నోరూరించే పీతల కూర.. సరోజ్‌ దీదీకి సాయం!

29 Jul, 2020 08:56 IST|Sakshi

మనసుంటే మార్గం ఉంటుందనే నానుడిని మరోసారి రుజువు చేశాడు బెంగళూరుకు చెందిన అంకిత్‌ వెంగులేర్కర్‌. తమ ఇంట్లో పనిచేసే‘సరోజ్‌ దీదీ’ చేతివంటకు గుర్తింపు తీసుకువచ్చి ఆమెకు మరో ఆదాయ మార్గాన్ని చూపాడు. ‘అక్క’వంటపనిలో నిమగ్నమైతే.. ఆ వంటకాలను అమ్మిపెట్టే బాధ్యతను తలకెత్తుకుని పెద్ద మనసు చాటుకుంటున్నాడు. లాక్‌డౌన్‌ కారణంగా మాయమైన చిరునవ్వులను తిరిగి తీసుకువచ్చి ఆ మాతృమూర్తి ముఖాన్ని వికసింపజేస్తున్నాడు. సోషల్‌ మీడియాలో వైరల్‌గా మారిన ఈ ‘అక్కాతమ్ముళ్ల’పై ట్విటర్‌ ఇండియా, పేటీఎం సహా ప్రముఖ చెఫ్‌ వికాస్‌ ఖన్నా వంటి సెలబ్రిటీలు ప్రశంసలు కురిపిస్తున్నారు.(శారదకు జాబ్‌ లెటర్‌: సోనూసూద్‌)

వివరాలు.. సరోజ్‌(47) అనే మహిళ గతంలో తన భర్తతో కలిసి మంగమమ్మనపాళ్యలో చిన్నపాటి హోటల్‌ నడిపేవారు. వారికి ముగ్గురు పిల్లలు ఉన్నారు. అయితే కొన్నాళ్ల క్రితం భర్త మరణించడంతో ఒంటరైపోయిన సరోజ్‌.. కుటుంబ పోషణ కోసం పనిమనిషి అవతారమెత్తింది. అలా అంకిత్‌ ఇంట్లోనూ పనికి కుదిరింది. ‘సరోజ్‌ దీదీ’అంటూ ఆమెను ఆప్యాయంగా పిలిచే అంకిత్‌కు.. ఆ అక్క చేతి వంట ఎంతగానో నచ్చింది. ఈ క్రమంలో.. హోం-డెలివరీ ఫుడ్‌ బిజినెస్‌ పెట్టాలనుకుంటున్నాననే తన ఆలోచనను అతడితో పంచుకుంది. దీంతో వెంటనే రంగంలోకి దిగిన అంకిత్‌.. సోషల్‌ మీడియా ద్వారా సరోజ్‌ వంటకాలను నెటిజన్లను పరిచయం చేశాడు. ఏడాది కాలంగా తమ ఇంట్లో పనిచేస్తున్న సరోజ్‌ దీదీ ఎంతో రుచికరంగా వండుతుందని, పరిశుభ్రత పాటిస్తారని చెప్పుకొచ్చాడు. ఆమె వంట చేస్తున్న వీడియోలు, నోరూరించే వంటకాల ఫొటోలను షేర్‌ చేశాడు. (‌మా ప్రాణాలు తీస్తారేంట్రా నాయ‌నా)

‘‘ బెంగళూరులోని హెచ్‌ఎస్‌ఆర్‌ లేఔట్‌ సమీపంలో నివసించే వాళ్లు రుచికరమైన భోజనం తినాలని భావిస్తే సరోజ్‌ దీదీని సంప్రదించండి. ఆమెకు అదనపు ఆదాయం సమకూరుతుంది. దయచేసి ఆమెకు అండగా నిలవండి’’అని అభ్యర్థించాడు. మంగళూరు పీతల కూర చేయడంలో సరోజ్‌ దీదీ దిట్ట అని, తన ట్వీట్‌కు స్పందించడం గొప్ప విషయమని, 10 ఆర్డర్లు వచ్చాయని, దీదీ ఎంతో సంతోషంగా ఉందంటూ ధన్యవాదాలు తెలిపాడు. ఈ నేపథ్యంలో అంకిత్‌ చొరవతో సరోజ్‌ జీవితంలో ఆనందం వెల్లివెరిసిందని, గొప్ప పనిచేశావంటూ నెటిజన్లు కొనియాడుతున్నారు.

మరిన్ని వార్తలు