Bengaluru: గూగుల్‌తో ట్రాఫిక్‌ కష్టాలకు చెక్‌.. సిగ్నల్స్‌ వద్ద వెయిటింగ్‌ ఉండదటా!

28 Jul, 2022 12:19 IST|Sakshi

బెంగళూరు: పెరిగిపోతున్న జనాభాతో పట్టణాల్లో ట్రాఫిక్‌ కష్టాలు సైతం పెరుగుతున్నాయి. ట్రాఫిక్‌లో చిక్కుకుని గంటల తరబడి ఇబ్బందులు పడుతుంటాం. అయితే.. ఆ సమస్యలకు చెక్‌ పెట్టనున్నారు బెంగళూరు ట్రాఫిక్‌ పోలీసులు. అందుకోసం గూగుల్‌తో ఒప్పందం కుదుర్చుకున్నారు. గూగుల్‌ సాయంతో ట్రాఫిక్‌ కష్టాలు తీరుతాయని చెబుతున్నారు. అదేలా అంటారా?. నగరంలోని ట్రాఫిక్‌ సిగ్నల్స్‌ను త్వరలోనే గూగుల్‌తో అనుసంధానిస్తామని, దాని ద్వారా పెద్ద మార్పు రాబోతోందని పేర్కొంటున్నారు ఉన్నతాధికారులు. 

రోడ్లపై భారీగా వాహనాలతో ట్రాఫిక్‌ను నియంత్రించటం బెంగళూరు పోలీసులకు తలనొప్పిగా మారింది. దీంతో ట్రాఫిక్‌ను సులభంగా నియంత్రించి, కష్టాలను తీర్చేందుకు సాంకేతిక దిగ్గజం గూగుల్‌తో ఒప్పందం కుదుర్చుకున్నారు. పోలీసులు గూగుల్‌తో నేరుగా చేతులు కలపటం దేశంలోనే తొలిసారిగా పేర్కొన్నారు బెంగళూరు పోలీస్‌ కమిషనర్‌ ప్రతాప్‌ రెడ్డి. ‘నగరంలో ట్రాఫిక్‌ను నియంత్రించి, ఇబ్బందులు తప్పించేందుకు గూగుల్‌తో చేతులు కలపటం చాలా గర్వంగా ఉంది. ఇది లక్షల మంది ప్రయాణికులు రోజువారీ జీవనంపై సానుకూలు ప్రభావం చూపిస్తుంది. ఇటీవలే ట్రాఫిక్‌ లైట్స్‌ను గూగుల్‌తో ఆప్టిమైజ్‌ చేసే పైలెట్‌ ప్రాజెక్టును ప్రారంభించాం. అది సిగ్నల్స్‌ వద్ద వెయిటింగ్‌ టైమ్‌ను చాలా వరకు తగ్గించింది. నగరంలో తలెత్తుతున్న ట్రాఫిక్‌ సమస్యకు గూగుల్‌ నుంచి ఇన్‌పుట్స్‌ తీసుకుంటాము. కృత్రిమ మేథా ద్వారా నగరంలోనే ట్రాఫిక్‌ ను అంచనా వేసి పోలీసుకు సమాచారం ఇస్తుంది గూగుల్‌. దాంతో కొత్త ప్లాన్‌ను అమలు చేస్తాం. ఇప్పటికే గూగుల్‌ ఇచ్చిన డేటా ప్రకారం.. ఇప్పటికే సుమారు 20శాతం వెయిటింగ్‌ టైమ్‌ తగ్గింది. సమయం తగ్గటమే కాదు.. ఇంధనాన్ని ఆదా చేస్తుంది, నగరంలో అనవసరం ట్రాఫిక్ జామ్‌లను నియంత్రిస్తుంది.’ అని పేర్కొన్నారు. 

బెంగళూరు నగరంలో కోటికిపైగా వాహనాలు ఉన్నాయి. త్వరలోనే అన్ని సిగ్నల్స్‌ను గూగుల్‌తో ఆప్టిమైజ్‌ చేస్తామన్నారు కమిషనర్‌. రహదారులపై ట్రాఫిక్‌ వివరాలను రియల్‌ టైమ్‌లో గూగుల్‌ అందిస్తుందని, ఆ సమచారాన్ని ప్రయాణికులకు అందించటం వల్ల ఇబ్బందులు తప్పుతాయన్నారు. అలాగే.. గూగుల్‌ మ్యాప్స్‌లో స్పీడ్‌ లిమిట్స్‌ను ఏర్పాటు చేస్తామని, దాని ద్వారా ఓవర్‌ స్పీడ్‌లను కట్టడి చేయవచ్చన్నారు.

ఇదీ చదవండి: Kochi: మొదట బుల్లెట్‌.. ఇప్పుడు బస్‌! స్టీరింగ్‌ ఏదైనా ‘లా’గించేస్తుంది!

మరిన్ని వార్తలు