స్మెల్‌ టెస్ట్‌ ఫెయిల్‌.. మాల్స్‌లోకి నో ఎంట్రీ: మేయర్‌

28 Jul, 2020 16:03 IST|Sakshi

బెంగళూరు: మాల్స్‌కు వెళ్లి షాపింగ్‌ చేయాలనుకుంటున్నారా.. అయితే ఒకసారి మీ ముక్కు సరిగా పని చేస్తుంది లేనిది చెక్‌ చేసుకోండి. ఎందుకంటే ఇక మీదట బెంగళూరులో షాపింగ్‌ మాల్స్‌లోకి వచ్చే వారికి టెంపరేచర్‌తో పాటు స్మెల్‌ టెస్ట్‌ కూడా చేయాలని నగర మేయర్‌ గౌతమ్‌ కుమార్‌ సూచించారు. ఎవరైనా వాసనను గుర్తించలేకపోతే.. వారికి కరోనా సోకినట్లే అంటున్నారు గౌతమ్‌ కుమార్‌. ఈ క్రమంలో మంగళవారం మేయర్‌ మాట్లాడుతూ.. ‘మాల్స్‌లోకి వచ్చే వారు ఎవరైనా స్మెల్‌ టెస్ట్‌లో ఫెయిలయితే.. వారిని లోనికి అనుమతించకండి. ఎందుకంటే కరోనా సోకిన వారు రుచి, వాసన గుర్తించలేరు. దీని గురించి కర్ణాటక ముఖ్యమంత్రికి, ఆరోగ్యశాఖ మంత్రి లేఖ రాస్తాను. మాల్స్‌లో స్మెల్‌ టెస్ట్‌లు చేయడం తప్పని సరి చేస్తూ ఆదేశించాల్సిందిగా లేఖలో కోరతాను’ అన్నారు గౌతమ్‌ కుమార్‌. (వైద్యుడి కుటుంబాన్ని వెంటాడిన కరోనా)

కేంద్ర ఆరోగ్య మంత్రిత్వ శాఖ సూచించిన దాని ప్రకారం కరోనా రోగుల్లో జ్వరం, గొంతు నొప్పి వంటి సాధారణ లక్షణాలతో పాటు వాసన, రుచి కోల్పోవడం వంటి వాటితో కూడా బాధపడుతున్నట్లు వెల్లడించింది. కానీ ఇంతవరకు ఒక్క కరోనా రోగిలో కూడా ఇలాంటి లక్షణాలు కనిపించలేదని సమాచారం. అయితే రుచి, వాసన కోల్పోటం అనే లక్షణాలు కరోనాలో మాత్రమే కాక ఫ్లూ, ఇన్‌ఫ్లూఎంజా ఉన్నప్పుడు కనిపిస్తాయంటున్నారు వైద్యులు. వ్యాధి ప్రారంభ దశలో ఈ లక్షణాలు కన్పిస్తాయని వీటిని గుర్తించిన వెంటనే చికిత్స అందించవచ్చని వైద్యులు తెలిపారు.ఆకస్మికంగా రుచి, వాసన కోల్పోవడం వంటి లక్షణాలను కరోనా పరీక్షకు ‍ప్రామాణికంగా  గత నెలలో ప్రభుత్వం పేర్కొన్న సంగతి తెలిసిందే.

మరిన్ని వార్తలు