పబ్లిక్‌ పార్క్‌ బయట బోర్డుతో ఖంగుతిన్న ప్రజలు.. డౌటనుమానాలతో నవ్వులు

13 Jul, 2022 19:13 IST|Sakshi

వైరల్‌: పబ్లిక్‌ పార్క్‌లు ఉండేది ఎందుకు? ‘ఇదేం ప్రశ్న.. ప్రజల అవసరాల కోసం.. కాలక్షేపం చేసేందుకు’ అనేగా మీ సమాధానం. కానీ, కొన్ని పార్కుల నిర్వాహకులు మాత్రం ప్రాంగణంలో ఫలానా పనులు చేయకూడదంటూ నిషేధం విధిస్తుంటాయి. కానీ, ఇక్కడో పార్క్‌ చిత్రవిచిత్రంగా సైన్‌ బోర్డు ఉంచింది. అది చూసి ఖంగుతినడం ప్రజల వంతు అవుతోంది. 

ఈ పార్క్‌లో జాగింగ్‌ చేయకూడదు, రన్నింగ్‌ చేయకూడదు.. అంతెందుకు యాంటీ క్లాక్‌ వైజ్‌గా(రివర్స్‌లో) వాకింగ్‌ కూడా చేయకూడదు అంటూ బోర్డు ఉంచింది బీబీఎంపీ. బీబీఎంపీ అంటే బృహత్‌ బెంగళూరు మహానగర పాలికె. అంటే బెంగళూరులో ఈ పార్క్‌, సైన్‌ బోర్డు పెట్టారన్నమాట. 

ప్రముఖ కంటెంట్‌ సైట్‌ రెడ్డిట్‌లో ఓ యూజర్‌ దీనిని షేర్‌ చేశారు. ఇవాళే ఈ బోర్డును చూశా అంటూ ఓ యూజర్‌ దీనిని రెడ్డిట్‌లో వదిలాడు. ఈ బోర్డును ఏ ఏరియాలో ఏర్పాటు చేశారో తెలియదుగానీ.. ఇంటర్నెట్‌లో నవ్వులు పూయిస్తోంది ఈ బోర్డు. 

అలాంటప్పుడు ఆ పార్క్‌లో ఏం చేయాలని ఆ బోర్డు ఏర్పాటు చేశారో చెప్పాలంటూ నిలదీస్తున్నారు పలువురు. ఇంకొందరైతే వాకింగ్‌, జాగింగ్‌ కాకపోతే నాగిని డ్యాన్స్‌ చేయాలా? ఏంటి ప్రశ్నిస్తున్నారు. మరికొందరు పాకాలని, ఇంకొందరు రివర్స్‌లో పాకితే సరిపోతుందా? అని ప్రశ్నిస్తున్నారు. ఇలా ఎవరి డౌటనుమానాలతో వాళ్లు నవ్వులు పంచుతున్నారు నెటిజన్స్‌. 

ఇదిలా ఉంటే.. బెంగళూరు నుంచి ఇలా సైన్‌ బోర్డు వైరల్‌ కావడం తొలిసారేం కాదు. గతంలో ఓ ఇంటి ముందు నో పార్కింగ్‌ బోర్డు కూడా ఇలాగే వైరల్‌ అయ్యింది.

మరిన్ని వార్తలు