ఒకటీ రెండూ కోట్లు కాదు ఏకంగా రూ.775 కోట్లు మట్టిలోకే?

20 Feb, 2022 08:30 IST|Sakshi
ప్రశ్నార్థకంగా మారిన గోరుగుంటపాళ్య ఫ్లై ఓవర్‌ వంతెన  

సాక్షి, బెంగళూరు: ఒకటీ రెండూ కోట్లు కాదు ఏకంగా 775 కోట్ల రూపాయల ఖర్చు పదేళ్లకే వృథా అయ్యేలా ఉంది. అధికారులు, ప్రజాప్రతినిధుల నిర్లక్ష్యం, కాంట్రాక్టర్ల కక్కుర్తి వల్ల ఓ వంతెన మట్టిలో కలిసిపోయేలా ఉంది. రాజధాని బెంగళూరు నగరం నుంచి సుమారు 20 జిల్లాలకు వెళ్లే మార్గంలో ఎంతో ప్రధానభూమిక పోషిస్తున్న గోరుగుంటపాళ్య ఫ్లై ఓవర్‌ వంతెన దశాబ్దానికే పాడైపోయింది. సుమారు 56 రోజుల మరమ్మతుల తర్వాత పెద్ద పెద్ద వాహనాలను కాదని, చిన్న వాహనాలకే అనుమతిస్తున్నారు. బెంగళూరు నుంచి తుమకూరు వెళ్లే మార్గంలో గోరుగుంటపాళ్య నుంచి నాగసంద్ర వరకు ఉండే వంతెనను పడగొట్టాలని బెంగళూరులోని ఐఐఎస్‌సీ విద్యాసంస్థ నిపుణులు సూచిస్తున్నారు. 2010లో రూ.775.70 కోట్ల ఖర్చుతో భారత జాతీయ రహదారుల ప్రాధికార సంస్థ (ఎన్‌హెచ్‌ఏఐ) ఈ 5 కిలోమీటర్ల వంతెనను వంతెన నిర్మించారు.  

చదవండి: (సైన్యం ఆధునికీకరణ సరే! నిధులెక్కడ?)

డిసెంబరు నుంచి సమస్యలు మొదలు..  
వంతెన కింది భాగంలో ఉన్న 102, 103 నంబరు పిల్లర్ల వద్ద కేబుల్‌ కట్‌ కావడంతో సమస్య తలెత్తింది. ఈ క్రమంలో గత డిసెంబరు 25వ తేదీ నుంచి వంతెనపై రాకపోకలను నిషేధించారు. ఎన్‌హెచ్‌ఏఐ మరమ్మతులు చేపట్టింది. వంతెన పొడవునా కేబుల్‌ను అమర్చాల్సి రావడంతో  మరమ్మతులు రెండువారాలకు బదులు సుమారు రెండు నెలల పాటు కొనసాగాయి. ఇటీవలే పూర్తి చేశాక నిపుణులు తనిఖీలు చేస్తే ... వంతెన మొత్తం పాడైపోయేందుకు సిద్ధంగా ఉందని గమనించారు. దీంతో ఫ్లై ఓవర్‌ను నేలమట్టం చేయాల్సిందేనని తేల్చారు. దీంతో కొత్త వంతెన కోసం కేంద్ర రవాణా శాఖ మంత్రి నితిన్‌ గడ్కరీకి లేఖ కూడా రాసినట్లు సీఎం బసవరాజ్‌ బొమ్మై అసెంబ్లీలో వివరించారు. వారం రోజుల్లో తుది నిర్ణయం తీసుకుంటామని తెలిపారు.  

ఆటోలు, బైక్‌లకే అనుమతి..  
రెండు పిల్లర్లకు మరమ్మతుల తర్వాత వంతెనను గత బుధవారం సాయంత్రం నుంచి అందుబాటులోకి తెచ్చారు. బైక్‌లు, ఆటోలు, కార్లు, మినీ లారీలు వంటి చిన్న వాహనాలను మాత్రమే అనుమతించారు. భారీ వాహనాలు వెళ్లరాదని, వంతెన ప్రమాదకర స్థితిలో ఉందని బోర్డు పెట్టారు. వంతెన బాగున్న రోజుల్లో రోజు సుమారు 60 వేల వాహనాలు సంచరించేవి. మరమ్మతులు, మళ్లీ ఆంక్షల వల్ల వంతెన కింద విపరీతమైన ట్రాఫిక్‌ రద్దీ ఏర్పడుతోంది. కిలోమీటరు ప్రయాణానికి గంటల కొద్దీ పడుతోంది. ఈ కష్టాలకు ఎవరు కారణమని ప్రజలు ప్రశ్నిస్తున్నారు. 

మరిన్ని వార్తలు