‘నన్ను కొట్టారు.. నా దుస్తులు చించేశారు’

22 Jun, 2021 12:29 IST|Sakshi

ఫలితాల అనంతరం బెంగాల్‌లో హింసాత్మక ఘటనలు

జనాలపై దాడులు చేసిన టీఎంసీ కార్యకర్తలు

కోల్‌కతా: పశ్చిమ బెంగాల్‌లో అసెంబ్లీ ఎన్నికల ఫలితాల తర్వాత హింసాత్మక ఘటనలు చెలరేగిన సంగతి తెలిసిందే. కోల్‌కతా హైకోర్టు ఆదేశాల మేరకు ఈ కేసును మానవహక్కుల కమిషన్‌ విచారిస్తుంది. ఈ క్రమంలో ఫలితాల అనంతరం జరిగిన దాడుల్లో టీఎంసీ కార్యకర్తలు తమను ఎలా చిత్రహింసలకు గురి చేశారో బాధితులు ఇండియాటుడేకి వెల్లడించారు. ఫలితాల అనంతరం టీఎంసీ కార్యకర్తలు తమ ఇళ్లు, దుకాణాల మీద పడి దాడి చేశారని.. విచక్షణా రహితంగా కొట్టారని తెలిపారు. వారికి భయపడి చాలామంది ఇప్పటికి ఇళ్లకు రావడం లేదన్నారు. 

రాఖీ రావంత్‌ అనే మహిళ మాట్లాడుతూ.. ‘‘మే 2 ఆదివారం నాడు ఫలితాలు వెల్లడైన అనంతరం టీఎంసీ కార్యకర్తలు మా ఇంటి మీద దాడి చేశారు. నన్ను, నా కుటుంబ సభ్యులను చితకబాది.. నా బట్టలు చించేశారు. అంతటితో ఆగక నన్ను అసభ్యకరంగా తాకుతూ.. తెల్లవారేసరికి ఊరు విడిచి వెళ్లాలని.. లేదంటే అదే మాకు చివరి రాత్రని హెచ్చరించారు. సోమవారం ఉదయం మరోసారి వచ్చి నా పిల్లల్ని కొట్టారు. ఊరు విడిచి పోకపోతే నా భర్తను చంపుతామని బెదిరించారు. వారి భయంతో మేం వేరే గ్రామానికి వెళ్లాం. ఆ తర్వాత పోలీసులు సెక్యూరిటీ కల్పించడంతో తిరిగి మా ఇంటికి వచ్చాం’’ అని తెలిపింది. 

మరో బాధితురాలు మాముని సాహా అనే మహిళ మాట్లాడుతూ.. ‘‘ఎన్నికలకు ముందు మార్చిలో టీఎంసీ కార్యకర్తలు 10 కేజీల చికెన్‌ కొట్టాల్సిందిగా ఆదేశించారు. డబ్బులు అడిగితే లేవన్నారు. దాంతో మేం చికెన్‌ ఇవ్వలేదు. దాన్ని మనసులో పెట్టుకుని ఫలితాల తర్వాత మా ఇంటి మీద దాడి చేశారు. కోళ్లఫారానికి విద్యుత్‌ సరఫరా నిలిపి వేశారు. మా ఇంటి ముందు బారికేడ్లు పెట్టి మమ్మల్ని ఇబ్బందులకు గురి చేశారు. నన్ను నా భర్తను కొట్టారు’’ అని తెలిపింది. 

బెంగాల్‌లో అసెంబ్లీ ఎన్నికల తర్వాత చెలరేగిన హింసాత్మక ఘటన కేసులను జాతీయ మానవ హక్కుల కమిషన్‌ (ఎన్‌హెచ్‌ఆర్‌సీ) విచారించాలంటూ కలకత్తా హైకోర్టు జారీచేసిన ఉత్తర్వులపై కోర్టుకెళ్లిన మమత సర్కార్‌కు కోర్టులో చుక్కెదురైన సంగతి తెలిసిందే. ఈ ఉత్తర్వులను వెనక్కి తీసుకోవాలని బెంగాల్‌ ప్రభుత్వం వేసిన పిటిషన్‌ను కలకత్తా హైకోర్టు సోమవారం తిరస్కరించింది. ఘర్షణ సంబంధ కేసుల్ని విచారించాలని ఎన్‌హెచ్‌ఆర్‌సీని హైకోర్టు గతంలో ఆదేశించింది. ఈ ఆదేశాలను రీకాల్‌ చేయాలంటూ బెంగాల్‌ ప్రభుత్వం కోరగా అందుకు కోర్టు నో చెప్పింది. 

చదవండి: దీదీ పిటిషన్‌పై విచారణ వాయిదా

>
మరిన్ని వార్తలు