బెంగళూరులో ప్రాణవాయువుకు గిరాకీ

7 Apr, 2021 13:57 IST|Sakshi
ప్రతీకాత్మక చిత్రం

సాక్షి, బెంగళూరు: కన్నడనాట రెండోదఫా కోవిడ్‌ పంజా విసురుతోంది. రోజూ డిశ్చార్జిల కంటే యాక్టివ్‌ కేసుల సంఖ్య శరవేగంగా పెరుగుతోంది. అలాగే ఐసీయూలో చేరుతున్న కరోనా రోగుల సంఖ్య కూడా తక్కువేమీ కాదు. ఈ నేపథ్యంలో బెంగళూరులో కరోనా రోగులకు ఆక్సిజన్‌ సిలిండర్ల వినియోగం పెరిగింది. ఫలితంగా ఆక్సిజన్‌ సిలిండర్లకు డిమాండ్‌ పెరిగింది. 

కరోనా వల్ల కర్ణాటకలో ఐసీయూ పడకల వినియోగం 60–70 శాతం మేర పెరిగింది. ప్రస్తుతం రాష్ట్రవ్యాప్తంగా ఐసీయూలో 351 మంది ఉన్నారు. వీరిలో చాలా మందికి ఆక్సిజన్‌ సిలిండర్ల అవసరం ఉంది. గతేడాది 2020, సెప్టెంబర్‌లో రాష్ట్రంలో సగటున రోజుకి 814 ఐసీయూ కేసులు నమోదు అయ్యాయి. అప్పట్లో రాష్ట్రవ్యాప్తంగా 600 మెట్రిక్‌ టన్నుల ఆక్సిజన్‌ అవసరమవుతూ ఉండేది. ఇప్పుడు కూడా అంతేస్థాయిలో ఆక్సిజన్‌ సిలిండర్లకు డిమాండ్‌ ఏర్పడింది. అయితే ప్రస్తుతం ఆ స్థాయిలో ఆక్సిజన్‌ సిలిండర్ల సరఫరా లేదని అధికారులు వాపోతున్నారు. ఆస్పత్రులు, ఆక్సిజన్‌ సిలిండర్ల బ్యాంకుల్లో కూడా డిమాండ్‌ మేర వాటి సరఫరా లేకపోవడం మరింత ఆందోళన కలిగిస్తోంది. 

ప్రస్తుతం ఇళ్లకు అద్దెకు ఇచ్చే ఆక్సిజన్‌ సిలిండర్ల డిమాండ్‌ కూడా 10–15 శాతం మేర పెరిగింది. కొంతమంది అయితే భవిష్యత్తు అవసరాల దృష్ట్యా ఆక్సిజన్‌ సిలిండర్లను ముందుగానే కొనేస్తుండడంతో కొరత ఏర్పడింది. గతేడాది బెంగళూరు పరిధిలో 70 మెట్రిక్‌ టన్నుల ఆక్సిజన్‌ సిలిండర్లను సరఫరా చేయగా, ప్రస్తుతం 53 మెట్రిక్‌ టన్నుల ఆక్సిజన్‌ను సరఫరా చేస్తున్నారు. కొన్ని రోజులుగా హఠాత్తుగా డిమాండ్‌ పెరిగింది. 

ఇక్కడ చదవండి:
కరోనా డేంజర్‌.. నెగటివ్‌ రిపోర్టు ఉంటేనే

వైరస్‌ విస్ఫోటనం.. బెంగళూరులో కేసులు ఎందుకు అధికం?!

మరిన్ని వార్తలు