Viral Video: ప్రారంభించిన 4 నెలలకే కుంగిన రోడ్డు.. ‘అట్లుందటి ప్రభుత్వ పనితనం’

10 Oct, 2022 19:42 IST|Sakshi

సాక్షి, బెంగళూరు: కర్ణాటక రాజధాని బెంగుళూరులో ఓ సర్వీస్‌ రోడ్డు ఆదివారం కుంగిపోయింది. ప్రారంభించిన నాలుగు నెలలకే రోడ్డుపై ఇలా గుంతలు పడటం గమనార్హం. బెంగళూరులోని తూర్పు శివారు ప్రాంతాలను ఐటీ హబ్‌లోని ఇతర ప్రాంతాలకు కలిపేలా కుందనహళ్లి అండర్‌పాస్ నిర్మించారు. బృహత్‌ బెంగళూరు మహానగర పాలికే(బీబీఎంపీ) రూ. 19.5 కోట్లతో ఈ అండర్‌పాస్‌ను నిర్మించింది. ఇందులో భాగంగా వేసిన సర్వీస్‌ రోడ్డు ఆదివారం కుంగిపోయింది. దీనికి సంబంధించిన వీడియో నెట్టింట్లో వైరల్‌గా మారింది. 

కాగా బీజేపీ ప్రభుత్వంలోని అవినీతే దీనికి కారణమంటూ ప్రతిపక్ష కాంగ్రెస్ విరుచుకుపడింది. ప్రభుత్వ నాసిరకపు పనికి ఇది నిదర్శమని మండిపడింది. కాంట్రాక్టర్‌ నుంచి ‘40 శాతం’ కమీషన్‌ అంటూ బీజేపీపై కాంగ్రెస్ నేత, ఎమ్మెల్యే నాగరాజు యాదవ్‌ విమర్శించారు. సంబంధిత కాంట్రాక్టర్‌తోపాటు ప్రభుత్వ అధికారులపై క్రిమినల్‌ కేసులు నమోదు చేయాలని ఆయన డిమాండ్‌ చేశారు. బెంగళూరు నగరానికి ప్రత్యేక మంత్రి కావాలని తాము డిమాండ్‌ చేస్తున్నామని.. బెంగళూరు ఇంచార్జీ అయిన సీఎం బసవరాజ్‌ బొమ్మై ఆ బాధ్యతలు నెరవేర్చడంలో విఫలమయ్యారని దుయ్యబట్టారు..

ప్రస్తుతం కుంగిపోయిన రోడ్డుపై అధికారులు మరమ్మతులు చేపట్టారు. ఈ పనులు పూర్తి కావడానికి మరికొన్ని రోజులు పట్టనుంది. మరోవైపు రోడ్డు లోపల పైప్‌ లైన్‌ పగలడం వల్ల గత కొన్ని రోజులుగా నీరు చేరి రోడ్డు కుంగిందని ఎగ్జిక్యూటివ్‌ ఇంజినీర్‌ తెలిపారు. బెంగళూరు వాటర్‌ సప్లై, సీవేజ్‌ బోర్డు పగిలిన పైప్‌లైన్‌ను సరిచేసినట్లు చెప్పారు.  ఈ ఘటనకు కాంట్రాక్టర్‌ బాధ్యత వహిస్తూ..  ఉచితంగా రోడ్డుకు మరమ్మత్తులు చేయనున్నట్లు బెంగుళూరు మున్సిపల్‌ అధికారులు తెలిపారు. 

మరిన్ని వార్తలు