వీడియో కాల్‌తో విపత్తు.. ఫోన్‌ లిఫ్ట్‌ చేశామో పోర్న్‌ చిత్రాలతో ఎడిట్‌ చేసి.. 

2 Dec, 2022 09:23 IST|Sakshi

సాక్షి, బెంగళూరు: సైబర్‌ కేటుగాళ్లు కొత్త అస్త్రంగా వాట్సాప్‌ వీడియో కాల్‌ ద్వారా వల వేస్తున్నారు. గుర్తుతెలియని లింక్‌ల ద్వారా అశ్లీల వీడియోలను పంపుతారు, వాటిని చూస్తే చాలు దీనిని అడ్డు పెట్టుకుని బ్లాక్‌మెయిల్‌ కు పాల్పడి డబ్బు గుంజేస్తారు. అందులో ఎక్కువగా ఇటీవల విశ్రాంత ఉద్యోగులు, వృద్ధులను టార్గెట్‌గా చేసుకున్నారు.  

పోర్న్‌ చిత్రాలతో ఎడిట్‌ చేసి 
ఫేస్‌బుక్, ట్విట్టర్, ఇన్‌స్టా గ్రాంలో ఫ్రెండ్‌ రిక్వెస్ట్‌ పంపించి పరిచయం చేసుకుని మోసానికి పాల్పడడం, లేదా నేరుగా వాట్సాప్‌లో వీడియో కాల్‌ చేయడం జరుగుతుంది. వీడియో కాల్‌చేసి మాట్లాడుతున్న సమయంలో ఒక్కసారిగా నగ్నచిత్రాలు చూపిస్తారు. అలా కాల్‌ను స్క్రీన్‌షాట్‌ లేదా రికార్డ్‌ చేసుకుని బ్లాక్‌మెయిల్‌కు దిగుతారు. డబ్బులు ఇవ్వకపోతే లైంగికంగా వేధించారని కేసు పెడతామని, సోషల్‌ మీడియాలో పోస్ట్‌ చేసి పరువు తీస్తామని హెచ్చరిస్తారు. దీంతో ఎక్కువమంది డబ్బులు పంపించి మోసపోయారు. అలాగే వాట్సప్, ఎస్‌ఎంఎస్‌ల ద్వారా లింక్‌లను పంపి ఇదే తరహా మోసాలు జరుగుతున్నాయి.  

ఒకరికి రూ. 6.95 లక్షల టోపీ 
ఆర్‌పీసీ లేఔట్‌లో నివాసం ఉండే విశ్రాంత అధికారి వంచనకు గురై రూ.6.95 లక్షలు పోగొట్టుకున్నాడు. గత నెల 20వ తేదీన అంకితా గుప్త అనే మహిళ అతని వాట్సాప్‌కు వీడియో కాల్‌చేసింది. ఫోన్‌ తీయగానే అటువైపు నుంచి నగ్నవీడియో కనబడింది. ఈ దృశ్యాలను వంచకులు రికార్డుచేసుకుని వీడియో ఎడిట్‌ చేశారు.  ఫోన్‌ చేసి డబ్బు డిమాండ్‌ చేశారు. డబ్బు ఇవ్వకపోతే యువతి నగ్నవీడియో చూడటాన్ని సోషల్‌మీడియాలో అప్‌లోడ్‌ చేస్తామని చెప్పి రూ.6.95 లక్షలు కాజేశారు. చివరకు బాధితుడు పశ్చిమ విభాగ సీఈఎన్‌ పోలీస్‌స్టేషన్‌లో ఫిర్యాదు చేయగా కేసు నమోదు చేశారు.  

చదవండి: (మీరే రూల్స్‌ ధిక్కరిస్తారా?.. పోలీసులకు క్లాస్‌ పీకిన మహిళ)

సైబర్‌క్రైం పోలీసుల సలహాలు  
►ఫేస్‌బుక్, ట్విట్టర్, ఇన్‌స్టా అకౌంట్ల ప్రొఫైల్స్‌ లాక్‌ చేయడం మంచిది. డేటాను నేరగాళ్లు సేకరించే అవకాశం ఉండదు 
►గుర్తుతెలియని వ్యక్తుల నుంచి దూరంగా ఉండాలి 
►గుర్తుతెలియని నంబరు నుంచి వీడియో కాల్‌ వస్తే జాగ్రత్త వహించాలి 
►అశ్లీల వీడియోలు, ఫోటోలు చూడటం, ఆ వెబ్‌సైట్లలో చాటింగ్‌ చేయడం మంచిదికాదు. 
►ఎవరైనా బ్లాక్‌మెయిల్‌ చేస్తే తక్షణమే సైబర్‌ క్రైం పోలీస్‌స్టేషన్‌లో ఫిర్యాదు చేయాలి.

యువతికి రూ.2.33 లక్షల వంచన
బనశంకరి: మ్యాట్రిమోనియల్‌ వెబ్‌సైట్‌లో వరుని కోసం గాలిస్తున్న యువతి నుంచి మోసగాడు రూ.2.33 లక్షలు కాజేశాడు. ఉళ్లాల ఉపనగరకు చెందిన సుస్మిత (28) వరుడు కావాలని వివరాలు నమోదు చేసింది. రాజీవ్‌ అనే వ్యక్తి  పరిచయం చేసుకున్నాడు. నేను విదేశాల్లో ఉద్యోగం చేస్తున్నానని త్వరలో భారత్‌కు వస్తానని చెప్పాడు. ఇద్దరూ కాల్స్, చాటింగ్‌ చేసుకుంటూ ఉన్నారు. భారత్‌కు రాగానే పెళ్లి చేసుకుంటానని నమ్మించాడు. కొద్దిరోజులకిందట ఫోన్‌చేసి తాను ఇండియాకు వచ్చానని, తన వద్ద ఉన్న విదేశీ కరెన్సీని మార్చుకోవడానికి కొంత రుసుము కావాలని చెప్పగా సుస్మిత అతని ఖాతాలకు రూ.2.33 లక్షలు పంపింది. ఇక అప్పటి నుంచి రాజీవ్‌ పత్తా లేడు. దీంతో బాధిత యువతి పోలీసులకు ఫిర్యాదు చేసింది.  

మరిన్ని వార్తలు