బెంగళూరు పాత బస్సు రూ. లక్ష మాత్రమే.. ఆ డొక్కు బస్సులు మాకొద్దు!

23 Jun, 2022 14:49 IST|Sakshi

బెంగళూరు: బెంగళూరు మహానగర రవాణా సంస్థ (బీఎంటీసీ) పాత బస్సులను అమ్ముతోంది. 7 లక్షల కిలోమీటర్లకు పైబడి సంచరించిన బస్సులను ఈ రకంగా వదిలించుకోనుంది. ఒక్కో బస్సు ధర కేవలం లక్ష రూపాయలే. అయితే మేం కొనేస్తాం అనుకుంటే తొందరపాటే. ఈ ధర వాయువ్య, ఈశాన్య ఆర్టీసీ విభాగాలకు మాత్రమే అన్వయిస్తుంది. ఈ మేరకు ఆర్టీసీకి బీఎంటీసీ ప్రతిపాదనలు పంపింది. తమ సోదర సంస్థలకు ఇవ్వడం కోసం బస్సుల ధరను తగ్గించారు. మిగిలిన రవాణా సంస్థలతో దీనిపై మాట్లాడలేదని ఓ బీఎంటీసీ అధికారి తెలిపారు.  

ఆ డొక్కు బస్సులు మాకు వద్దండి  
ఉత్తర కర్ణాటకలో దుస్థితికి చేరిన రోడ్లపై తిప్పడానికి బెంగళూరులో వాడి వదిలేసిన పాత బస్సుల కొనుగోలుకు వాయువ్య ఆర్టీసీ సిద్ధమైనట్లు తెలుస్తోంది. ఇదెక్కడి సవతి తల్లి ధోరణి అని వాయువ్య పరిధిలోకి వచ్చే హుబ్లీ– ధార్వాడ, రూరల్, చిక్కోడి, బెళగావి, హావేరి, బాగలకోట, గదగ్, ఉత్తర కన్నడ ఇలా ఆరు జిల్లాల ప్రయాణికులు ఆశ్చర్యపోతున్నారు. వాయువ్యలో ప్రస్తుతం 4 వేల పైగా బస్సులు సంచరిస్తున్నాయి. అయినా ప్రజలకు తగిన రవాణా సేవలు లభించడం లేదు. దీంతో కొత్త బస్సులు కొనుగోలు చేయాలన్న డిమాండ్లు ఎప్పటినుంచో ఉన్నాయి.

ఈ సమయంలో బీఎంటీసీకి చెందిన సుమారు 100 పాత బస్సులను కొనాలని వాయువ్య ఆర్టీసీ అధికారులు నిర్ణయించినట్లు సమాచారం. సంస్థ ఆర్థిక పరిస్థితి బాగాలేనందున సెకెండ్‌ హ్యాండ్‌ బస్సులు చాలని నిర్ణయించారు. దీనిపై ప్రజలు మండిపడుతున్నారు. ఉత్తమ రవాణా సేవలకు కొత్త బస్సులను కొనలేరా? అని ప్రశ్నిస్తున్నారు. ఈ ప్రాంతానికి చెందిన సీఎం బసవరాజ్‌ బొమ్మై తక్షణమే న్యాయం చేయాలని కోరారు.

మరిన్ని వార్తలు