమబెంగాల్‌ రాష్ట్ర మంత్రి ఒకరు 38 కిలోమీటర్ల దూరం సైకిల్‌ తొక్కారు. కార్మిక శాఖ మంత్రి బేచారాం మన్నా హుగ్లీలోని తన నివాసం నుంచి బుధవారం ఉదయం 8 గంటలకు సైకిల్‌పై బయలు దేరి, మధ్యాహ్నం 12.30గంటలకు కోల్‌కతాలోని అసెంబ్లీ భవనం వద్దకు చేరుకున్నారు. ఆయన వెంట కొందరు పార్టీ కార్యకర్తలు కూడా ఉన్నారు.

ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. ‘కేంద్రంలోని మోదీ ప్రభుత్వ వైఫల్యాల్లో పెట్రో ధరలు పెరగడం కూడా ఒకటి. కోల్‌కతాలో లీటరు పెట్రోల్‌ ధర రూ.100కు చేరుకుంది. దీనిపై మేం నిరసన తెలిపాం’ అని తెలిపారు. సింగూర్‌ నుంచి టీఎంసీ తరఫున ఎమ్మెల్యే అయిన మన్నా..టాటా నానో ఫ్యాక్టరీకి వ్యతిరేకంగా 2000వ సంవత్సరం లో చేపట్టిన నిరసనలతో వార్తల్లోకెక్కారు.

మరిన్ని వార్తలు