రైలు ఎక్కుతూ కాలు జారిన మహిళ.. కాపాడిన కానిస్టేబుల్‌!

1 Dec, 2023 07:07 IST|Sakshi

పశ్చిమ బెంగాల్‌లోని హౌరాలో రైలు ఎక్కేందుకు ప్రయత్నిస్తూ జారి పడిపోయిన ఓ మహిళను రైల్వే కానిస్టేబుల్ కాపాడిన ఉదంతం వెలుగు చూసింది. ఈ ఘటన హౌరా స్టేషన్ ఓల్డ్ కాంప్లెక్స్ స్టేషన్‌లోని సీసీటీవీ కెమెరాలో రికార్డయ్యింది. 

మీడియాకు అందిన సమాచారం ప్రకారం బుధవారం ఉదయం 10.50 గంటలకు 40 ఏళ్ల ఫాతిమా ఖాతూన్ తన బంధువుతో పాటు హౌరా-తారకేశ్వర్ లోకల్ ఎక్కేందుకు వచ్చారు. వీరిద్దరూ పరిగెత్తుకుంటూ వెళ్లి రైలు ఎక్కేందుకు ప్రయత్నించారు. ఆ సమయంలో జరిగిన తోపులాటలో ఫాతిమా  బ్యాలెన్స్ తప్పి ప్లాట్‌ఫారమ్‌పై పడిపోయింది. ఇంతలో రైలు వేగం పెరగడంతో ఆమె రైలు పట్టాలకు ప్లాట్‌ఫారమ్‌కు మధ్య ఇరుక్కుపోయింది. అయితే ఆమె బంధువు ఆమెను రైలు కిందకు జారిపోకుండా పైకి లాగడానికి ప్రయత్నించారు. 

దీనిని గమనించిన అక్కడే ఉన్న రైల్వే హెడ్ కానిస్టేబుల్ ఎల్‌కే బౌరీ వెంటనే ఫాతిమా వద్దకు పరిగెత్తారు. ఆమె చేయి పట్టుకుని పైకిలాగి ఆమె ప్రాణాలను కాపాడారు. సీసీటీవీ ఫుటేజీలో.. ప్లాట్‌ఫారమ్‌పై ఉన్న పలువురు ప్రయాణికులు ఫాతిమాను రక్షించేందుకు ప్రయత్నించడాన్ని గమనించవచ్చు. పలువురు పోలీసులు కూడా ఆమెకు సహాయం చేసేందుకు పరుగులు తీశారు. ఈ ఘటనలో పోలీసుల చొరవను తూర్పు రైల్వే ప్రశంసించింది. 
ఇది కూడా చదవండి: రసాయనాల ఫ్యాక్టరీలో ఘోర అగ్ని ప్రమాదం
 

మరిన్ని వార్తలు